ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తల్లుల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ అంశాలలో భారత్ నాయకత్వానికి యూఎన్ఎఫ్‌పీఏ ప్రశంస

ప్రసూతి మరణాల నిష్పత్తిని తగ్గించడంలో భారతదేశపు ప్రశంసనీయమైన కృషి

ప్రసూతి మరణాల నిష్పత్తి 2000 and 2020లో 70 శాతానికి తగ్గుదల

Posted On: 09 OCT 2024 8:56AM by PIB Hyderabad

తల్లుల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ అంశాల్లో భారతదేశం సాధించిన ప్రగతిని యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ (యుఎన్ఎఫ్‌పిఏ) ప్రశంసించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల వాస్తవకు ప్రశంస పూర్వక బహుమతితో పాటు ధ్రువపత్రాన్ని యుఎన్ఎఫ్‌పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కానెమ్ అందజేశారు. అనంతరం ఆమెను సత్కరించారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంతో కలిసిపని చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు యుఎన్ఎఫ్‌పిఎ స్పష్టం చేసింది.

 

తల్లుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ, ప్రసూతి పరమైన మరణాలను నివారించడంలో సున్నా స్థాయి లక్ష్యాన్ని సాధించడానికి పాటుపడుతున్నది. ఈ కార్యక్రమాలలో ‘సురక్షిత్ మాతృత్వ్ ఆశ్వాసన్ యోజన’ (ఎస్‌యూఎమ్ఎఎన్), ‘ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ్ అభియాన్’ (పిఎమ్ఎస్ఎమ్ఏ)లతో పాటు ‘ప్రసూతి వైద్య సేవల కార్యక్రమం’ల పరిధులలో నాణ్యమైన, గౌరవాన్విత మాతృత్వ సంరక్షణ సేవలను అందిస్తూ వస్తున్నారు.

 

నేషనల్ హెల్త్ మిషన్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ శ్రీమతి ఆరాధన పట్ నాయక్; రీప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ (ఆర్‌సీహెచ్) సంయుక్త కార్యదర్శి శ్రీమతి మీరా శ్రీవాస్తవ; యుఎన్ఎఫ్‌పీఏ ఆసియా పసిఫిక్ ప్రాంతం డైరెక్టర్ శ్రీ పియో స్మిత్; యుఎన్ఎఫ్‌పీఏలో భారతదేశం ప్రతినిధి ఆండ్రియా ఎమ్. వోజ్‌నార్ లు కూడా పాల్గొన్న కార్యక్రమంలో, యుఎన్ఎఫ్‌పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కానెమ్ మాట్లాడుతూ 2000 సంవత్సరం నాటి నుంచి 2020వ సంవత్సరం మధ్య కాలంలో మాతృ మృత్యు నిష్పత్తి (ఎమ్ఎమ్ఆర్)ను చెప్పుకోదగ్గ స్థాయిలో 70 శాతం మేర తగ్గించడంలో భారతదేశం మహత్తర కృషిని చేసిందంటూ ప్రశంసించారు. దీనితో 2030వ సంవత్సరానికన్నా ముందే 70కి లోపు ఎమ్ఎమ్ఆర్ ను చేరుకోవాలన్న స్థిరాభివృద్ధి లక్ష్యం (ఎస్‌డిజి) దిశలో దేశాన్ని నడుపుతూ ఉన్నారని ఆమె అన్నారు. ఈ ప్రశంసనీయ ప్రగతి మూలంగా దేశం నలుమూలల, మరీ ముఖ్యంగా సమాజంలో ఆదరణకు నోచుకోకుండా దూరంగా ఉండిపోయిన సముదాయాలకు చెందిన, వేల కొద్దీ మహిళల ప్రాణాలను కాపాడినట్లు అయిందని డాక్టర్ నతాలియా కానెమ్ అన్నారు.

 

మొత్తం కాన్పు రేటు (టిఎఫ్ఆర్-2) పరంగా చూసినప్పుడు ఇది రీప్లేస్ మెంట్ స్థాయి కన్నా దిగువకు క్షీణించడంతో, భారతదేశ కుటుంబ నియంత్రణ కార్యక్రమం సరికొత్త శిఖర స్థాయిలకు చేరుకొంది. గత కొన్నేళ్ళుగా, సంతాన నిరోధక ఎంపికల ప్రత్యామ్నాయాల పరిధిని విస్తరించడంలో యుఎన్ఎఫ్‌పీఏ ఒక కీలక పాత్రను పోషించింది. ఈ సహకారంలో ఇటీవలే సబ్‌ డెర్మల్ ఇంప్లాంట్స్ తో పాటుగా డిపో మీడ్రాక్సీప్రోజెస్టిరాన్ ఎసీటేట్ (డీఎమ్‌పీఏ) అనే సూదిమందులను అందించడం కూడా ఒక భాగంగా ఉంది.

 

ప్రపంచంలోని పునరుత్పత్తి సంబంధిత ఆరోగ్య వేదికలలో భారత ఆరోగ్య. కుటుంబ సంక్షేమ శాఖ నాయకత్వానికి గుర్తింపు లభించింది. ఎలాగంటే ద పార్ట్‌నర్‌షిప్ ఫర్ మెటర్నల్, న్యూబార్న్ & చైల్డ్ హెల్త్ (పీఎమ్ఎన్‌సీహెచ్)లోను, ఫ్యామిలీ ప్లానింగ్ 2030లోను ప్రపంచ భాగస్వామ్య వేదికలలో కీలక స్థానాలను భారతదేశం నిర్వహిస్తున్నది.

 

***



(Release ID: 2063427) Visitor Counter : 8