వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
జాతీయ వ్యవసాయ కోడ్‌పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వర్క్‌షాప్
Posted On:
27 SEP 2024 5:46PM by PIB Hyderabad
జాతీయ వ్యవసాయ కోడ్(ఎన్ఏసీ) రూపకల్పనను వేగవంతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వర్క్‌షాప్‌ను నిర్వహించింది. వ్యవసాయ రంగ ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, వనరులు, అధునాతన సాంకేతికతలను గరిష్ఠంగా వినియోగించుకోవాలనే ఆలోచనతో ఎన్ఏసీ రూపొందించాలని బ్యూరో ప్రతిపాదించింది. పంటల ఎంపిక నుంచి వ్యవసాయ దిగుబడుల నిల్వ వరకు ఉత్తమ పద్ధతులకు ఎన్ఏసీ భరోసాను ఇవ్వనుంది.
దేశ వ్యాప్తంగా అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు, సరికొత్త వ్యవసాయ పద్ధతులు, విభిన్నమైన ప్రాంతీయ పరిస్థితులను ఎన్ఏసీలో పొందుపర్చాలనేది ఉద్దేశం. ఈ కోడ్ అభివృద్ధిలో భాగంగా ప్రమాణీకరణ లోపించిన ప్రాంతాలను గుర్తించి, వాటి కోసం ప్రమాణాల రూపొందిస్తారు.
నోయిడాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ స్టాండర్డైజేషన్(ఎన్ఐటీఎస్)లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐసీఏఆర్ సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే నిర్మాణాల కోసం బీఐఎస్ అభివృద్ధి చేసిన నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్‌బీసీ), విద్యుత్ కోసం రూపొందించిన నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్(ఎన్ఈసీ) విజయవంతం అయ్యాయి. వీటికి కొనసాగింపుగా ఎన్ఏసీని రూపొందించనుంది.
ఈ కార్యక్రమానికి బీఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారి అధ్యక్షత వహించారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వస్తువులకు ఇప్పటికే ప్రమాణాలు ఉన్నప్పటికీ విధాన రూపకర్తలకు అవసరమైన సూచనలు, వ్యవసాయ సమాజానికి మార్గదర్శకం అందించడం ద్వారా భారతీయ వ్యవసాయంలో నాణ్యతా సంస్కృతిని తీసుకురావడానికి జాతీయ వ్యవసాయ కోడ్(ఎన్ఏసీ) దోహదపడుతుందని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. ఎన్ఏసీ రూపకల్పనకు దాని విధానం, నిర్మాణం, అమలుకు వివిధ పద్ధతులు, సంస్థాగత సంసిద్ధత, ప్రదర్శనల ప్రాముఖ్యత వంటి అంశాలు కీలకంగా ఉంటాయని అన్నారు.
బీఐఎస్ డీడీజీ(ప్రమాణీకరణ) శ్రీ సంజయ్ పంత్ మాట్లాడుతూ... రైతులు అభివృద్ధి చెందడానికి మరింత అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా భారతీయ వ్యవసాయ రంగంలో పరివర్తన తీసుకువచ్చే సామర్థ్యం ఎన్ఏసీకి ఉందని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, సమర్థవంతమైన, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతంలోని కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని ఎన్ఏసీ గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
పంట ఎంపిక, భూమిని సిద్ధం చేయడం, విత్తనాలు/ నాట్లు వేయడం, నీటి పారుదల/కాలువ వ్యవస్థ, నేల ఆరోగ్య నిర్వహణ, మొక్కల ఆరోగ్య నిర్వహణ, పంట కోత/నూర్పిడి, ప్రాథమికంగా ప్రాసెస్ చేయడం, సేద్యం తర్వాత అనుసరించాల్సిన పద్ధతులు, సుస్థిరత, రికార్డు నిర్వహణ, ట్రేసెబిలిటీ, వ్యవసాయంలో అధునాతన సాంకేతికతల వినియోగం వంటి నిర్దిష్ట వ్యవసాయ సంబంధిత అంశాలపై పరిశోధించడానికి వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారిని ఏడు బృందాలుగా విభజించారు. ఎన్ఏసీ అభివృద్ధి కోసం సహకరించే నోడల్ సంస్థలు, నిపుణులను గుర్తించడం ద్వారా ఈ వర్క్‌షాప్ ముగిసింది.
దేశ జీడీపీలో దాదాపు 20 శాతం వాటా కలిగి ఉన్న, కార్మికశక్తిలో 50 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఆహార భద్రతకు అత్యంత కీలకం. 60 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున వ్యవసాయం వారికి అవసరమైన ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. వరి, గోధుమలు, పత్తి, సుగంధ ద్రవ్యాలు వంటి పంటలతో పాటు ప్రపంచంలోని ప్రధాన పంటల్లో భారతీయ వ్యవసాయ రంగం కీలకమైన భాగాన్ని ఉత్పత్తి చేస్తోంది. పైగా, వస్త్ర, ఆహార ప్రాసెసింగ్, ఇతర పరిశ్రమలకు ముడి సరుకులు అందించడం ద్వారా భారత పారిశ్రామిక రంగానికి సైతం వ్యవసాయం తోడ్పాటును అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంట బీమా పథకాలు వంటి కార్యక్రమాలతో వ్యవసాయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. రైతుల జీవనోపాధిని మెరుగుపర్చడం, ఉత్పాదకతను పెంచడంతో పాటు ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధిగా కొనసాగాలనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
***
(Release ID: 2060137)
Visitor Counter : 38