సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబరు 6న ప్రపంచ పాక్షిక పక్షవాత (సెరిబ్రల్ పాల్సీ) దినోత్సవం: అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న భారత్


ఈ ఏడాది ‘యునీక్లీ సీపీ’ ఇతివృత్తంగా- వ్యక్తికి వైకల్యం ఓ గుర్తింపు కాదని, విభిన్న శ‌క్తిసామర్థ్యాలు జీవిత లక్ష్యాల సాధన‌లో వారికి తోడ్ప‌డ‌గ‌ల‌వ‌ని అవగాహన పెంచేవిధంగా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2024 7:33PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా అక్టోబరు 6న ప్రపంచ పాక్షిక పక్షవాత (సెరిబ్రల్ పాల్సీ) దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈసారి ‘యునీక్లీ సీపీ’ #UniquelyCP ఇతివృత్తంగా ఈ రుగ్మతతో సహజీవనం చేస్తున్న వ్యక్తుల గళాన్ని మరింత గట్టిగా వినిపించడంలో ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా తమ ఆసక్తులు, అభిరుచులు, సాధించిన విజయాలు, తద్వారా లభించిన గుర్తింపును చాటుతూ వైకల్యం తమకు అడ్డుకాదని సెరిబ్రల్ పాల్సీ సమాజం తమ విశిష్టతను రుజువు చేసుకుంటుంది. ప్రతి వ్యక్తికీ తమదైన ప్రావీణ్య-నైపుణ్యాలు, మార్గాలు ఉంటాయని, ఈ నేపథ్యంలో తమకుగల ప్రత్యేక గుర్తింపును యావత్ సమాజం అర్థం చేసుకుని, అక్కున చేర్చుకోవాలన్నది ఈ ఏడాది ఇత్తవృత్తమిచ్చే సందేశం.

   కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్’ (డిఇపిడబ్ల్యుడి) నేతృత్వాన కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా దేశం నలుమూలలా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ విభాగం కిందగల వివిధ జాతీయస్థాయి సంస్థలు, ప్రాంతీయ కేంద్రాలు సెరిబ్రల్ పాల్సీపై అవగాహన కల్పన సహా ఈ రుగ్మత పీడితులకు సాధికారత దిశగా పలు కార్యక్రమాలను రూపొందించాయి.

   ఈ రుగ్మతతో వారి పోరాటంతోపాటు వారి సామర్థ్యాలు, ప్రతిభ, సవాళ్లను అధిగమించడంలో ప్రత్యేకతలను కూడా ఈ కార్యక్రమాలు ప్రముఖంగా చాటిచెబుతాయి. ఆ మేరకు సెరిబ్రల్ పాల్సీతో బాధపడే వ్యక్తులు తమ ప్రత్యేక శక్తిసామర్థ్యాలతో జీవిత లక్ష్యాలను సాధించగలరని ఈ వేడుకలు సమాజానికి శక్తిమంతమైన సందేశాన్నిస్తాయి.

   ప్రపంచవ్యాప్తంగా పాక్షిక పక్షవాతం (సెరిబ్రల్ పాల్సీ)పై అనేక అపోహలున్నాయి. ఫలితంగా దీనిబారిన పడినవారికి సామాజికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దురవగాహనను ఇకనైనా విడనాడి, ఈ రుగ్మత పీడితుల ప్రతిభను, గుర్తింపును గౌరవించే సార్వజనీన సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నదే ఈ వేడుకల లక్ష్యం. ఈ దిశగా సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలన్నది ప్రస్తుత ఏడాది ఇతివృత్తమిచ్చే సందేశం.

   తదనుగుణంగా ఈ సంవత్సరం ప్రపంచ పాక్షిక పక్షవాత దినోత్సవం వైవిధ్యాన్ని అంగీకరించి, ఆమోదించడాన్ని గుర్తుచేసే కార్యక్రమంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరికీ సార్వజనీన ప్రపంచ సౌలభ్యం దిశగా కృషిచేసేలా యావత్ మానవాళిని ప్రోత్సహిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2062540) సందర్శకుల సూచీ సంఖ్య : : 158
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi