మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లోని ‘ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ’ లో ‘సఫాయి మిత్ర సురక్ష శివిర్’ను
ప్రారంభించిన కేంద్రమంత్రి డాక్టర్ సుకాంత మజుందార్
ఇఫ్లూలో ‘జాతీయ విద్యా విధానం-2020’ అమలు తీరు పరిశీలన: సమీక్షా సమావేశానికి మంత్రి అధ్యక్షత
స్వచ్ఛత కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం: డాక్టర్ సుకాంత మజుందార్
Posted On:
28 SEP 2024 3:17PM by PIB Hyderabad
కేంద్ర ఈశాన్యప్రాంత అభివృద్ధి, విద్యాశాఖల సహాయమంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఈ రోజు తెలంగాణా రాజధాని హైదరాబాద్ లోని ‘ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ’ లో ‘సఫాయి మిత్ర సురక్షా షివిర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘స్వచ్ఛతా హీ సేవా-2024’ ప్రచారోద్యమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఉత్సాహంగా పాలుపంచుకున్న ఎన్ ఎస్ఎస్ కార్యకర్తలకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ హరిబండి లక్ష్మి, డీన్, విద్యావేత్తలు, అధికారులు, అధ్యాపక బృందం, ఇతర సిబ్బంది, విద్యార్థులూ పాల్గొన్నారు. ప్రచారోద్యమం కింద చేపట్టిన కార్యకలాపాల గురించిన నివేదిక సమర్పించిన అనంతరం షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు.
ఇఫ్లూలో ‘జాతీయ విద్యా విధానం-2020’ అమలు తీరుపై జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి, విద్యార్థుల సౌకర్యార్థం విశ్వవిద్యాలయంలో నూతన రీడింగ్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ళ చరిత్ర గల ఈ విద్యాసంస్థ ‘జాతీయ విద్యా విధానం-2020’ అమలుకు మార్గదర్శకాలను అందించి, 11 రాష్ట్రాలూ, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి దిక్సూచిగా నిలవడం తనకు సంతోషాన్ని కలిగించే విషయమని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాల్లో ఒకటైన సాంకేతిక ఆర్థిక సహకార కార్యక్రమం-‘ఐటిఇసి’ కింద విదేశీ విద్యార్థులకు శిక్షణను అందించడంలో విశ్వవిద్యాలయ పాత్రను మంత్రి ప్రస్తావించారు. ఇప్పటి వరకూ 120 దేశాలకు చెందిన వేలాది మంది విదేశీ విద్యార్థులకు ఇఫ్లూ శిక్షణను అందించిందని చెప్పారు.
‘స్వభావ్ స్వచ్చతా, సంస్కార్ స్వచ్చతా’ సందేశ వ్యాప్తి కోసం ఇఫ్లూ ‘స్వచ్ఛతా హీ సేవా’ కింద చేపట్టిన వివిధ ప్రయోజనకర కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు. ‘జన్ భాగీదారీ’ స్ఫూర్తితో ఆయా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపక బృందం, ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉటంకిస్తూ స్వచ్ఛతను తమ జీవితాల్లో అంతర్భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారోద్యమంలో భాగంగా శ్రీ మజుందార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.
***
(Release ID: 2059928)
Visitor Counter : 56