సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఆసియాలో అత్యంత శక్తిమంతమైన మూడో దేశంగా భారత్; ఏషియా పవర్ ఇండెక్స్ లో జపాన్ ను మించిన ఇండియా

Posted On: 25 SEP 2024 10:33AM by PIB Hyderabad

 ఏషియా పవర్ ఇండెక్స్ లో జపాన్ ను వెనక్కి నెడుతూ మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్ నిలిచింది. భౌగోళిక-రాజకీయ స్థాయిలో భారత్ పురోగతికి ఇదొక ప్రధాన నిదర్శనం.  ఈ స్థాయికి చేరుకోవడంలో ఇండియా చూపిస్తున్న దూకుడు, అధిక సంఖ్యలో యువ జనాభాను కలిగి ఉండటం, శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థలు చోదక శక్తి గా నిలిచాయి.  ఫలితంగా ఆసియాలో ఒక అగ్రగామి శక్తిగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలపరచుకొంది.
ఆసియా దేశాల్లో ఎప్పటికప్పుడు భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోందన్న విషయాన్ని ఈ తాజా ‘ఏషియా పవర్ ఇండెక్స్  2024’ స్పష్టం చేస్తోంది. మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ, తన పూర్తి సామర్థ్యం మేరకు రాణించడం ద్వారా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్నిచూపించేందుకు యత్నిస్తోంది.

భారత్ పురోగతికి ముఖ్య కారణాలు:

1.   ఆర్థిక వృద్ధి: మహమ్మారి అనంతర కాలంలో భారత ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా మెరుగు పడింది. తద్వారా ఇండెక్స్ లో ఆర్ధిక ప్రగతి వాటా 4.2 పాయింట్లకు పైగా పెరుగుదలను నమోదు చేసుకుంది. అధిక జనాభా, బలమైన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి, కొనుగోలు శక్తి సామర్ధ్యం (పిపిపి) ప్రకారం  చూసినప్పుడు ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది.

2. భవిష్యత్ ప్రగతి:  భారతదేశ భావి వనరుల విషయంలోనూ 8.2 పాయింట్ల మేర వృద్ధి కనిపించింది. జనాభా పరంగా భారత్ కున్న గొప్ప సదవకాశం. తన ప్రాంతీయ పోటీదారు దేశాలకు భిన్నంగా, మరీ ముఖ్యంగా చైనా,  జపాన్ లతో పోలిస్తే జనాభాలో యువతీ యువకుల సంఖ్య అధికంగా ఉండడంభారత్ కు కలిసొచ్చే అంశం. ఇది రానున్న దశాబ్దాలలో భారత ఆర్థిక వృద్ధికి అండగా ఉంటూ, భిన్న స్థాయిల్లో తన సత్తా చాటడానికి తోడ్పడుతుంది.

3. దౌత్యపరమైన ప్రభావం:  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం ప్రపంచ దేశాల చూపు ఇటువైపు పడేలా చేసింది. మన దేశం అనుసరిస్తున్న అలీన విధానం అంతర్జాతీయ అంశాల్లో తన సామర్ధ్యాన్నిచూపించుకుని అవకాశాన్ని ఇస్తోంది.  దౌత్యపరమైన సంభాషణల అంశంలో భారత్ గత సంవత్సరం ఆరో స్థానాన్ని చేజిక్కించుకొంది.  తత్ఫలితంగా బహుళ  వేదికలలో భారత్ తన భూమికను చురుకైన విధంగా నిర్వర్తిస్తోందని రుజువవుతోంది.  

దీనికి అదనంగా, గణనీయంగా పెరుగుతున్న జనాభా, ఆర్థిక శక్తియుక్తులు భారత్ మరింత పురోగమించగలదన్న సంకేతాలు ఇస్తున్నాయి. సంస్కృతి పరమైన అంశాల్లోనూ భారత్ మంచి స్కోర్ నే సాధించింది. ప్రపంచంలో అనేక దేశాలలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు, ప్రపంచ వేదికలపై భిన్న కళా రంగాల్లో చూపిస్తున్న ప్రతిభ ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

