నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల పెట్టుబ‌డిదారుల నాలుగో ప్ర‌పంచ స‌ద‌స్సు-ప్ర‌ద‌ర్శ‌నలో (రీ ఇన్వెస్ట్) రూ.32.45 ల‌క్ష‌ల కోట్ల ప్ర‌తిపాద‌న‌లు : శ్రీ ప్ర‌హ్లాద్ జోషి

Posted On: 17 SEP 2024 8:27PM by PIB Hyderabad

మ‌హోజ్వ‌ల‌మైన భవిష్యత్ కోసం  భారీ స్థాయిలో  పెట్టుబ‌డుల‌ను  ఆక‌ర్షించిన తొలి  కార్య‌క్ర‌మంగా  రీ  ఇన్వెస్ట్ నాలుగో స‌ద‌స్సు  చ‌రిత్రాత్మ‌కంగా  నిలిచిపోతుంద‌ని  కేంద్ర  న‌వ్య‌,  పున‌రుత్పాద‌క  ఇంధ‌న  శాఖ‌  మంత్రి  శ్రీ  ప్ర‌హ్లాద్  జోషి  అన్నారు.  ఈ  స‌ద‌స్సులో పాల్గొన్న  వారంద‌రూ   2030  నాటికి  ఈ  రంగంలో  రూ.32.45   ల‌క్ష‌ల  కోట్లు  పెట్టుబ‌డి  పెట్టేందుకు  శపథ పత్రాల రూపంలో హామీలిచ్చిన‌ట్టు  ఆయ‌న  తెలిపారు.  నిన్న  జ‌రిగిన  ఈ  కార్య‌క్ర‌మంలో  ఇంత  భారీగా  పెట్టుబ‌డి  ప్ర‌తిపాద‌న‌లు  రావ‌డానికి  ప్ర‌ధాన‌మంత్రి  క‌ట్టుబాటే  కార‌ణ‌మ‌ని  ఆయ‌న అన్నారు.

570 గిగావాట్ల అద‌న‌పు సామ‌ర్థ్యం జోడింపున‌కు డెవ‌ల‌ప‌ర్లు; అద‌నంగా 340 గిగావాట్ల సోలార్  మాడ్యూళ్లు, 240 గిగావాట్ల సోలార్  సెల్స్, 22 గిగావాట్ల గాలిమ‌ర‌లు, 10 గిగావాట్ల ఎల‌క్ట్రోలైజ‌ర్ల త‌యారీ సామ‌ర్థ్యాలు జోడించేందుకు ఉత్ప‌త్తిదారులు అంగీక‌రించార‌ని గుజ‌రాత్‌లోని  గాంధీన‌గ‌ర్‌లో ప‌త్రికా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ మంత్రి చెప్పారు.  అంతే కాదు... మ‌రింత స్వ‌చ్ఛ‌మైన‌, సుస్థిర  భార‌త్  నిర్మాణానికి చేయి చేయి క‌లిపి, క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసేందుకు రాష్ట్రాలు, డెవ‌ల‌ప‌ర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ముందుకొచ్చారని  శ్రీ జోషీ తెలిపారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో భారీ పెట్టుబ‌డి హామీలు ప్ర‌క‌టించినందుకు డెవ‌ల‌ప‌ర్లు;  సోలార్ మాడ్యూల్‌, సెల్ ఉత్ప‌త్తిదారులు; ఎల‌క్ట్రోలైజ‌ర్  త‌యారీదారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు మంత్రి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు.  పెట్టుబ‌డుల గ‌మ్యంగా, ప్ర‌త్యేకించి ఆర్ఈ రంగంలో అవ‌కాశాల కేంద్రంగా భార‌త‌దేశంపై దేశీయ , అంత‌ర్జాతీయ స‌మాజానికి గ‌ల న‌మ్మ‌కం, విశ్వాసానికి ఇది తార్కాణం.పున‌రుత్పాద‌క ఇంధ‌నం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తి. ఈ దిశ‌లో ప్ర‌ధాన‌మంత్రి ముందుండి అంద‌రికీ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంధ‌న రంగంలో త‌దుప‌రి మార్పున‌కు భారత్  నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌న్న విశ్వాసంతో ప్ర‌పంచం యావ‌త్తు ఆయ‌న వైపు, దేశం వైపు ఆస‌క్తిగా చూస్తోంది. ఆ ఫ‌లితాలు మ‌నకు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఈ మార్పు  అంత‌టికీ మూల కార‌కుడు ప్ర‌ధాన‌మంత్రి అని శ్రీ జోషి అన్నారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో భారత్  భారీ ల‌క్ష్యాల‌ను ప్ర‌పంచం ముందుంచ‌డంలో సాహ‌సం, వినూత్నత రెండింటినీ ప్ర‌ధాని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. స‌రికొత్త శ‌క్తితో ఈ విప్ల‌వానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నందుకు రాష్ట్రాలు, కంపెనీల‌ను ఆయ‌న అభినందించారు.

