వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

న్యూయార్క్ లో వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లతో కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశం

భారత్ లో పెట్టుబడి, తయారీ, వాణిజ్య అవకాశాల గురించి వెల్లడించిన మంత్రి

Posted On: 03 OCT 2024 12:09PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ న్యూయార్క్ లోని స్థానిక వ్యాపారవేత్తలు, భారతీయ సమాజ ప్రతినిధులతో  కీలక సమావేశాలు జరిపారు.  

తమ అమెరికా పర్యటన రెండో రోజున, ‘బ్లాక్ రాక్’ పెట్టుబడి సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి  రాబర్ట్ గోల్డ్ స్టెయిన్, ‘సిస్టమ్స్ టెక్నాలజీ’ గ్రూప్ సంస్థ ఛైర్మన్, సీఈఓ అనూ[ప్  పోపట్, ‘టిల్మన్  హోల్డింగ్స్’ సంస్థ సీఈఓ సంజీవ్  అహూజా, ‘సీ4వీ’ సంస్థ సీఈఓ శైలేష్ ఉప్రేతీ, ‘జానస్ హెన్డర్సన్ ఇన్వెస్టర్స్’ సంస్థ సీఈఓ అలీ దిబజ్ లను మంత్రి కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్ ను ప్రపంచ ప్రముఖ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భాగస్వామ్యాలను ఆహ్వానించిన మంత్రి, దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టి, తమ వాణిజ్య కార్యకలాపాలను పెంచుకోవాలని కోరారు. సులభతర వాణిజ్యం గురించి వ్యాపారవేత్తల అభిప్రాయాలను శ్రీ గోయల్ అడిగి తెలుసుకున్నారు.  

ప్రపంచ మీడియాకు ఎన్నో ముఖ్యమైన కథనాలను అందిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త, ‘న్యూస్ వీక్’ సంస్థ సీఈఓ  శ్రీ దేవ్ ప్రగడ్ తో కూడా శ్రీ గోయల్ సమావేశమయ్యారు.

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక- ‘యుఎస్ఐఎస్పిఎఫ్’ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్న మంత్రి, సులభతర వాణిజ్యం, మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధి,  ఐపీఆర్ సంస్కరణలు, సరైన ప్రోత్సాహకాల ద్వారా తయారీ రంగానికి ప్రాధాన్యం వంటి పలు కీలక అంశాలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యాన్ని వివరించారు. నిలకడైన అభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం అనే భారత ప్రభుత్వ నూతన విధానాల పట్ల మదుపర్లు విశ్వాసం వ్యక్తం చేశారు.  

లాభాపేక్షరహిత సంస్థ ‘ఇండియాస్పోరా’ ప్రతినిధులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్- ‘ఐసిఎఐ’  న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలాడెల్ఫియా శాఖల ప్రతినిధులు, మంత్రితో సమావేశమై చర్చలు జరిపారు. భారత్ అభివృద్ధి అవకాశాలను పెంచడంలో భారతీయ సమాజానికి చెందిన వారు పోషించగల కీలక పాత్ర గురించి ఈ సందర్భంగా శ్రీ గోయల్ ప్రస్తావించారు.  

విలువైన రాళ్ళ వ్యాపారానికి కేంద్రమైన న్యూయార్క్ లో ఆ రంగానికి చెందిన కీలక వ్యాపారులతో మంత్రి సమావేశాన్ని, న్యూయార్క్ లోని  భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసింది. విలువైన రాళ్ళ వ్యాపారానికి సంబంధించి ప్రపంచ విపణిలో భారత్ బలమైన స్థానాన్ని పేర్కొన్న  మంత్రి, పెట్టుబడుల పెంపు, సహకారం, సృజనాత్మకతకు ప్రోత్సాహం వంటి చర్యలతో ఈ రంగంలో ఎంతో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు మరింతగా పొందేందుకు, కలిసి అభివృద్ధి సాధించేందుకు గల అవకాశాలను చర్చించిన సమావేశాలు, ఇరుదేశాల వ్యాపార  సంబంధాల బలోపేతం దిశగా  భారత్-అమెరికాల నిబద్ధతకు అద్దం పట్టాయి.    

 

***



(Release ID: 2061520) Visitor Counter : 18