వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఆసియా, ఆఫ్రికా దేశాల డబ్ల్యూటీఓ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించిన ఐఐఎఫ్‌టీ


అంతర్జాతీయ వాణిజ్యంలో సహకార వ్యూహాలు, డిజిటల్ పరిష్కారాల అవసరం, పర్యావరణానుకూల విధానాల ప్రాధాన్యంపై చర్చ

Posted On: 03 OCT 2024 4:50PM by PIB Hyderabad

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ప్రతినిధుల కార్యక్రమం(డబ్ల్యూసీపీ) భారతీయ విభాగం ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమం గత నెల 27–28 తేదీల్లో జరిగింది. ‘‘మారుతున్న ప్రపంచ మార్కెట్‌ను తట్టుకునేలా బాధ్యతాయుతమైన వాణిజ్య నిర్వహణ’’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం కొనసాగింది. సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లా(సీటీఐల్),  సెంటర్ ఫర్ డబ్ల్యూటీవో స్టడీస్(సీడబ్ల్యూఎస్) లాంటి ప్రాంతీయ కేంద్రాల ద్వారా  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ భాదూ ఈ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు.
 


ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు:

 (1) అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రాంతీయ, బహుపాక్షిక వాణిజ్య వ్యూహాలను రూపొందించడం,

 (2) అంతర్జాతీయ వాణిజ్యంలో అన్ని దేశాలు, భాగస్వాములకు సమాన అవకాశాలు అందేలా డిజిటల్ టూల్స్ ఉపయోగించి అవరోధాలు తొలగించాల్సిన అవసరం

 (3) అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా పటిష్టమైన వాతావరణ ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకత

ఈ  కార్యక్రమంలో భారత రాయబారి, డబ్ల్యూటీఓలో శాశ్వత  ప్రతినిధి డా. సెంథిల్ పాండ్యన్, డబ్ల్యూటీఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, రాయబారి షియాంగ్‌షెన్ జాంగ్, ఐఐఎఫ్‌టీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి, సీటీఐఎల్ ప్రధానాధికారి, డబ్ల్యూసీపీ ఇండియా ప్రతినిధి ప్రొఫెసర్ జేమ్స్ జె.నెడుంపర, డబ్ల్యూటీవోలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి ఎమ్మాన్యుయేల్ ఇవనోవ్ డ్యురాండ్, డబ్య్లూటీవో కొరియా ఉప శాశ్వత ప్రతినిధి జంగ్ సంగ్ పార్క్ పాల్గొన్నారు.

ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన డబ్ల్యుటీఓ  ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, వాణిజ్య నిపుణులు, విధాన నిర్ణేతలకు మారుతున్న ప్రపంచ మార్కెట్‌ను తట్టుకునేలా బాధ్యతాయుతంగా వాణిజ్యాన్ని నిర్వహించడం అనే అంశంపై చర్చించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పించింది.

రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో స్థిరమైన, బాధ్యతాయుతమైన వాణిజ్యానికి సంబంధించిన ఏడు అంశాలపై  చర్చలు జరిగాయి. అమెరికాలోని టఫ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీలో వాణిజ్య న్యాయ శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన హెన్రీ జె. బ్రేకర్ కీలకోపన్యాసం చేశారు. నీతి ఆయోగ్ సీఈఓ  శ్రీ బీవీఆర్ సుబ్రమణ్యన్ కూడా ప్రసంగించారు.

ప్రపంచ వాణిజ్యం, సుస్థిరతకు సంబంధించిన క్లిష్టమైన అంశాలపై సైతం ఈ సదస్సు దృష్టి సారించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వాణిజ్య వ్యూహాలు, సమీకృత డిజిటల్ మార్పుల కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, అరుదైన ఖనిజాలను వెలికితీసేందుకు బాధ్యతాయుతమైన పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకతను ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య విధానాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా సహకార విధానాలను అనుసరించడంపై ఈ కార్యక్రమం ప్రధాన దృష్టి సారించింది.  

అంశాల వారీగా జరిగిన చర్చా కార్యక్రమాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన డబ్ల్యూసీపీ ప్రతినిధులు ప్రాంతీయ, జాతీయ, ద్వైపాక్షిక కోణాల్లో తమ ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్టాలు, ప్రకృతిహిత పారిశ్రమిక విధానాలు, పునరుత్పాదక విద్యుత్తుకై కీలకమైన ఖనిజాలు, డబ్ల్యూటీఓ వివాదాల పరిష్కార వ్యవస్థ, సుస్థిర వాతావరణ విధానాలపై చర్చించారు.

కార్యక్రమంలో భాగంగా ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన డబ్ల్యూసీపీ ప్రతినిధుల మధ్య సహకారాన్ని  పెంపొందించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విజ్ఞానం, అనుభవాలు, విద్యా భాగస్వామ్యాలను వివిధ మార్గాల్లో డబ్ల్యూసీపీ ప్రతినిధులు పరస్పరం పంచుకునే వ్యవస్థను ఏర్పాటుపై చర్చించారు. ఈ వ్యవస్థను డబ్ల్యూటీవో ఛైర్స్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని, ఈ అంశంలో డబ్ల్యూటీఓ  పోషించాల్సిన పాత్ర గురించి కూడా చర్చించారు.


 

***



(Release ID: 2061955) Visitor Counter : 13


Read this release in: Tamil , English , Urdu , Hindi