నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ట్యుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ చేతులమీదుగా టెర్మినల్‌ జాతికి అంకితం

భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్; సదుపాయాల ఉన్నతీకరణకు ప్రభుత్వం భారీ పెట్టుబడులు

హరిత ఉదజని ప్రాజెక్టుకు శ్రీ సోనోవాల్ ప్రారంభోత్సవం; ‘‘హరిత ఉదజనికి భారత్ ప్రపంచ కూడలి కావాలన్న ప్రధాని దృక్కోణంలో ఇది కీలక ముందడుగ’’ని వ్యాఖ్య

ట్యుటికోరిన్ రేవుద్వారా 2024-25లో 50 మిలియన్ టన్నుల సరకు రవాణా నిర్వహణ లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక

‘‘మిషన్ 50’’ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ సోనోవాల్

గడువుకు ముందే కొత్త టెర్మినల్ పూర్తి... తొలి 100 రోజులలో శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన కీలక విజయమిది: శ్రీ సర్బానంద సోనోవాల్

‘హరిత సాగర్ గ్రీన్ పోర్ట్ ఇనిషియేటివ్’లో భాగంగా 400 కిలోవాట్ల రూఫ్‌టాప్ సౌరశక్తి ప్లాంటుకు శ్రీ సోనోవాల్ ప్రారంభోత్సవం

Posted On: 16 SEP 2024 6:28PM by PIB Hyderabad

   తమిళనాడులోని వి.ఒ.చిదంబరనార్ రేవు ప్రాధికార సంస్థ (విఒసిపిఎ) పరిధిలో ట్యుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ (టిఐసిటి)ని కేంద్ర ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ జాతికి అంకితం చేశారు. దీంతోపాటు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

   ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘వికసిత భారత్’గా ఆవిర్భవించే దిశగా దేశ ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. అలాగే ట్యుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మిన‌ల్‌ను ‘భారత సముద్ర మౌలిక సదుపాయాల్లో నవ్యతార’గా కొనియాడారు. ఈ సందర్భంగా- ‘‘మొత్తం  14 మీటర్లకుపైగా లోతు, 300 మీటర్ల పొడవైన బెర్తుతో నిర్మితమైన ఈ టెర్మినల్ ‘విఒసి’ రేవు సామర్థ్య విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే నౌకాశ్రయంలో రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయగలదని ప్రధాని వివరించారు. రెండేళ్ల కిందట తన పర్యటనలో భాగంగా ‘విఒసి’రేవు అభివృద్ధిలో భాగంగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించానని గుర్తుచేస్తూ, వీటిపై తమిళనాడు ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇవన్నీ సత్వరం  పూర్తికావడంపై ఆయన సంతృప్తి వెలిబుచ్చారు. లింగ వైవిధ్య నిర్వహణలో రేవు యాజమాన్యం నిబద్ధతను ప్రధాని కొనియాడారు. టెర్మినల్ కీలక విజయాలలో ఇదొకటని, ఇక్కడి ఉద్యోగులలో 40 శాతం మహిళలున్నారని పేర్కొన్నారు. భారత సముద్ర రంగంలో మహిళల సారథ్యాన ప్రగతికి ఇదొక ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు.

   కొత్త ‘టిఐసిటి’ టెర్మినల్ నుంచి తొలి కంటైనర్ నౌకను శ్రీ సోనోవాల్ కొత్త జెండా ఊపి సాగనంపారు. తద్వారా దేశంలోని ప్రధాన ఓడరేవు మౌలిక సదుపాయాల్లో భాగమైన ప్రాజెక్టులలో ఒకదానికి సంబంధించి కార్యకలాపాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కాగా, ₹434 కోట్లకుపైగా పెట్టుబడితో ఏటా 6 లక్షల ‘టిఇయు’ల నిర్వహణ సామర్థ్యంతో ఈ రేవును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ టెర్మినల్ లోతు 14.20 మీటర్లు కాగా, 10,000 ‘టిఇయు’లదాకా కంటైనర్ నౌకలను ఇక్కడ నిలిపే వీలుంటుంది.

