ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత్, ఉజ్బెకిస్తాన్ ల ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం; తాష్కెంట్ లో సంతకాలు
అంతర్జాతీయంగా సంబంధిత దృష్టాంతాలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్ లో భారతీయ పెట్టుబడిదారుల, భారత్ లో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడిదారుల హక్కుల పరిరక్షణకు హామీని ఇచ్చిన ఒప్పందం
Posted On:
27 SEP 2024 3:51PM by PIB Hyderabad
భారత్, ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాలు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఈ రోజు తాష్కెంట్ లో కుదుర్చుకొన్నాయి. ఒప్పంద పత్రాలపై భారత ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఉజ్బెకిస్తాన్ ఉప ప్రధాని శ్రీ ఖోద్జయెవ్ జంషీద్ అబ్దుఖకిమోవిచ్ లు సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం అంతర్జాతీయంగా తలెత్తిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉజ్బెకిస్తాన్ లోని భారతీయ ఇన్వెస్టర్ లకు, భారతదేశం లోని ఉజ్బెకిస్తాన్ ఇన్వెస్టర్ లకు వారి హక్కుల పరిరక్షణ విషయంలో తగిన హామీనిస్తుంది. ఈ ఒప్పందం మధ్యవర్తిత్వం పద్ధతిలో వివాదాల పరిష్కారానికి ఒక స్వతంత్ర వేదికను అందిస్తూ, ఇన్వెస్టర్ లకు కనీస ప్రమాణాలతో కూడిన గౌరవం ఇవ్వడంతో పాటు, ఎంతమాత్రం వివక్షకు తావివ్వకుండా వారిలో ఆత్మవిశ్వాస స్థాయిని ప్రోత్సహించనుంది. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తుంది. పారదర్శకత్వానికీ చోటును కల్పిస్తుంది. నష్టాలు వచ్చినప్పుడు వాటి బదలాయింపులకు, పరిహారానికి అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ తరహాలో ఇన్వెస్టరుకు, పెట్టుబడికి రక్షణను కల్పిస్తూనే ప్రభుత్వానికి ఉండే క్రమబద్ధీకరణ సంబంధిత హక్కును నిలబెడుతూ విధాన పరంగా అవసరపడే చర్యలను తీసుకోవడానికి సైతం అవకాశాలను కల్పించి సమతుల్యతను పాటించారు.
ఈ ఒప్పందం ఆర్థిక సహకారాన్ని పెంపొందింప చేసుకొనే దిశలో ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకొని నిలబడగలిగేలా మరింత పటిష్ట స్థితిని కల్పించుకోవాలన్న ఉభయ దేశాల నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక పెట్టుబడులు అధికం అవుతూ, ఇరు దేశాల వ్యాపార సంస్థలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభాన్ని చేకూర్చేమార్గాన్ని సుగమం చేస్తుందని కూడా భావిస్తున్నారు.
***
(Release ID: 2059712)
Visitor Counter : 54