రాష్ట్రపతి సచివాలయం
ఎంఎన్ఐటీ, జైపూర్ 18వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి
Posted On:
18 SEP 2024 2:23PM by PIB Hyderabad
రాజస్థాన్ లోని జైపూర్ లో ఈరోజు జరిగిన మాలవీయ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ ఐటీ) 18వ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన సాంకేతిక విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎన్ఐటీలను ఏర్పాటు చేశామన్నారు. నైపుణ్యం, సమర్థత కలిగిన మానవ వనరులను అందించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఎన్ఐటీల ప్రాముఖ్యత దృష్ట్యా వాటికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా హోదా కల్పించారు.
ఎన్ఐటీల్లో సగం మంది విద్యార్థులు సొంత రాష్ట్రం నుంచి వస్తున్నారని, మిగతా సగం మంది జాతీయ ర్యాంకింగ్ ఆధారంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. ఈ విధంగా, ఈ వ్యవస్థ ఒక వైపు, స్థానిక ప్రతిభావంతుల
వికాసానికి వీలుకల్పిస్తూనే, మరోవైపు, భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని బలోపేతం చేయడానికి కూడా దోహద పడుతుందని అన్నారు. దేశాన్ని పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా మార్చడంలో ఎన్ఐటీ వంటి సాంకేతిక సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఎంఎన్ఐటీలో ఏర్పాటు చేసిన ‘ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్’ ఇప్పటివరకు అనేక అంకుర సంస్థల ఏర్పాటు కార్యక్రమాలను నిర్వహించిందని, తద్వారా పెద్ద సంఖ్యలో పాల్గొన్నవారికి ప్రయోజనం చేకూరిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఎంఎన్ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లో సుమారు 125 అంకుర సంస్థలు నమోదు అయ్యాయని, ఇవి
కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయని ఆమె తెలిపారు.
ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవ యుగంలో, సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, సాంకేతిక రంగంలో భారత్ ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో మన సాంకేతిక సంస్థల పాత్ర చాలా కీలకమైనది. ఎంఎన్ఐటీలో కృత్రిమ మేధ, డేటా ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం, ఈ కాలపు డిమాండ్లను స్వీకరించేలా రూపుదిద్దుకోవాలన్న సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఎన్ఐఆర్ఎఫ్ రూపొందించిన ఇండియా ర్యాంకింగ్స్ 2024లో, ఇంజినీరింగ్ కేటగిరీలో దేశంలోని టాప్ 50 విద్యాసంస్థలలో ఎంఎన్ఐటీ స్థానం దక్కించుకోవడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఎంఎన్ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మరింత శ్రమపడి ఎంఎన్ఐటీని దేశంలోని టాప్ 10 సంస్థలలోకి తీసుకువస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి మాత్రమే కాకుండా మన ఆడబిడ్డల జీవన ప్రమాణాలుమెరుగుపడటానికి కూడా పరిశోధన, అభివృద్ధి రంగంలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్రపతి అన్నారు. ఇటీవలి కాలంలో స్టెమ్- సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్, మెడిసిన్ లో బాలికల నమోదు పెరిగిందని ఆమె పేర్కొన్నారు. పట్టా స్వీకరిస్తున్న మొత్తం విద్యార్థుల్లో బాలికలు సుమారు 29 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఈ స్నాతకోత్సవంలో 20 బంగారు పతకాలకుగాను 12 బంగారు పతకాలు మహిళా విద్యార్థులే సాధించారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన వారిలో బాలికల నిష్పత్తిని గమనిస్తే, అమ్మాయిలకు సమానావకాశాలు లభిస్తే వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలరనడానికి నిదర్శనమని ఆమె అన్నారు. విద్యార్థులు ఇప్పుడు తమ జీవితంలో కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. వారు కొత్త సవాళ్లు, అవకాశాలను ఎదుర్కొంటారు. ఎంఎన్ఐటీలో సంపాదించిన పరిజ్ఞానం, నైపుణ్యాలతో విద్యార్థులు ఆ సవాళ్లను ఎదుర్కొని, అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(Release ID: 2056553)
Visitor Counter : 45