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ తొలి 100 రోజుల కాలంలో పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల రంగం ఎన్నో అడుగులు ముందుకు వేసిన నేప‌థ్యంలో ఇది ఒక ప్ర‌త్యేక దినంగా  నిలిచిపోతుంద‌ని కేంద్ర మంత్రి అన్నారు. అలాగే  దండి కుటీర్ సంద‌ర్శించే భాగ్యం త‌న‌కు క‌ల‌గ‌డం కూడా ఈ రోజు ప్ర‌త్యేక అని తెలుపుతూ స్వాతంత్య్ర సాధ‌న కోసం మ‌హాత్మా గాంధీ చేసిన పోరాటానికి చెందిన ఎన్నో జ్ఞాప‌కాల‌ను అది గుర్తుకు తెచ్చింద‌ని చెప్పారు. ఆ నిర్మాణం అద్భుతంగా ఉందంటూ ప్ర‌త్యేకించి ఉప్పు ప‌ర్వ‌తం ఆకారంలో నిర్మించిన ఆ కుటీరం దండి యాత్ర‌కు, గాంధీజీ ఉప్పు స‌త్యాగ్ర‌హ ఉద్య‌మానికి చిహ్నంగా నిలుస్తుంద‌న్నారు. గుజ‌రాత్‌లో 4వ రీ ఇన్వెస్ట్  స‌ద‌స్సును ప్రారంభించినందుకు ప్ర‌ధానికి తాను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్న‌ట్టు చెప్పారు. అలాగే ఆ వేదిక నుంచి ప్ర‌ధాని ఇంధ‌న విప్ల‌వాన్ని ర‌గిలించార‌ని అభివ‌ర్ణించారు. దేశాన్ని 500 గిగావాట్ల ల‌క్ష్యం బాట‌లో న‌డ‌ప‌డంలో నాయ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌పంచానికే ఒక ఆశాజ్యోతిగా నిలిచార‌ని చెప్పారు.

సీఈఓ  రౌండ్  టేబుల్‌

కేంద్ర న‌వ్య‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్  జోషి  సీఈఓ రౌండ్ టేబుల్‌కు అధ్య‌క్ష‌త వ‌హించారు. 500 గిగావాట్ల ల‌క్ష్యం అనేది కేవ‌లం ఒక సంఖ్య కాద‌ని, అది ఒక సంక‌ల్ప‌మ‌ని ఆయ‌న  చెప్పారు. దీన్ని సాధించ‌డంలో స‌హ‌క‌రించేందుకు ప్ర‌భుత్వం నుంచి ఏ స‌దుపాయాలు కావాలో సీఈఓలు తెలియ‌చేయాల‌ని సూచించారు.  త‌యారీని పెంచ‌డానికి;  స‌మ‌ర్థ‌వంత‌మైన ఆర్‌పిఓ విధానం అమ‌లు ప‌ర‌చ‌డం ద్వారా డిమాండు పెంపున‌కు, ప్రాజెక్టుల స్థాయిలోpoorva స్థాయిని తేవడానికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల గురించి సీఈఓలు వివ‌రించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పున‌రుత్పాద‌క ఇంధ‌నాల్లో  భార‌త‌-జ‌ర్మ‌నీ పెట్టుబ‌డుల వేదిక‌ను 4వ రీ-ఇన్వెస్ట్  స‌ద‌స్సు  సంద‌ర్భంగా ప్రారంభించారు. పున‌రుత్పాద‌క ఇంధ‌నం త్వ‌రిత గ‌తిన విస్త‌రించేందుకు ప‌టిష్ఠ‌మైన, సుస్థిర ప‌రిష్కారాలు అభివృద్ధి చేయ‌డం ఈ వేదిక ల‌క్ష్యం. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో మూల‌ధ‌న డిమాండు, టెక్నాల‌జీ బ‌దిలీ, న‌వ్య‌త‌తో కూడిన సాంకేతిక ప‌రిష్కారాలకు డిమాండు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయా విభాగాల్లో
వ్యాపారావ‌కాశాలు సృష్టించ‌డం కోసం అంత‌ర్జాతీయ భాగ‌స్వాములంద‌రినీ ఈ వేదిక‌ ఒకే ఛ‌త్రం కింద‌కు తీసుకువ‌స్తుంది. ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల‌కు చెందిన ప్రైవేటు రంగ (ఆర్థిక‌, పారిశ్రామిక రంగాలు) సంస్థ‌లు, అంత‌ర్జాతీయ సంస్థ‌లు, అభివృద్ధి బ్యాంకులు, ద్వైపాక్షిక భాగ‌స్వాములు ఈ ఛ‌త్రం కిందకు వ‌స్తారు.

