ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిలాకర్-ఉమంగ్ అనుసంధానం: ప్రభుత్వ సేవల నిరంతర సౌలభ్యం
Posted On:
09 OCT 2024 6:27PM by PIB Hyderabad
ఉమంగ్ యాప్ ను ప్రభుత్వ అధీనంలోని డిజిటల్ వాలెట్ కు చెందిన డిజిలాకర్ తో అనుసంధానం చేసినట్లు నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఇజిడి) ప్రకటించింది. ఈ అనుసంధానంతో ప్రభుత్వ విస్తృత శ్రేణి సేవలు నిరంతరాయంగా అందుతాయని పేర్కొంది. తద్వారా వినియోగదారులకు ఒకే వేదిక ద్వారా అనేక సేవల ప్రదానానికి వెసులుబాటు కలుగుతుంది.
‘ఉమంగ్’ సేవలు ఇకపై ఇంకా సులభం:
ఈ అనుసంధానం ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లు వాడే వారందరికీ అందుబాటులో ఉండగా, ‘ఐఒఎస్’ ఆధారిత ఫోన్లలోనూ త్వరలోనే లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమంగ్ ద్వారా అందే సేవలను డిజిలాకర్ ద్వారా కూడా కొన్ని సులభ పద్ధతుల్లో పొందవచ్చు.
ఇందుకోసం ఏంచేయాలంటే:
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ‘డిజిలాకర్’ను తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి
2. అనంతరం ‘డిజిలాకర్’ యాప్ తెరవండి
3. అందులో కనిపించే ‘ఉమంగ్’ ఐకాన్ మీద క్లిక్ చేయండి
4. అటుపైన సూచనల ప్రకారం ఉమంగ్ యాప్ ను ఇన్‌స్టాల్ చేయండి
5. ఇక అనేక రకాల ప్రభుత్వ సేవలను డిజిలాకర్ ద్వారానే పొందండి
ప్రభుత్వం-పౌరుల మధ్య సంబంధాలు సరళం
ఈ అనుసంధానం ద్వారా సమర్థ, డిజిటల్-ఫస్ట్ విధానంలో ప్రభుత్వం-పౌరుల మధ్య పరస్పర సంబంధాల నిర్వహణ సౌలభ్యం కలుగుతుంది. వ్యక్తిగత, అధికారిక పత్రాల భద్రత, లభ్యతల రీత్యా డిజిలాకర్ ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పుడిక ‘ఉమంగ్’ ఏకీకరణతో ఎప్పుడు... ఎక్కడైనా పొందగల సేవల పరిధి మరింత విస్తరించింది.
డిజిలాకర్ గురించి...
డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద కీలక పత్రాల సురక్షిత క్లౌడ్-ఆధారిత నిల్వకు ఉద్దేశించిన ప్రధాన ఉపకరణమే డిజిలాకర్. ఇప్పుడు ఉమంగ్ వంటి ఇ-గవర్నెన్స్ సేవల వేదికతో దాని అనుసంధానం వల్ల డిజిలాకర్ మరింత అందుబాటులోకి వస్తుంది. అంతేగాక జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
మరిన్ని వివరాల కోసం www.digilocker.gov.in చూడండి.
***
(Release ID: 2063682)
Visitor Counter : 99