రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

చెన్నై తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో భారత వాయుసేన 92వ వార్షికోత్సవాలు: ఆత్మనిర్భర సంకల్పం, ఆయుధ సంపత్తి ప్రదర్శన ముఖ్యాంశాలు


వేడుకల్లో పాల్గొన్న త్రివిధ దళాల ప్రధానాధికారి

గౌరవ వందనాన్ని స్వీకరించిన వాయుసేన అధిపతి

ప్రపంచ భద్రతా పరిస్థితుల దృష్ట్యా బలమైన వాయుసేన అత్యవసరం:

ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

“వివిధ రక్షణ వ్యవస్థల మధ్య కేంద్రీయ అనుసంధానం గల నేటి పరిస్థితుల్లో, సృజనాత్మకతతో కూడిన అత్యాధునిక సాంకేతికతను అవలంబించడం కీలకం”

Posted On: 08 OCT 2024 1:24PM by PIB Hyderabad

చెన్నై తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో అక్టోబర్ 8న  భారత వాయుసేన 92వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. అద్భుతమైన గగనతల ప్రదర్శన, అద్వితీయమైన కవాతు, అత్యాధునిక ఆయుధ సంపత్తి ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ వేడుకలకు త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. వాయుసేన అధిపతి ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు.

జాతి ప్రయోజనాలను కాపాడడంలో ఎదురయ్యే సవాళ్ళపై విజయం సాధించేందుకు వైమానిక దళం సదా సన్నద్ధంగా ఉండాలని ఎయిర్ ఛీఫ్ మార్షల్ పిలుపునిచ్చారు. క్షణక్షణం మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితులు, కొనసాగుతున్న యుద్ధాల దృష్ట్యా బలమైన వాయుసేన అత్యవసరమని ఏపీ సింగ్ చెప్పారు. వివిధ రక్షణ వ్యవస్థల మధ్య కేంద్రీయ అనుసంధానం గల నేటి పరిస్థితుల్లో, సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనలతో, అత్యాధునిక సాంకేతికతను అవలంబించడం కీలకమని అన్నారు.

ఈ ఏడాది వాయుసేన దినోత్సవ ఇతివృత్తమైన “భారతీయ వాయుసేన: సామర్థ్యం, బలం, స్వశక్తి”, దళం ఆకాంక్షలను అతికినట్లు  ప్రతిబింబిస్తోందని ఎయిర్ ఛీఫ్ మార్షల్ పేర్కొన్నారు. “పోనుపోనూ సాంకేతికతను అలవర్చుకోవడంలో మనం మరింత శక్తిని కూడగట్టుకుంటున్నాం. ఆయుధాలనూ, ఆయుధ వ్యవస్థలను సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో ప్రగతి సాధించాం. రక్షణ రంగ పరిశోధనలు, నూతన పరికరాల అభివృద్ధిలో ఆత్మ నిర్భర సాధన మన ప్రాధాన్యం కావాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, సృజనకారులు, నిపుణులు, పరిశోధన, అభివృద్ధిలో నిమగ్నమైన సంస్థలు, విద్యారంగ నిపుణుల భాగస్వామ్యంతో ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బలమైన చర్యలు తీసుకుంటున్నాం” అని వాయుసేన అధిపతి వివరించారు.

జాతి సేవకి పునరంకితమయ్యేందుకు గగన వీరులు సిద్ధంగా ఉండాలని ఉద్బోధించిన వైమానిక దళాధిపతి.. గత సంవత్సరంతో పోల్చి చూసుకొని ప్రస్తుత సామర్ధ్యాన్ని సమీక్షించుకోవాలని, వేడుకలను జరుపుకుంటూనే, మెరుగుదలకు సాధ్యమైన అంశాల పట్ల దృష్టి సారించి, ప్రస్తుత, భవిష్య అవసరాలకు అనుగుణంగా తమను తాము మలుచుకోవాలని పిలుపునిచ్చారు. 2023లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ... వాయుసేన తన సామర్ధ్యాన్ని నిరూపించుకొందని కితాబిచ్చారు. ‘‘అవసరమయిన సమయానికి, కచ్చితత్వంతో, ప్రతిసారీ ఆయుధాలను అందించగలగడం మన ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి నెలలో పోఖ్రాన్ లో జరిగిన ‘వాయు శక్తి’ ఆయుధ ప్రదర్శన కార్యక్రమంలో దీనిని మనం నిరూపించాం” అన్నారు.

