వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ‘బలవర్ధక బియ్యం’ ఉచిత పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు మంత్రివర్గ ఆమోదం
75వ స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని చేసిన ప్రసంగానికి అనుగుణంగా ‘రక్తహీనతా రహిత భారత దేశ’ దిశగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ కొనసాగింపు
ప్రధానమంత్రి ఆశయాల మేర పౌష్టికాహార భద్రత సాధన దిశగా ముందడుగు
Posted On:
09 OCT 2024 3:09PM by PIB Hyderabad
జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) ఉచిత పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాలు ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లోనే కొనసాగుతాయి.
ఆహార సబ్సిడీలో భాగంగా భారత ప్రభుత్వం 100 శాతం నిధులు సమకూర్చుతుండడంతో, ‘పీఎంజీకేఏవై’ ద్వారా బియ్యంలో పోషకాల చేరిక కేంద్రీయ పథకంగా కొనసాగుతుంది. తద్వారా ఏకీకృత వ్యవస్థల ద్వారా పథకం అమలు సాధ్యపడుతుంది.
మన దేశంలో పోషకాహార భద్రత ఆవశ్యకత గురించి 75వ స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని చేసిన ప్రసంగానికి అనుగుణంగా, రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపం వంటి వాటిని సరిదిద్దేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అనేక పథకాలు అమలవుతున్నాయి. ‘లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ’ (టీపీడీఎస్) ద్వారా ‘బలవర్ధక బియ్యం’ పంపిణీ, ‘సమీకృత శిశు సంరక్షణ సేవలు-ఐసీడీఎస్’, ‘పీఎం పోషణ్’ (పూర్వ ఎండీఎం పథకం), ఇతర సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. మార్చి 2024 నాటికల్లా దేశం మొత్తంలో దశలవారీగా బలవర్ధక బియ్యం పథకం అమలు చేయాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కమిటీ సిఫార్సు చేసింది. మూడు-దశల పథకం అమలు పూర్తవ్వడంతో 2024 మార్చ్ నాటికి, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందరికీ బలవర్ధక బియ్యం పంపిణీ లక్ష్యాన్ని చేరుకున్నట్లయింది.
2019-2021 మధ్య కాలంలో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్-5) అధ్యయనం ప్రకారం- వయసు, ఆదాయాలకి సంబంధం లేకుండా భారతదేశంలో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందనీ, పిల్లలతోపాటు స్త్రీపురుషులను ప్రభావితం చేస్తోందని తేలింది. ఇనుము ధాతు, బీ-12, ఫోలిక్ యాసిడ్ లోపాలు, వీటితోపాటు విటమిన్లు, ఖనిజాల లోపం కూడా ఉందని తేలింది. ఈ లోపాలు ప్రజల ఆరోగ్యం, ఉత్పాదకతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
రక్తహీనత, సూక్ష్మపోషక లోపాల సమస్య పరిష్కారం కోసం ఆహారంలో అదనపు పోషకాలను చేర్చడం- ప్రపంచ వ్యాప్తంగా సమర్ధమైన, సురక్షితమైన పద్ధతిగా గుర్తింపు పొందింది. 65 శాతం భారతీయుల సంప్రదాయ ఆహారం వరి కాబట్టి, బియ్యంలో పోషకాలను చేర్చి అందించాలని ప్రభుత్వం భావించింది. ‘ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్’ (ఎఫ్ఆర్కే)ను బియ్యంలో చేర్చడం ద్వారా బలవర్ధక బియ్యం తయారవుతోంది. ‘ఎఫ్ఆర్కే’లో ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’-‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 వంటి సూక్ష్మ పోషకాలను కలుపుతారు.
***
(Release ID: 2063602)
Visitor Counter : 74
Read this release in:
Bengali-TR
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam