వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియానే లో ఈ నెల 20, 21 తేదీలలో పర్యటించనున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఏషియాన్ - ఇండియా ఆర్థిక మంత్రుల ఇరవై ఒకటో సమావేశంలోను, ఈస్ట్ ఏషియా సమిట్ ఆర్థిక మంత్రుల పన్నెండో సమావేశంలోను శ్రీ పీయూష్ గోయల్ పాల్గొంటారు
Posted On:
20 SEP 2024 10:39AM by PIB Hyderabad
వాణిజ్యం- పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ నెల 20వ, 21వ తేదీల్లో లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (లావోస్)లో వియంటియాని సందర్శించనున్నారు. ఆయన ఏషియాన్-ఇండియా ఎకనామిక్ మినిస్టర్స్ (ఎఇఎమ్-ఇండియా) ఇరవై ఒకటో సమావేశంతో పాటు, ఈస్ట్ ఏషియా సమిట్ ఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్ (ఇఎఎస్ ఇఎమ్ఎమ్) పన్నెండో శిఖరాగ్ర సమావేశంలో కూడా పాలుపంచుకోనున్నారు. ఏషియాన్ తన సభ్యదేశాలతో ఏటా నిర్వహించే ఈ సమావేశాలకు లావో పీడీఆర్ ఆతిధ్య దేశంగా వ్యవహరిస్తోంది. ఈ సంవత్సరంలో ఏషియాన్ కు అధ్యక్ష పదవి బాధ్యతలను నిర్వహిస్తున్న లావో పిడిఆర్ ఆ హోదాలోనే ఈ సమావేశాలకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
ఈస్ట్ ఏషియా సదస్సు- ఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్ (ఇఎఎస్ ఇఎమ్ఎమ్) లో ఏషియాన్ లోని పది దేశాల ఆర్థిక మంత్రులు, ఇఎఎస్ లోని 8 ఇతర భాగస్వామ్య దేశాల (అంటే భారతదేశం, అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు.
ఏషియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఎఐటిఐజిఎ) కు సంబంధించిన సమీక్షా పరమైన సంప్రదింపులలో పురోగతి ఎంత చోటుచేసుకొందీ మంత్రులు ఎఇఎమ్-ఇండియా సమావేశం సందర్భంగా పరిశీలించనున్నారు. ఎఐటిఐజిఎ ని వినియోగదారులకు మరింత అనుకూలమైన విధంగా తీర్చిదిద్దాలనేది ఈ సమావేశాలలో ప్రాథమ్యంగా ఉండబోతోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపైన మంత్రులు ఈస్ట్ ఏషియా సదస్సు ఆర్థిక మంత్రుల (ఇఎఎస్ ఇఎమ్ఎమ్) సమావేశంలో భాగంగా చర్చోపచర్చలను జరపనున్నారు. భారతదేశం ఈస్ట్ ఏషియా సమిట్ ఫోరానికి వ్యవస్థాపక సభ్యత్వ దేశంగా ఉంది. ఈ ఫోరమ్ వచ్చే సంవత్సరంలో రెండు దశాబ్దాల కాలాన్ని పూర్తి చేసుకోనున్నది.
ఈ రెండు సంస్థాగత సమావేశాలకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హాజరై, ఈ సమావేశాలలో పాలుపంచుకొనే దేశాల మంత్రులతో అనేక ద్వైపాక్షిక సమావేశాల్లో భేటీ కానున్నారు. ఆతిథ్య దేశమైన లావో పిడిఆర్ తో పాటు కొరియా, మలేషియా, స్విట్జర్లాండ్, ఇంకా మయన్మార్ల మంత్రులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీ పీయూష్ గోయల్- ఏషియా సెక్రటరీ జనరల్ తోను, ఇఆర్ఐఎ అధ్యక్షుడితోను సమావేశం కానున్నారు. లావో పిడిఆర్ లో ప్రవాస భారతీయులతో కూడా మంత్రి సమావేశం కానున్నారు. ఆయన భారతదేశం నుంచి లావోస్ కు విచ్చేసే పరిశ్రమ ప్రతినిధి వర్గంతో, ఏషియాన్ తో సైతం భేటీ కానున్నారు.
భారతదేశం 1992 లో ఏషియాన్ లో చేరి, 2022లో ఈ కూటమి లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశం హోదా ను పొందింది. గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 లో ప్రకటించగా, అప్పటి నుంచి భారతదేశం అనుసరిస్తూ వస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ లో ఏషియాన్ ది కీలక భూమిక. మన దేశానికి అతి ప్రధాన వ్యాపార భాగస్వాములలో ఒకటిగా ఉన్న ఏషియాన్ గత రెండు సంవత్సరాలలో మన దేశానికి రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా రూపొందింది.
****
(Release ID: 2057305)
Visitor Counter : 52