జాతీయ మానవ హక్కుల కమిషన్
అధిక పని భారం కారణంగా మరణించిన ఛార్డర్డ్ అకౌంటెంట్ ఘటనను
సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
పుణే ఘటనపై తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేసిన ఎన్ హెచ్ఆర్ సీ
వ్యాపార సంస్థలు మానవ హక్కుల సమస్యల పట్ల జవాబుదారీగా ఉండాలని ప్రత్యేకంగా పేర్కొన్న ఎన్ హెచ్ ఆర్ సీ
ప్రపంచ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వ్యాపార సంస్థలు తమ పని సంస్కృతి, ఉపాధి విధానాలను, నిబంధనలను సమీక్షించుకోవాలని కోరిన ఎన్ హెచ్ ఆర్ సీ
నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసిన ఎన్ హెచ్ ఆర్ సీ
ఇటాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏఏ చర్యలు ప్రతిపాదిస్తున్నారో నివేదికలో పొందుపర్చాలని కోరిన ఎన్ హెచ్ ఆర్ సీ
Posted On:
21 SEP 2024 7:18PM by PIB Hyderabad
కేరళకు చెందిన 26 ఏళ్ల మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ 2024 జూలై 20న అధిక పనిభారం కారణంగా చనిపోయిందని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ( ఎన్ హెచ్ ఆర్ సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. మహారాష్ట్రలోని పుణేలోగల ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో ఆమె పని చేస్తున్నారు. నాలుగు నెలల కిందటే ఆమె ఆ సంస్థలో చేరారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల తన కుమార్తె శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని ఛార్టెర్డ్ అకౌంటెంట్ తల్లి ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ యాజమాన్యానికి లేఖ రాసింది. అయితే ఆ లేఖను సదరు కంపెనీ తిరస్కరించింది. ఈ ఘటనపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది.
మీడియా వార్తల్లోని విషయాలు నిజమైతే, తాము పని చేస్తున్న కంపెనీల్లో యువత నిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, అసాధ్యమైన లక్ష్యాల సాధన కోసం పని చేయడం, సమయానికి పని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయడం తదితరాలు వారి శారీరక , మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తోందని కమిషన్ పేర్కొంది. ఇది వారి మానవ హక్కులకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనేనని కమిషన్ తన పరిశీలనలో వివరించింది.
తమ ఉద్యోగులకు భద్రమైన, సురక్షితమైన సానుకూల వాతావరణాన్ని అందించడం ప్రతి యజమాని ప్రధాన విధి అని ఎన్ హెచ్ ఆర్ సీ వివరించింది.. ప్రతి సంస్థ తమతో పని చేసే ప్రతి ఒక్కరినీ గౌరవ మర్యాదలతో చూసుకోవాలని కోరింది.
మానవ హక్కుల సమస్యల విషయంలో వ్యాపార సంస్థలు జవాబుదారీగా ఉండాలని, ప్రపంచ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వారి పని, ఉపాధి విధానాలనూ, నిబంధనలను క్రమం తప్పకుండా ఆధునీకరించాలని కమిషన్ స్పష్టం చేసింది. పుణే కేసులో యువ ఉద్యోగి దుర్మరణం చెందిన నేపథ్యంలో దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఈ విషయంలో సంబంధిత వ్యక్తులు, సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ సూచించింది.
ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను కోరుతూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసు జారీ చేసింది. యువ ఉద్యోగి మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తు ఫలితాలను తెలియజేయాలని కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలతోపాటు, తీసుకోవాల్సిన ప్రతిపాదిత చర్యలను కూడా తెలియజేయాలని కమిషన్ కోరింది. నాలుగు వారాల్లో కేంద్ర కార్మిక శాఖనుంచి జవాబు వచ్చే అవకాశం ఉంది.
దుర్మరణంపాలైన అమ్మాయి తల్లి తన కుమార్తె మరణంపై చేసిన ఆరోపణలు సెప్టెంబర్ 18, 2024న మీడియాలో వచ్చాయి. తన కూతురు పని చేస్తున్న సంస్థలో నెలకొన్న భారీ పని సంస్కృతి ఆమె మరణానికి కారణమని, కష్టపడి పని చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, అదే సబబనేలాగా ఒత్తిడి చేయడంవల్ల ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతిన్నదని తల్లి పేర్కొన్నారు.
విలువలు ,మానవ హక్కుల గురించి మాట్లాడే సంస్థ తన స్వంత ఉద్యోగి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని ఆ తల్లి ఆవేదన చెందినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లోని రెండు బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాల్లో అమలు చేస్తున్న అన్యాయమైన పద్ధతులకు సంబంధించి ఇటీవల వచ్చిన మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఆ ఘటనల్ని సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రెండు ఘటనలు కమిషన్ పరిశీలనలో ఉన్నాయి. వ్యాపార సంస్థలు తమ సంస్థాగత సంస్కృతిలో మానవహక్కుల సంరక్షణను, భద్రతను భాగం చేయాలని వివిధ వేదికల ద్వారా కమిషన్ సూచిస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల విషయంలో ఈ పని చేయాలని చెబుతోంది. తాము సుస్థిరంగా అమలు చేస్తున్న విధానాలనేవి ఆరోగ్యకరమైన పని వాతావరణానికీ, ఉద్యోగుల సంక్షేమానికీ దోహదం చేయాలని కమిషన్ కోరుతోంది.
మానవ హక్కులపై వివిధ సంస్థలకు ముఖ్యంగా వ్యాపార, పరిశ్రమలకు చెందిన సంస్థలకు అవగాహన కల్పించడానికి 'మానవ హక్కులు, వ్యాపార సంస్థల్లో తలెత్తే సమస్యలను సమన్వయం చేయడం'పై ఒక సమావేశాన్ని గత సంవత్సరం కమిషన్ నిర్వహించింది. వ్యాపార సంస్థల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీసే వివిధ పద్ధతులను, పని వాతావరణాన్ని పరిశీలించడానికి ప్రత్యేక మానిటర్ ని కమిషన్ నియమించింది.
వ్యాపార సంస్థల పరిస్థితులు, మానవ హక్కులకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాలను, నిబంధనలను సమీక్షించి, వాటి మెరుగుదల కోసం చర్యలను సూచించడానికి ప్రత్యేకంగా 'వ్యాపార సంస్థలు, మానవ హక్కులపై కోర్ గ్రూప్స్ ని కమిషన్ ఏర్పాటు చేసింది. కోర్ గ్రూప్ ఇచ్చే నివేదిక ఆధారంగా, కమిషన్ తన సిఫార్సులను పటిష్టం చేస్తుంది. ఆ తర్వాత వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిలో భాగమైన సంస్థలకు పంపుతుంది. తద్వారా ఆయా వ్యాపారసంస్థల్లో, పరిశ్రమల్లో మానవ హక్కులు, ఆరోగ్యకరమైన పని వాతావరణం నెలకొనేలా చూస్తుంది.
***
(Release ID: 2057714)
Visitor Counter : 49