ఈ సంవత్సరం స్నేహాసంబంధాలు గల దేశాలతో ద్వైపాక్షిక బహుపాక్షిక విన్యాసాల్లో వాయుసేన అధికసంఖ్యలో పాల్గొందని చెప్పారు. వివిధదేశాలతో కలిసి మనం నిర్వహించిన ‘తరంగ్ శక్తి’ విన్యాసాలు విజయవంతం కావడం, వాయుసేన సామర్ధ్యానికీ, గగనవీరుల అంకితభావానికీ మచ్చుతునకగా నిలిచిందని ఎయిర్ ఛీఫ్ మార్షల్ ప్రశంసించారు. 

మానవతా సహాయం, విపత్తు సహాయాలను అందించడంలో సరిహద్దులకు అతీతంగా మన దళం ఎప్పుడూ ముందుంటుందనీ, గత సంవత్సరం ఐఏఎఫ్ పాల్గొన్న సహాయ కార్యక్రమాలను ఉటంకించారు. సైనికులకు అనువైన పని వాతావరణాన్ని కల్పించేందుకు వైమానికదళం కట్టుబడి ఉందన్న వాయుసేన అధిపతి... సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబ సంక్షేమం ముఖ్యమైనవని పేర్కొన్నారు. 

కవాతు: ‘ప్రెసిడెంట్స్ కలర్స్’ దళ ప్రదర్శనతో ప్రారంభమైన కవాతు, దళం ఐకమత్యం, బలం, సహకార స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. త్రివిధ దళాల బ్యాండ్ ప్రదర్శనతో వాతావరణం శ్రావ్యతను  సంతరించుకుంది. కచ్చితత్వంతో కూడిన యుద్ధ వీరుల కవాతు చూపరుల మనసులని చూరగొంది.

గగన ప్రదర్శన: తదనంతరం ప్రారంభమైన గగనతల ప్రదర్శనలో తేలికపాటి యుద్ధవిమానాలు సహా  తేజస్, సుఖోయి-30, ఎంకేఐ, పిలాటస్ విమానాలు నేలకు అతి దగ్గరగా ఎగురుతూ సాహస ప్రదర్శన చేశాయి. ‘సూర్యకిరణ్ ఎరోబ్యాటిక్స్’ బృందం, ‘సారంగ్’ హెలికాప్టర్ బృందాలు చెన్నై గగనతలాన్ని జాతీయ పతాక రంగులతో నింపి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాయి.

ఆయుధ ప్రదర్శన: సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో అత్యాధునిక యుద్ధ సంపత్తిని ఉంచారు. తేలికరకం యుద్ధ విమానం ప్రచండ్, సీ -295 రవాణా విమానం, ఆకాష్ క్షిపణి వ్యవస్థ, అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ఎంకే-4, హెచ్ టీటీ-40 శిక్షణ విమానం, రోహిణి రాడార్ లు ప్రదర్శనలో భాగ్యమయ్యాయి.

భారతీయ వాయుసేన: ఒక శతాబ్ద కాలం నుంచీ తిరుగులేని అంకితభావంతో సేవలు అందిస్తున్న భారతీయ వాయుసేన - ఈ ఏడాది ఇతివృత్తం- సామర్థ్యం, బలం, స్వశక్తి- కి తగినట్లుగా గొప్ప పదర్శన నిర్వహించింది.

***


(Release ID: 2063244) Visitor Counter : 75