పై అంశాలకు తోడు, బహుళ విభాగాల్లో దౌత్యం, భద్రత సంబంధిత సహకారాలలో భారత్ పోషిస్తున్న పాత్ర కూడా ఎన్నదగ్గదే అని చెప్పాలి.  కీలకమైన దౌత్య పరమైన చర్చల్లో పాలుపంచుకోవడమే కాక, క్వాడ్ లో భారత్ నాయకత్వం ప్రాంతీయ భద్రతకు సంబంధించి ముఖ్య పాత్రను పోషించే అవకాశాన్ని ఇచ్చింది. అయితే, లాంఛన సైనిక కూటముల పరిధికి వెలుపల ఇలా జరగడం గమనించ దగ్గది.  భారతదేశానికి ఉన్న ఆర్థిక విస్తృతి పరిమిత పరిధి కలిగిందే అయినప్పటికీ దీనిలో, మరీ ముఖ్యంగా రక్షణ రంగ  విక్రయాలలో, మంచి పురోగతి  చోటు చేసుకొంది.  ఫిలిప్పీన్స్ తో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకోవడం ఇందుకో  ఉదాహరణ.  ఈ పరిణామాలు పరిశీలించడానికి చిన్న తరహావే కావచ్చు గానీ, తన పొరుగు దేశాల ను తోసిరాజని తనదైన భౌగోళిక-రాజకీయ బలాలను పెంచుకోవడం భారత్ మొదలుపెట్టిందనే సంగతి వెల్లడి అవుతోంది.

ఆసియాలో భారత్ పోషిస్తున్న పాత్ర

ఆసియాలో ఒక ప్రముఖ శక్తిగా భారత్ ఎదిగింది అన్న విషయాన్ని ‘ది 2024 ఏషియా పవర్ ఇండెక్స్’ తేటతెల్లం చేసింది.  ఇండియా లో నెలకొన్న గణనీయమైన వనరుల రాశి మన దేశానికి భవిష్యత్తులో వృద్ధికి కొదువ లేదు అనే సంగతిని ఢంకా బజాయించి మరీ చెబుతోంది. రాబోయే కాలంలో భారత్ రాణించే తీరుపై ఎన్నో ఆశలు రేకెత్తుతున్నాయి.  ఆర్థిక వృద్ధి బాణం పైపైకి దూసుకుపోతూ ఉండడం, శ్రమ శక్తి వనరు దండిగా పెరుగుతూ ఉండడం రానున్న సంవత్సరాలలో మన దేశం తన ప్రభావాన్ని ఇంకా ఇంకా విస్తరించుకోగలిగే భేషైన స్థితిలో ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి.  విశేషించి దౌత్యపరంగా ఇండియా  ప్రభావం నానాటికీ అధికం అవుతోంది. అంతేకాక, భారత్ కున్న వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తి దీన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఒక కీలక పాత్రధారిగా నిలబెడుతోంది.

ఆసియా శక్తి సూచి (ఏషియా పవర్ ఇండెక్స్)

లోవీ ఇనిస్టిట్యూట్ 2018వ సంవత్సరంలో ‘ది ఏషియా పవర్ ఇండెక్స్’ను వెలువరించడం మొదలుపెట్టింది.  ఈ సూచిక ఏషియా-పసిఫిక్ ప్రాంతంలో పురోగతిని  ప్రతి ఏటా లెక్కిస్తోంది.  ఏషియా-పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాలను మదింపు చేసి, అవి ప్రపంచ దేశాలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో బేరీజు వేసే సూచి ఇది.  ఈ ప్రాంతంలో వాటి శక్తి, ప్రాబల్యాలను పరిగణనలోకి తీసుకుని  2024 సంచికను ఆవిష్కరించింది.  మొట్టమొదటి సారిగా తిమోర్-లెస్తే ను ఈ సూచిలో చేర్చారు.  ఆగ్నేయాసియాలో తిమోర్-లెస్తే కు పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని ఇది తెలియజెబుతోంది. ఈ సూచి ఆయా ప్రభుత్వాల పనితీరుతో పాటు అంతర్జాతీయ వేదికల మీద ఆయా దేశాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

పవర్ నిర్ధారణకు కొలబద్దలు, గీటురాళ్ళు

‘ఆసియా శక్తి సూచి’ పరంగా  శక్తిని కొలవడానికి రెండు గీటురాళ్ళను తీసుకున్నారు; వాటిలో వనరుల ఆధారిత ప్రమాణాలు, ప్రభావం ఆధారిత ప్రమాణాలు అని ఉన్నాయి:

1.  వనరుల ఆధారిత కొలమానాలు:

·      ఆర్థిక యోగ్యత:  ఏ దేశానికి అయినా దాని కీలక ఆర్థిక బలాన్ని కొలిచే సాధనాలలో.. కొనుగోలు శక్తి సామర్ధ్యం పరంగా స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి), సాంకేతిక విజ్ఞాన పరమైన ఆధునికత,  ప్రపంచ దేశాలతో ఆర్థిక సంధానం అనేవి భాగంగా ఉన్నాయి.