సోలార్ పీవీ మాడ్యూల్ త‌యారీ స్థాపిత సామ‌ర్థ్యం

2014  నాటికి దేశంలో పీవీ మాడ్యుల్ త‌యారీ విభాగంలో స్థాపిత సామ‌ర్థ్యం  సుమారు 2.3 గిగావాట్లుండ‌గా సోలార్ పీవీ సెల్  త‌యారీ స్థాపిత సామ‌ర్థ్యం 1.2 గిగావాట్లుంది. నేడు సోలార్ పీవీ మాడ్యూల్ త‌యారీ సామ‌ర్థ్యం సుమారు 67 గిగావాట్ల‌కు (ఏఎల్ఎంఎంలో చేర్చ‌డానికి అందుబాటులోకి వ‌చ్చిన స‌మాచారం), సోలార్ పీవీ సెల్ త‌యారీ స్థాపిత సామ‌ర్థ్యం సుమారు 8 గిగావాట్ల‌కు పెరిగింది.

100 రోజుల అధికార స‌మ‌యంలో ఎంఎన్ఆర్ఇ విజ‌యాలు

1.    జూన్‌, జూలై, ఆగ‌స్టు నెల‌ల కాలంలో 4.5 గిగావాట్ల ఆర్ఈ సామ‌ర్థ్యం జోడించాల‌న్న‌ది ల‌క్ష్యం కాగా 6.0 గిగావాట్ల సామ‌ర్థ్యం జోడింపు

2.     శిలాజేత‌ర ఇంధ‌న వ‌న‌రుల సామ‌ర్థ్యం 207.76 గిగావాట్ల‌కు చేరిక‌

3.     2024 జూన్-ఆగ‌స్టు నెల‌ల మ‌ధ్య కాలంలో 10 గిగావాట్ల  సామ‌ర్థ్యం గ‌ల విద్యుత్  కొనుగోలు బిడ్లు జారీ చేయాల‌న్న‌ది ల‌క్ష్యం కాగా ఆర్ఈఐఏలు జారీ చేసిన బిడ్ల విలువ 14 గిగావాట్లు

4.     రెండు సోలార్ పార్కులు పూర్తి

5.     పిఎం కుసుమ్  ప‌థ‌కం కింద ల‌క్ష సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు

6.     పిఎం సూర్య ఘ‌ర్ ప‌థ‌కం కింద 3.56 ల‌క్ష‌ల రూఫ్‌టాప్ సోలార్  వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటు

7.     సోలార్ పీఎల్ఐ ప‌థ‌కం కింద మొత్తం 13.8 గిగావాట్ల‌ సోలార్ మాడ్యూళ్ల  ఉత్పత్తి  ప్రారంభం

8.     జాతీయ హ‌రిత హైడ్రోజన్  మిష‌న్ కార్య‌క్ర‌మం కింద రెండో విడ‌త‌లో 1500 మెగావాట్ల వార్షిక సామ‌ర్థ్యం గ‌ల ఎల‌క్ట్రోలైజ‌ర్ల త‌యారీకి 11 కంపెనీల ఎంపిక‌

9.     జూన్ 19వ తేదీన ఆఫ్‌షోర్ విండ్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం; ఎస్ఈసీఐ ఆర్ఎఫ్ఎస్ జారీ

10. గిఫ్ట్  సిటీలో “ఇరెడా గ్లోబ‌ల్  గ్రీన్  ఎన‌ర్జీ ఫైనాన్స్ ఐఎఫ్ఎస్‌సి లిమిటెడ్” పేరిట ఇరెడా అనుబంధ సంస్థ‌ ఏర్పాటు

 

***



(Release ID: 2056554) Visitor Counter : 31