పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ‘భవిష్యత్ శిఖరాగ్ర సమావేశం’ అనుబంధ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి
ప్రపంచవ్యాప్తంగా లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను అవలంబించడం ద్వారా 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 2 బిలియన్ టన్నులు తగ్గుతాయని తెలిపిన లీనా నందన్
ప్రధానమంత్రి కార్యక్రమం 'ఏక్ పెడ్ మా కే నామ్' ను ప్రధానంగా ప్రస్తావించిన కార్యదర్శి: ప్రపంచవ్యాప్తంగా తల్లి పేరు మీద, భూమాత కోసం చెట్లు నాటడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం
జూన్ 5 నుంచి సెప్టెంబర్ 17 మధ్య భారత దేశవ్యాప్తంగా 75 కోట్లు,
అంటే రోజుకు 70 లక్షల చెట్లను నాటినట్లు తెలిపిన లీనా నందన్
భారత్‌లో హరిత ఉద్యోగాలకు సంబంధించి యువతకు నైపుణ్యం కల్పించడంలో నూతన విద్యావిధానం, హరిత ఉద్యోగాల కోసం నైపుణ్య శిక్షణ కౌన్సిల్ కీలకమని వ్యాఖ్య
Posted On:
21 SEP 2024 5:24PM by PIB Hyderabad
ఈ రోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ‘భవిష్యత్ శిఖరాగ్ర సమావేశానికి’ అనుబంధంగా జరిగిన కార్యక్రమంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గౌరవ లీనా నందన్ ప్రసంగించారు. ‘సుస్థిర భవిష్యత్ కోసం యువతకు సాధికారత: ఖచ్చితమైన పరివర్తన కోసం తరతరాలపై ఉన్న బాధ్యత, నైపుణ్యాలు’ అనే అంశంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.
ప్రసంగం ప్రారంభంలో లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్- ఎల్ఐఈఎఫ్)కు సంబంధించి రెండు నిమిషాల నిడివి గల వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వాతావరణ మార్పు అనే సవాలును పరిష్కరించడానికి భారత్ అనుసరిస్తోన్న బహుముఖ విధానానికి సంబంధించిన తాత్వికత, నిజమైన స్ఫూర్తిని తెలిపే విధంగా ఈ రెండు నిమిషాల వీడియో ఉందని అన్నారు. కాప్-26లో భారత ప్రధాని ప్రకటించిన కీలక వ్యూహాల్లో మిషన్ లైఫ్ కూడా ఒకటని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సమక్షంలో 2022 అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా మిషన్ లైఫ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నాయకత్వంలో మిషన్ లైఫ్ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతోంది.
పర్యావరణ అనుకూల పద్ధతులు, స్థిరమైన జీవనశైలిని అవలంబించే విధంగా మన రోజువారీ ప్రవర్తనలో మార్పును మిషన్ లైఫ్ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సుస్థిర వినియోగ పద్ధతులను జీవితంలోకి తీసుకురావటం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యం-12 విషయంలో మిషన్ లైఫ్ గణనీయమైన పురోగతిని సాధించగలదని అన్నారు.
భారత్ ప్రతిపాదించిన క్లైమేట్ యాక్షన్ తీర్మానానికి బొలీవియా, శ్రీలంకల నుంచి మద్దతు లభించిందని ఆమె తెలిపారు. ఇది ఇచ్చిన ఊపుతోనే, 2024 మార్చి 1న నైరోబీలో జరిగిన ఆరో సమావేశంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించే తీర్మానాన్ని ఆమోదించిందని పేర్కొన్నారు. మిషన్ లైఫ్ కార్యచరణను అమలు చేయడం వల్ల 2030 నాటికి ప్రపంచ గ్రీన్ హౌస్ ఉద్గారాలను ఏటా 2 బిలియన్ టన్నులు తగ్గించవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసిందని అన్నారు.