·      సైన్య పరమైన సామర్థ్యం:  ఈ గీటురాయి సాంప్రదాయక సైన్య శక్తిని లెక్కగడుతుంది, దీనిలో రక్షణ రంగంపై చేసే వ్యయం, సాయుధ బలగాల తీరు, ఆయుధ శక్తులతో పాటు చాలా దూరం పాటు దూసుకుపోయే శక్తి వంటి ప్రత్యేక సామర్థ్యాల ప్రాతిపదికలుగా ఉంటాయి.

·      ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచే శక్తి:  ఈ విధమైన శక్తిని కొలవడానికని ఏ దేశానికి అయినా దాని స్థిరత్వానికి ఎదురయ్యే బెదరింపులను నిరోధించ గలిగిన ఆంతరంగిక యోగ్యతను ఆధారంగా తీసుకొంటున్నారు. సంస్థాగత దృఢత్వం,  భౌగోళిక-రాజకీయ భద్రత, ఇంకా వనరుల పరంగా సురక్షత దీనిలో ప్రాతిపదికలుగా ఉన్నాయి.

·      భావికాలపు వనరులు: ఈ కొలమానం రాబోయే కాలంలో వనరులను ఏ విధంగా పంపిణీ చేయగలుగుతారు అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తుంది.  దీనిలో 2035వ సంవత్సరం నాటికి ఆయా దేశాల వద్ద ఆర్థిక పరమైన, సైన్య పరమైన, జనాభా పరమైన శక్తి ఏమేరకు ఉండేది అంచనా కడతారు.

2.  ప్రభావ ఆధారిత కొలమానాలు:

·     ఆర్థిక సంబంధాలు:  వ్యాపారం, పెట్టుబడి, ఇంకా ఆర్థిక పరమైన దౌత్యాల పరంగా ఒక దేశం తన పలుకుబడిని ఏ విధంగా వినియోగించ గలుగుతుందనేది దీనిలో ప్రధానంగా పరిగణిస్తారు

రక్షణ సంబంధిత నెట్‌వర్క్ లు:  సైన్య సంబంధ సహకారం, ఆయుధాల బదలాయింపులు.. వీటి ద్వారా కూటముల, భాగస్వామ్యాల శక్తిని కొలుస్తారు.
 
దౌత్య పరమైన ప్రభావం:  ఒక దేశానికి దౌత్య పరంగా ఎంతటి పరిధి ఉంది, ఆ దేశం బహుళ చర్చా వేదికలలో ఏ మేరకు పాల్గొంటోంది, విదేశీ విధానం పరంగా చూసినప్పుడు ఒక దేశం బృహత్ కాంక్ష ఏమిటనేవి ఈ ప్రామాణికంగా తీసుకుంటారు.
 
సాంస్కృతిక పరమైన ప్రభావం: సంస్కృతి పరమైన ఎగుమతులు, ప్రసార మాధ్యమాలు, ఒక దేశ ప్రజలు ఇతర దేశాల ప్రజలతో నెరపే సంబంధాలు.. ఈ మార్గాలలో అంతర్జాతీయ ప్రజాభిప్రాయాన్ని మలచగలిగిన సామర్థ్యాన్ని ఈ కొలమానం ద్వారా కొలుస్తారు.
 

ఈ ఎనిమిది రకాల కొలమానాల మొత్తం సగటుతో ఒక దేశం తాలూకు సమగ్ర శక్తి గణన విషయంలో నిర్ధారణకు వస్తారు.  దీనిలో 131 వ్యక్తిగత సూచికలు కూడా కలిసివున్నాయి.  ఏషియా పసిఫిక్ ప్రాంత పరిధిలో వివిధ దేశాలు వాటికి ఉన్న వనరులను ఉపయోగించి ఎటువంటి ప్రభావాన్ని ప్రసరింప చేయగలవు అనే విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో అవగాహన చేసుకొనేందుకు ఈ సూచి ఆవిష్కరించే ఫలితాలు అవకాశాన్ని అందిస్తాయి.

 

***



(Release ID: 2058851) Visitor Counter : 27