రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

నావికా సాగర్ పరిక్రమ 2 కు బయలుదేరిన ఐఎన్ఎస్‌వీ తారిణి

Posted On: 02 OCT 2024 7:20PM by PIB Hyderabad

గోవాలోని ఐఎన్ఎస్ మాండోవి నుంచి ప్రారంభమైన నావికా సాగర్ పరిక్రమ రెండోదశ  అంతర్జాతీయ సాహసయాత్ర

ఐఎన్ఎస్ తారిణిలో చేస్తున్న ఈ చారిత్రక సముద్ర సాహసయాత్రలో పాల్గొంటున్న మహిళలు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కె, లెఫ్టినెంట్ కమాండర్ రూప ఎ

భారత నౌకాదళంలోని మహిళల సాహనం, సముద్రయానంలో నారీశక్తికి ఈ యాత్ర నిదర్శనం

నావికా సాగర్ పరిక్రమ 2 పేరిట చేపట్టిన సాహసయాత్రను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ప్రారంభించారు. గోవాలోని నావికా కేంద్రం ఐఎన్ఎస్ మాండోవి నుంచి రెండో తేదీన ఈ యాత్ర ప్రారంభమైంది. తొలిసారిగా ఇద్దరు మహిళలతో చేపడుతున్న ఈ యాత్ర దేశ నౌకాదళ చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. అలాగే సముద్రయానంలో భారత్ సాధిస్తున్న విజయాలు, అంతర్జాతీయ సముద్ర కార్యకలాపాల్లో దేశ ప్రాముఖ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మహిళాసాధికారతకు నౌకాదళమిస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఓఐఎన్‌సీ(దక్షిణ) వైస్ అడ్మిరల్ వీ శ్రీనివాస్, డీజీఏఎఫ్ఎంఎస్ వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్, సీపీఎస్ వైస్ అడ్మిరల్ వినీత్ మెక్ కార్టీ, చీఫ్ హైడ్రోగ్రాఫర్ వైస్ అడ్మిరల్ ఎల్ ఎస్ పఠానియా, ఇతర ఉన్నతాధికారులు, ప్రముఖులు, నౌకాదళంలో  పనిచేస్తున్నవారు, పదవీ విరమణ పొందినవారు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ సాహసయాత్రను సూచించే చార్టును ఎఫ్ఓఐఎన్‌సీ(దక్షిణ), చీఫ్ హైడ్రోగ్రాఫర్ సమక్షంలో సీఎన్ఎస్ విడుదల చేశారు. యాత్ర ప్రారంభానికి ముందు బోటును సందర్శించిన సీఎన్ఎస్ సిబ్బందితో ముచ్చటించారు.  

ఈ సందర్భంగా సీఎన్ఎస్ ప్రసంగిస్తూ అంకిత భావానికి ఈ సాగర పరిక్రమ సూచికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సముద్రయానాన్ని పెంపొందించే దిశగా వేసిన కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు. ఈ యాత్ర సశక్త్, సాక్షం స్ఫూరితో నిండి ఉందని పేర్కొన్నారు. సెయిల్ బోట్‌లో ప్రదక్షిణ చేయాలనే ఆలోచనకు పునాది వేసిన దివంగత వైస్ అడ్మిరల్ ఎంపీ అవతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కెప్టెన్ దిలీప్ డొండే, కమాండర్ అభిలాష్ టోనీ చేపట్టిన సాహసయాత్రలు, అంతర్జాతీయంగా సముద్రయాన నైపుణ్యాలను ప్రదర్శించిన సాగర పరిక్రమ 1, తద్వారా ప్రపంచ వేదికలపై చాటిన నారీశక్తి స్ఫూర్తిని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రయాణానికి నావికులను సన్నద్ధం చేసిన శిక్షణా నిపుణులు, మార్గదర్శకులు, ఇతర సిబ్బందిని సీఎన్ఎస్ మెచ్చుకున్నారు. అలాగే సాహసయాత్రకు వెళుతున్న ఇద్దరికీ అండగా నిలిచిన వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత దేశ నావికాదళ ధైర్యం, దృడ విశ్వాసానికి ఈ ఇద్దరినీ ప్రతినిధులుగా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాండించే వారికి అనుకూల పవనాలు, ప్రయాణానుకూల సముద్ర మార్గాలు ఉండాలని అభిలషించారు.  

నావికా సాగర్ పరిక్రమ 2 దాదాపుగా 21,600 నాటికల్ మైళ్ల(సుమారుగా 40,000 కి.మీ) దూరం సాగుతుంది. మరమ్మత్తులు, ఇతర అవసరాల కోసం నాలుగు పోర్టుల్లో ఆగుతుంది. ఐదు భాగాలుగా సాగే ఈ ప్రయాణ మార్గం ఇలా ఉంటుంది.

 (ఎ) గోవా నుంచి ఫ్రిమాంటిల్, ఆస్ట్రేలియా

(బి) ఫ్రిమాంటిల్ నుంచి లిటిల్‌టన్, న్యూజిలాండ్

(సి) లిటిల్‌టన్ నుంచి పోర్ట్ స్టాన్లీ, ఫాక్‌లాండ్

(డి) పోర్ట్ స్టాన్లీ నుంచి కేప్ టౌన్, దక్షిణాఫ్రికా

(ఇ) కేప్‌టౌన్ నుంచి గోవా

56 అడుగులు పొడవున్న ఐఎన్ఎస్‌వి తారిణిని ఆక్వారిస్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఈ సెయిలింగ్ బోటు  2017 ఫిబ్రవరి 18న నౌకాదళంలోకి ప్రవేశించింది. 2017లో సాగిన నావికా సాగర పరిక్రమ మొదటి దశతో కలిపి ఇప్పటి వరకు ఈ బోటు 66,000 నాటికల్ మైళ్లు(1,22,223 కి.మీ)కు పైగా దూరాన్ని తిరిగింది. గోవా నుంచి రియో, గోవా నుంచి పోర్ట్ లూయిస్‌తో సహా ఇతర సాహస యాత్రల్లో దీనిని ఉపయోగించారు. అధునాతన నావిగేషన్, భద్రత, సమాచార పరికరాలు ఈ బోటులో అమర్చారు. ఇటీవలే అవసరమైన మరమ్మత్తులు చేపట్టి మెరుగైన పరికరాలు అమర్చారు.  ఈ సాహసయాత్రలో పాల్గొంటున్న ఇద్దరు నౌకాదళ అధికారిణులకు 38,000 నాటికల్ మైళ్ల(70,376 కి.మీ) నౌకాయాన అనుభవం ఉంది. ప్రస్తుతం చేపడుతున్న సాహసయాత్ర నిమిత్తం మూడేళ్లు శిక్షణ పొందారు. అలాగే నౌకాయానం, వాతావరణం, నావిగేషన్,  మనుగడ సాగించే పద్ధతులు, ఆరోగ్య రక్షణ తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. పదవీ విరమణ చేసిన కమాండర్ అభిలాష్ టోనీ ఆధ్వర్యంలో ఆగస్టు 23 వరకు ఈ శిక్షణ కొనసాగింది. సముద్రంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇద్దరు నావికులు మానసికంగా సన్నద్ధమయయ్యారు.  

ధైర్యాన్ని చాటి చెబుతూ అనంత సముద్రాల్లో  నావికా సాగర్ పరిక్రమల 2 సాహసయాత్రకు బయలుదేరిరన నావికులకు భారత నౌకాదళం శుభాకాంక్షలు తెలిపింది.

 

***



(Release ID: 2061523) Visitor Counter : 16


Read this release in: English , Urdu , Marathi