తరాల మధ్య అంతరం లేకుండా చూసుకునేందుకు నేటి పిల్లలు, యువత చాలా అవసరమని ఆమె ప్రధానంగా చెప్పారు. న్యాయమైన పరివర్తనకు అవసరమైన నైపుణ్యాలు, సాధనాలతో వారిని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జనాభాలో దాదాపు 28 శాతం ఉన్న మన యువత హరిత ఆర్థిక వ్యవస్థకు పరివర్తన చెందడానికి కావాల్సిన గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఆమె వివరించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా.. సుస్థిర, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి ఈ జనాభా డివిడెండ్ అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు.
హరిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం, హరిత ఉద్యోగాల కోసం నైపుణ్య శిక్షణ కౌన్సిల్ (స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్-ఎస్‌సీజీజే)లతో పాటు భారతదేశ నూతన విద్యావిధానం.. హరిత ఉద్యోగాల విషయంలో పెరుగుతున్న డిమాండ్‌కు సంబంధించి సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుందని అన్నారు.
భారతదేశంలో హరిత ఇంధన పరివర్తన వల్ల 30-35 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించొచ్చని 2047కి సంబంధించి ఎస్‌సీజీజే దార్శనికత అంచనా వేస్తోందని ఆమె పేర్కొన్నారు. యువతకు సాధికారత కల్పించడం, నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా హరిత ఉద్యోగాలను సృష్టించాలని అంతర్జాతీయ సౌర కూటమి, ప్రపంచ జీవ ఇంధన కూటమి వంటివి లక్ష్యంగా పెట్టుకున్నాయి. సుస్థిర వినియోగం, ఉత్పత్తికి సంబంధించిన జీవన శైలిని ప్రోత్సహించడం కోసం దేశం తీసుకుంటున్న చర్యలను గురిస్తూ.. యూఎస్ఈపీకి చెందిన 10 ఏళ్ల ప్రాథమిక కార్యాచరణ పథకాల (10వైఎఫ్పీ) బోర్డులో రెండు సంవత్సరాల పాటు పాల్గొనేందుకు భారత్ నామినేట్ అయిందని తెలిపారు.
మిషన్ లైఫ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకించారు. " తరుచుగా ఉద్గారాల తగ్గింపు వాదనకే మన చర్చలు పరిమితం అవుతుంటాయి. కానీ కేవలం నిర్ణయాలను ఇతరులపై రుద్దకుండా సరైన పరిష్కారాలను అందిస్తే మనం విజయం సాధించే అవకాశం ఉంది. ఇదే కారణంతో జీవనశైలిలో మార్పు కోసం పిలుపునిస్తున్నాను. ఎందుకంటే, మనం కోరుకునే ఉద్గారాల తగ్గింపు మనం ఎలా జీవిస్తాం, పనిచేస్తాం అనే దాని ఫలితంగా ఉంటుంది." అని అన్నారు.
స్వంత తల్లి, భూమాత పట్ల ప్రేమ, గౌరవానికి చిహ్నంగా మొక్కలను నాటడంలో భారత్‌తో పాటు ప్రపంచ పౌరులను ఇందులో భాగస్వాములుగా చేయడానికి ఉద్దేశించిన "ఏక్ పేడ్ మా కే నామ్" లేదా "తల్లి కోసం చెట్టు నాటటం" కార్యక్రమాన్ని ప్రారంభించడంలో.. ప్రధాని మోదీ దూరదృష్టిని వారి దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమం కింద జూన్ 5 నుంచి సెప్టెంబర్ 17 మధ్య భారతదేశంలో 75 కోట్లకు పైగా చెట్లను నాటామని, అంటే రోజుకు 70 లక్షల చెట్లని ప్రకటించారు.
ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు భూగోళానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మన పిల్లలు, యువత భవిష్యత్తుకు ముఖ్యమని గుర్తించి అందరూ కలిసి ముందుకు సాగాలని ఆమె కోరారు.
***
(Release ID: 2057643)