కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘యూనివర్సల్ పోస్టల్ యూనియన్’ 150వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక తపాలాబిళ్ళల విడుదల

Posted On: 09 OCT 2024 2:30PM by PIB Hyderabad

 ‘యూనివర్సల్ పోస్టల్ యూనియన్’ (యూపీయూ) 150 వ వార్షికోత్సవం సందర్భంగా, భారత ప్రభుత్వ తపాలా విభాగం, నేటి ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళల విడుదల ద్వారా జరుపుకొంది. న్యూఢిల్లీ ‘మేఘ్ దూత్ భవన్’ లో జరిగిన కార్యక్రమంలో, తపాలా కార్యదర్శి వందితా కౌల్ స్టాంపులను విడుదల చేశారు. ప్రపంచ తపాలా సేవలకు దిక్సూచిగా నిలిచిన యూపీయూ చారిత్రక పాత్రకు గౌరవసూచకంగా జరిగిన ఈ కార్యక్రమానికి, పోస్టల్ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు.  

1874, అక్టోబర్ 9న స్విట్జర్లాండ్ బర్న్ నగరంలో ప్రారంభమైన యూపీయూ, ఆధునిక యుగంలో తపాలా రంగంలో సహకారానికి మార్గదర్శిగా నిలిచింది. సమితిలో అనేక ఏళ్లుగా క్రియాశీలక సభ్యురాలిగా భారత్ కొనసాగుతోంది. అంతర్జాతీయ తపాలా నియమ నిబంధనలను ప్రామాణీకరించడం ద్వారా, 192 సభ్య దేశాల మధ్య తపాలా పంపిణీ సజావుగా కొనసాగేందుకూ, అందరికీ తపాలా సేవలు అందుబాటులోకి తెచ్చేందుకూ యూపీయూ కృషి చేసింది.

యూపీయూ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా పంపిన సందేశం: “ప్రపంచ తపాలా దినోత్సవం రోజున, యూపీయూ 150 వార్షికోత్సవాల సూచకంగా భారత ప్రభుత్వ తపాలా శాఖ స్మారక తపాలా బిళ్ళల సెట్ ను విడుదల చేయడం మనందరికీ గర్వకారణం. ఎల్లలులేని సమాచార మార్పిడి రూపుదిద్దుకోవడంలో యూపీయూ పాత్ర మరువరానిది. స్టాంపుల విడుదల ద్వారా సృజన, సహకారాల పట్ల భారత్ నిబద్ధతను మరోసారి చాటుకున్నాం. ప్రపంచ పోస్టల్ వ్యవస్థలో భారత్ కు విడదీయరాని అనుబంధం ఉంది. కలిసికట్టుగా దూరాలను కలిపే వారధులను నిర్మిద్దాం, సమూహాలని ఏకం చేద్దాం, దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచుదాం”.

స్టాంపుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న వందితా కౌల్, యూపీయూ ప్రాముఖ్యాన్ని గురించి వివరిస్తూ, “ప్రపంచ తపాలా రంగంలో సహకార స్ఫూర్తిని  పాదుకొల్పడంలో యూపీయూ పాత్ర అమూల్యమైనది. యూపీయూ పథకాల్లో క్రియాశీలకంగా పాల్గొనే మన దేశం, తపాలా వ్యవస్థ ఆధునికీకరణ కోసం శ్రమిస్తోంది. డిజిటల్ పద్ధతులు, ఇ-కామర్స్ వంటి నూతన సాంకేతికతలతో ప్రపంచ పోస్టల్ రంగంలో అగ్రగామిగా మారి, తన ముద్రను బలంగా వేస్తోంది”, అన్నారు.

దేశ సేవలో ‘ఇండియా పోస్ట్’ 170 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఏడాది ప్రపంచ తపాలా దినోత్సవం భారత తపాలా శాఖకు మరింత ప్రత్యేకంగా మారింది. నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకూ, ఇండియా పోస్ట్ అత్యవసర సేవలను అందించడంలో ముందుంటూ, దేశ ప్రజలను కలిపే వారధిగా నిలుస్తోంది.  

యూపీయూకి గల సహకార, సమ్మిళిత స్ఫూర్తి, సృజనాత్మక విలువలను పంచుకునే మన దేశం, యూపీయూతో గల బలమైన అనుబంధాన్ని, మూడు స్టాంపుల సెట్ విడుదల ద్వారా చాటుకుంది. తపాలా సేవలు దూరాలను కలిపే వంతెనలుగా, చక్కని సమాచార మార్పిడి వ్యవస్థగా నిలుస్తూ, ప్రపంచ ప్రజలను దగ్గర చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అతి విస్తారమైన నెట్వర్క్ కలిగిన ‘ఇండియా పోస్ట్’, యూపీయూ లక్ష్యాలతో అనుసంధానమవుతూ, సేవలను ఆధునికీకరించుకుంటూ, ప్రపంచవ్యాప్త తపాలా వ్యవస్థ బలోపేతంలో  తన వంతు పాత్ర పోషిస్తోంది.

 

***



(Release ID: 2063680) Visitor Counter : 18