బొగ్గు మంత్రిత్వ శాఖ
వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ను సమీక్షించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
దేశ ఇంధన భద్రత కోసం కోల్ ఇండియా అనుబంధ సంస్థలన్నీ తమ వార్షిక లక్ష్యాలు సాధించాలని మంత్రి పిలుపు
భూసేకరణ, పర్యావరణ, అటవీ అనుమతులు, నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం
Posted On:
07 OCT 2024 4:53PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి నేడు నాగ్‌పూర్‌లోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సంస్థ పనితీరును సమీక్షించారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపీందర్ బ్రార్, కోల్ ఇండియా చైర్మన్ శ్రీ పి.ఎం.ప్రసాద్, డబ్ల్యుసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, పంపిణీ సామర్థ్యం, ప్రాజెక్టు ప్రభావిత ప్రజలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. సమావేశంలో సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికాల్లో బొగ్గు ఉత్పత్తి, పంపిణీ, ఓవర్ బర్డెన్ రిమూవల్ (ఓబీఆర్) వంటి కీలకాంశాలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా, ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డబ్ల్యూసీఎల్ తన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటుందని హామీ ఇచ్చారు.
దేశ బొగ్గు అవసరాలను తీర్చడానికి సీఐఎల్(కోల్ ఇండియా లిమిటెడ్) అనుబంధ సంస్థలన్నీ తమ వార్షిక లక్ష్యాలను సాధించాల్సిన అవసరాన్ని శ్రీ కిషన్ రెడ్డి తన ప్రసంగంలో అధికారులకు వివరించారు. బొగ్గు రంగంలో భారత్ స్వయం సమృద్ధిని (ఆత్మనిర్భరత) సాధించడానికి ప్రస్తుత మైనింగ్ కార్యకలాపాల విస్తరణతో పాటు, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ, అటవీ అనుమతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం సహా ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇటీవల నిర్వహించిన 'స్వచ్ఛతా హీ సేవా 2024' కార్యక్రమంలో విశేష కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు. కార్యక్రమ అనంతరం పారిశుద్ధ్య కార్మికుడు దివంగత శ్రీ నున్హరే కుమార్తె చదువు, కుటుంబ అవసరాల నిమిత్తం మంత్రి ఆర్థిక సహాయం అందించారు.
ఈ సమీక్ష సమావేశానికి ముందు కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి బొగ్గు మంత్రిత్వ శాఖ 'ఏక్ పేడ్ మా కే నామ్'(అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. డబ్ల్యూసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్మించిన అత్యాధునిక కృత్రిమ మేధ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ఐసీసీసీ)ను సందర్శించారు. బొగ్గు గనుల్లో చొరబాట్లు, అనధికారిక ప్రవేశాల నివారణ సహా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాయుధ భద్రతా సిబ్బంది ప్రత్యేక బృందమైన 'డబ్ల్యూసీఎల్ కోల్ ఎస్‌హెచ్ఏసీటీఈ దళ్' (Coal SHAcTE Dal) ను మంత్రి ప్రారంభించారు.
సందర్శనలో భాగంగా కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఎన్ఏసీసీఈఆర్ (నేషనల్ సెంటర్ ఫర్ కోల్ ఎనర్జీ రీసెర్చ్)ను ప్రారంభించారు. అనంతరం డబ్ల్యూసీఎల్ కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన 'తరాష్ 2.0'ను ప్రారంభించారు. ఇందులో ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షలకు 40 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడంతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, నెలకు రూ.1,000 ఉపకార వేతనాన్ని అందిస్తారు. తారాష్ 2.0 కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను కేంద్రమంత్రి సన్మానించారు.
కేంద్ర మంత్రి పర్యటన ఇంధన భద్రతను, సాంకేతిక పురోగతిని, ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టిని సూచిస్తుంది. ఎన్ఏసీసీఈఆర్, 'తారాష్ 2.0' వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఆవిష్కరణలను, విద్య, స్వయం సమృద్ధి సాధిస్తున్న బొగ్గు రంగంలో పురోగతిని సూచిస్తుంది. ఇది బొగ్గు రంగంలో పరిశోధనాభివృద్ధిని బలోపేతం చేస్తుంది, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది, సుస్థిర ఇంధన భవిష్యత్తుకు దోహదపడుతుంది.
***
(Release ID: 2063016)
Visitor Counter : 34