రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) 92వ వార్షికోత్సవం. 7 వేల కి.మీ. ‘వాయు వీర్ విజేత’ కార్ ర్యాలీకి న్యూఢిల్లీ లోని జాతీయ యుద్ధ స్మారకచిహ్నం వద్ద స్నేహపూర్వక వీడ్కోలు పలికిన రక్షణ మంత్రి
యాభై మందికి పైగా వాయు యోధులు ఈ నెల 8న లద్దాఖ్ లోని థోయిసే నుంచి బయలుదేరి,
తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను చుడుతూ ఈ నెల 29న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు చేరుకొంటారు
సాయుధ దళాలలో చేరేందుకూ, దేశ ప్రజలకు సేవ చేయడానికీ యువతలో స్ఫూర్తిని కలిగించనున్న కార్ ర్యాలీ: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
‘‘దేశ శత్రువులకు దీటైన జవాబు ఇచ్చే సత్తా ఐఏఎఫ్ కు ఉంది.
ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా వారికి అత్యాధునిక పోరాట సంపత్తిని సమకూర్చుతోంది’’
Posted On:
01 OCT 2024 1:59PM by PIB Hyderabad
భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) 92వ వార్షికోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా, ‘వాయు వీర్ విజేత’ కార్ ర్యాలీ న్యూఢిల్లీ లోని జాతీయ యుద్ధ స్మారకచిహ్నం వద్ద నుండి బయలుదేరింది. కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ర్యాలీకి స్నేహపూర్వకంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా వాయు యోధులు లద్దాఖ్ లోని థోయిస్ కు బయలుదేరారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. వారంతా తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల గుండా మొత్తం 7,000 కిలో మీటర్ల దూరాన్ని చుడుతూ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు చేరుకుంటారు. వాయుసేన పూర్వ ప్రధాన అధికారులు కూడ ర్యాలీ తాలూకు వివిధ దశలలో పాలుపంచుకోనున్నారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ... క్లిష్ట పరిస్థితులలో శౌర్యంతో, అంకిత భావంతో, దేశభక్తి భావనతో మాతృభూమికి సేవలను అందిస్తున్న వాయు యోధులను మెచ్చుకొన్నారు. ‘‘దేశాన్ని, దేశ ప్రజలను రక్షించే కృషిలో ఐఏఎఫ్ అనేక విజయాలను సొంతం చేసుకుంది. సరిహద్దులు దాటి మరీ దేశ శత్రువులకు దీటైన జవాబును ఇవ్వగలిగిన సత్తా ఐఏఎఫ్ కు ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం ద్వారా అత్యంత ఆధునిక విమానాలను/ఆయుధ సంపత్తిని ఐఏఎఫ్ కు సమకూర్చి, వారిని మరింత సామర్ధ్యం కలిగిన వారుగా తీర్చిదిద్దడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
దుర్గమమైన, విభిన్న ప్రాంతాల గుండా సాగనున్న ఈ ర్యాలీలో పాల్గొంటున్న వాయు యోధులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ర్యాలీకి లాంఛన పూర్వక ప్రారంభ కార్యక్రమం ఈ నెల 8న థోయిసే లో జరుగనుంది. సముద్ర మట్టానికి 3,068 మీటర్ల ఎగువన ఉన్న థోయిస్... ప్రపంచంలో అతి ఎత్తయిన ప్రాంతాల్లో ఏర్పాటైన వైమానిక దళ స్థావరాల్లో ఒకటి. వాయు యోధులు ఈ నెల 29న తవాంగ్ లో ర్యాలీని ముగించే క్రమంలో మార్గమధ్యంలో లే, కార్గిల్, శ్రీనగర్, జమ్ము, ఛండీగఢ్, డెహ్రాడూన్, ఆగ్రా, లఖ్నవూ, గోరఖ్ పూర్, దర్భాంగ, బాగ్ డోగ్రా, హాసిం ఆరా, గువాహాటీ, తేజ్ పుర్, ఇంకా దిరాంగ్ లలో మకాం చేయనున్నారు.
ఐఏఎఫ్ వైభవోపేత చరిత్రను గురించి విభిన్న యుద్ధాల్లోను, సహాయక కార్యకలాపాల్లోను వాయు యోధుల పరాక్రమాల గురించిన చైతన్యాన్ని ప్రజలలో రగిలించి, మన దేశ యువతీ యువకులు స్వదేశానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చేటట్లుగా వారిని ఆకట్టుకోవాలన్నదే ఈ ర్యాలీ ధ్యేయం. కార్ ర్యాలీ కాలంలో వాయు యోధులు వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాఠశాల, కళాశాలల యువతీ యువకులతో సమావేశాలను నిర్వహిస్తారని రక్షణ మంత్రి తెలిపారు. ఈ సమావేశాలు యువతీ యువకులలో సాయుధ బలగాలలో చేరాలనే భావనను, స్వాభిమానాన్నీ, గౌరవంతో కూడిన జీవనాన్ని గడపాలన్న భావనను రేకెత్తించగలవన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
వాయుసేన ప్రధానాధికారి, ఎయర్ చీఫ్ మార్షల్ శ్రీ ఎ.పి. సింగ్, పూర్వ ప్రధాన అధికారులు శ్రీ ఆర్.కె.ఎస్. భదౌరియ (రిటైర్డ్), శ్రీ ఎ.వై. టిప్నిస్ (రిటైర్డ్) లతో పాటు ఐఎఎఫ్ కు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. ఉత్తరాఖండ్ యుద్ధ స్మారకానికి చెందిన మాజీ సైనికుల భాగస్వామ్యంతో ఐఏఎఫ్ ఈ ర్యాలీని ఏర్పాటు చేసింది. ఐఏఎఫ్ కు చెందిన సాహస కృత్యాల విభాగం ఈ ర్యాలీకి మార్గదర్శకత్వాన్ని వహించడంతో పాటు సమన్వయ బాధ్యతను కూడా స్వీకరించింది.
***
(Release ID: 2061009)
Visitor Counter : 62