   అనంతరం ఇక్కడ నిర్మించిన కొత్త హరిత ఉదజని ప్రాజెక్టును కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా- ‘‘హరిత ఉదజనికి భారత్ ప్రపంచ కూడలి కావాలన్న ప్రధాని దృక్కోణంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు ‘హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ ఇనిషియేటివ్’లో భాగంగా భవనం పైకప్పుపై నిర్మించిన 400 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంటును కూడా శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. అటుపైన ఆయన సమక్షంలో  ‘విఒసిపిఎ’లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన భూమి లీజు ఒప్పందాల ఆదానప్రదానం పూర్తయింది. ఇవి పారిశ్రామిక విస్తరణకు వీలు కల్పించడంతోపాటు భారీ వృద్ధికి తోడ్పడగలవు.

   ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా భారత విస్తృత సముద్ర రంగ కార్యక్రమం గురించి మాట్లాడుతూ- ఇది మౌలిక సదుపాయాల కల్పనకు మించిన ప్రగతికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే ‘‘దీర్ఘకాలిక ముందుచూపుతో కూడిన సుస్థిర ప్రగతికి మార్గాలేమిటో భారత్ నేడు ప్రపంచానికి చూపుతోంది’’ అన్నారు. ‘విఒసి’ రేవు హరిత ఉదజనికి కూడలిగానే కాకుండా సముద్ర తీర పవన విద్యుదుత్పాదనకు సంగమంగానూ గుర్తింపు పొందుతుందన్నారు. ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ- ‘‘ప్రపంచ అగ్రగామి సముద్ర శక్తిగా భారత్ దూసుకెళ్తోంది. ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చురుకైన నాయకత్వంలో సముద్ర రంగంలో నవ్యోత్తేజం ఉట్టిపడుతోంది. ఆ మేరకు సామర్థ్యం-ఉత్పాదకతల పెంపు, సముద్ర రంగ ఆస్తుల ఆధునికీకరణ, యాంత్రీకరణ, డిజిటలీకరణకు అద్భుతరీతిలో ప్రోత్సాహం లభించింది. దీనికితోడు వాణిజ్య రంగానికి సరళ, వేగవంతమైన సేవల ప్రదానానికి మేము చేసిన కృషి ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) వాణిజ్య వృద్ధికి తోడ్పడి, అంతిమంగా దేశ సంపద పెరిగేందుకు దారితీసిన నేపథ్యంలో మరో గొప్ప అవకాశం అందివచ్చింది. ఈ కొత్త టెర్మినల్ వల్ల కంటైనర్ల మార్పిడితో అవసరం ఉండదు కాబట్టి, జాప్యం తగ్గడంతోపాటు కార్యకలాపాలు చౌకగా మారి, ప్రతి కంటైనర్ మీద 200 అమెరికా డాలర్లదాకా ఆదా అవుతుంది. అంతేకాకుండా మన కార్యకలాపాల వ్యయం కూడా ఏటా గరిష్ఠంగా 4 మిలియన్ డాలర్ల వరకూ తగ్గేందుకు తోడ్పుతుంది. ఈ టెర్మినల్ నిర్మాణం గడువుకన్నా ముందే పూర్తికావడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘ఎన్‌డిఎ’ ప్రభుత్వ తొలి 100 రోజుల పాలనలో కీలక విజయం. మన రేవులకు వెన్నుదన్నుగా ఉన్న శ్రామికశక్తి ఎంతో శ్రమిస్తున్నారు. వారి అంకితభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇక ఉపాధి కల్పనలో ఈ ఓడరేవు ఎంతో ముందంజ వేయడం హర్షణీయం. ముఖ్యంగా నారీ శక్తిని గుర్తింపునిస్తూ శ్రామిక శక్తిలో వారికి  40 శాతం భాగస్వామ్యాన్నిచ్చింది. ఇది సమ్మిళిత వృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది’’ అన్నారు.

