జల శక్తి మంత్రిత్వ శాఖ
ఎనిమిదో ఇండియా వాటర్ వీక్ లో భాగమైన అంతర్జాతీయ ‘వాష్’ సమ్మేళనం - 2024 ముగింపు
ముఖ్యమైన ‘వాష్’ సవాళ్ళ గురించి నలభైకి పైగా ప్రత్యేక ఇతివృత్తాల సదస్సులు,
180 నిపుణుల సమర్పణలు
జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ మిషన్ తదితర పథకాలు: గ్రామీణ ప్రాంతాల నీటి నిర్వహణలో భారత్ నాయకత్వ పాత్ర స్పష్టీకరణ
భవిష్యత్తు నీటి సవాళ్ళ పరిష్కారం నిమిత్తం ప్రపంచ దేశాల పరస్పర సహకారం, స్థానిక, ఉన్నత సాంకేతిక పరిష్కారాలపై దృష్టి
Posted On:
19 SEP 2024 10:05PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరిగిన ఎనిమిదో నీటి వారోత్సవాల్లో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం అంతర్జాతీయ ‘వాష్’ (నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ముఖ్యాంశాలుగా) సమ్మేళనాన్ని నిర్వహించింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నీటి నిర్వహణ’ ప్రధానాంశంగా జరిగిన మూడు-రోజుల సమ్మేళనంలో, నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు-6 (ఎస్డీజీ 6 ) సాధించేందుకు అవలంబించదగ్గ సమాచార మార్పిడి, సృజనాత్మక నూతన ఆవిష్కరణల ప్రదర్శన, ప్రపంచం ఎదుర్కొంటున్న‘వాష్’ సవాళ్ళను అధిగమించేందుకు చేపట్టవలసిన చర్యలను చర్చించారు.
సమ్మేళనంలో తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి శ్రీమతి వినీ మహాజన్, అదే విభాగానికి చెందిన ఓఎస్డీ శ్రీ అశోక్ కే. కే. మీనా, జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ శ్రీ చంద్ర భూషణ్ కుమార్, తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, గ్రామీణ ప్రాంతాల ‘వాష్’ భాగస్వాములు, పత్ర సమర్పకులు పాల్గొన్నారు.
నీటి నాణ్యత, మురుగునీటి నిర్వహణ, పౌరసమాజ భాగస్వామ్యం, సమాచారం – అవగాహన - ఆలోచనల్లో మౌలిక మార్పు (ఐఈసీ/ బీసీసీ) , మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టిన మార్పులు వంటి అనేక అంశాలతో పాటు 40 కి పైగా ప్రత్యేక ఇతివృత్తాలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ సదస్సుల్లో చర్చించారు. ఇవే అంశాలను చర్చించేందుకు 143 ప్రత్యక్షంగానూ, 43 ఇంటర్నెట్ ద్వారానూ పరిశోధనా పత్రాలను సమర్పించారు. 5 ప్యానల్ చర్చలు జరిగాయి.
తొలి రోజు నీటి శుద్ధి సాంకేతికతలను, నీటి సరఫరా పథకాలు సాఫీగా సాగేందుకు స్థానిక పౌరుల భాగస్వామ్యం అవసరమన్న నేపథ్యంలో కీలక సదస్సులు జరిగాయి. జల్ జీవన్ మిషన్ ప్రభావాన్ని ‘ది నేషనల్ సేఫ్ వాటర్ డైలాగ్’ తెలియచేసింది. నీటి శుద్ధి పద్ధతుల అమలు నుంచి నేర్చుకున్న పాఠాలు, పౌరసమాజ భాగస్వామ్యం, జల్ జీవన్ మిషన్ ప్రభావం తీరు అంశాలని చర్చించారు.
రెండవ రోజు కంప్యూటర్, ఇంటర్నెట్ సాంకేతికతలు స్కాడా(ఎస్ సీ ఏ డీ ఏ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి డిజిటల్ సదుపాయాలు నీటి యాజమాన్యాన్ని సమూలంగా మార్చివేస్తున్న తీరును చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఓఎస్డీ శ్రీ అశోక్ కే. కే. మీనా చేసిన కీలకోపన్యాసంలో నీటి నాణ్యత పర్యవేక్షణ, సరఫరాల్లో మెరుగైన సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు. నీటి నిర్వహణ వ్యవస్థల మెరుగుదలలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతల పాత్రను గురించి కోల్ కతాలోని ఎస్ పీ ఎం నివాస్ లో కూడా ఏక కాలంలో సదస్సులను నిర్వహించారు.
సమ్మేళనం మూడో రోజు కేంద్ర గృహనిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి డి. తార నేతృత్వంలో ‘గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో తాగునీరు సాకారం’ అనే చర్చతో ప్రారంభమయ్యింది. సదస్సుకు జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్ర భూషణ్ కుమార్ సహ అధ్యక్షత వహించారు. గ్రామీణ నీటి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నీటి యాజమాన్యాల మధ్య సహకారం ప్రాముఖ్యం, స్థిరమైన నీటి సరఫరా సాధ్యమయ్యేందుకు స్థానిక ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యం వంటి అనేక అంశాలను ముఖ్యాంశాలుగా చర్చించారు.
ప్రభత్వం నల్లాల ద్వారా పంపిణీ చేసే నీరు సూరక్షితమైనదనే నమ్మకం ప్రజల్లో పెంపొందించేందుకు, వారి ఆలోచనల్లో మార్పు తేగల కచ్చితమైన చర్యలను (బీసీసీ) గురించి జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. విపత్తు నిర్వహణ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న నూతన పరిష్కారాల ఏకీకరణ, ప్రపంచ నీటి సమస్యను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడి, సురక్షితమైన నీరు అందించడం ద్వారా పౌరుల ఆరోగ్య పరిరక్షణ, వివిధ ప్రాంతాల్లో వ్యాధినిరోధకత పెంపొందించడం వంటి అంశాలను కూడా సమావేశంలో చర్చించారు.
ఎగ్జిబిషన్ : గ్రామీణ ప్రాంతాల్లో ‘వాష్’ రంగం బలోపేతం కోసం అనుసరించదగ్గ మార్గాన్ని ప్రదర్శించిన ‘స్వచ్ఛ్ సుజల్ గావ్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో నీటి యాజమాన్యం, పారిశుద్ధ్య రంగాలలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను గురించి పరస్పరం తెలియచేసుకునే అవకాశాన్ని, దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పించింది.
భవిష్య ప్రణాళికలు
అంతర్జాతీయ వాష్ సమ్మేళనం 2024 ఎన్నో సత్ఫలితాలను, లోతైన క్రియాశీల ఆలోచనలను ముందుకు తెచ్చింది. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల సాయంతో గ్రామీణ ప్రాంతాల నీటి నిర్వహణలో భారత్ నాయకత్వ పాత్రను సమ్మేళనం స్పష్టం చేసింది. అదే సమయంలో దేశాల మధ్య సహకారం, స్థానిక పరిష్కారాలు, నూతన సాంకేతికత అందించే పరిష్కారాల సాయంతో భవిష్యత్తులో తలెత్తబోయే సవాళ్లను అధిగమించే మార్గాల అన్వేషణ ఎంత ముఖ్యమైనదో తెలియచెప్పింది.
***
(Release ID: 2057306)
Visitor Counter : 53