   వి.ఒసి. రేవులో రెడ్ గేట్, ఆయిల్ జెట్టీ కంట్రోల్ రూమ్‌ల వద్ద 22 కె.వి. సర్క్యూట్ బ్రేకర్ ప్యానెళ్ల ఉన్నతీకరణ, 24 హై-మాస్ట్ లైట్ల ప్రారంభం, ఓడరేవు వద్ద భద్రత పెంపు దిశగా డ్రోన్ నిఘా వ్యవస్థ సహా అనేక ఇతర ప్రాజెక్టులను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇవే కాకుండా ‘గ్రీన్ హైడ్రోజన్ డెమాన్‌స్ట్రేషన్ ప్రాజెక్ట్, 400 కిలోవాట్ల పైకప్పు సౌరశక్తి ప్లాంట్, బొగ్గు జెట్టీ-I నుంచి బొగ్గు నిల్వ ప్రదేశం దాకా లింక్ కన్వేయర్ వ్యవస్థ నిర్మాణం తదితరాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రేవు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కార్యక్రమాల కింద వ్యసన విముక్తి కేంద్రం, ముత్యాపురం వంతెన వద్ద అవగాహన ఆర్ట్‌వర్క్ వంటి ప్రాజెక్టులు కూడా ప్రారంభించారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా ‘ఎసిఎంఇ’, గ్రీన్ ఇన్‌ఫ్రా-రెన్యూవబుల్ ఎనర్జీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంప్లస్ గంగాస్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌ సహా పలు ప్రధాన కంపెనీలతో భూమి లీజు ఒప్పందాలపై సంతకాల కార్యక్రమాన్ని మంత్రి పర్యవేక్షించారు. వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో సుస్థిర విద్యుదుత్పాదన కృషికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని శ్రీ సోనోవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరుకల్లా 50 మిలియన్ టన్నుల సరకు రవాణా నిర్వహణ లక్ష్యంతో ‘విఒసిపిఎ’ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ 50’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ లక్ష్యం దిశగా అత్యుత్తమ రీతిలో ముందడుగుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా కార్మికులకు, భాగస్వాములకు శ్రీ సోనోవాల్ పిలుపునిచ్చారు. ఇక ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలో శ్రీకారం చుట్టిన ‘అమ్మ పేరిట ఓ మొక్క’ ఉద్యమం కింద ‘విఒసి’ రేవు వనంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

   పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంపు దిశగా సరికొత్త హరిత ఉదజని డెమాన్‌స్ట్రేషన్ ప్రాజెక్ట్ సహా 400 కిలోవాట్ల పైకప్పు సౌరశక్తి ప్లాంట్ ద్వారా ‘విఒసిపిఎ’ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ‘‘ఈ కార్యక్రమాలన్నీ భారతదేశాన్ని హరిత ఉదజనికి ప్రపంచ కూడలిగా మార్చాలన్న మన  చురుకైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో కొత్త పెట్టుబడులు వస్తాయి... తద్వారా దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల దిశగా ఆర్థిక వృద్ధి మరింత ఊపందుకుంటుంది’’ అన్నారు.

   ఓడరేవు యాజమాన్యం చేపట్టిన ‘సిఎస్ఆర్’ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ- సామాజిక ప్రగతి, ప్రజల జీవన నాణ్యత మెరుగు లక్ష్యంగా వివిధ మార్గాల ద్వారా సమాజ రుణం తీర్చుకోవడంలో నిబద్ధత చాటుకున్నదని స్పష్టం చేశారు. స్థానికి సంక్షేమం దిశగా వ్యసన విముక్తి కేంద్రం, ముత్యాపురం బ్రిడ్జ్ ఆర్ట్‌ వర్క్ వంటి కార్యక్రమాలను ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘జాతి ప్రగతిలో సామాజిక శ్రేయస్సు అంతర్భాగం. తదనుగుణంగా ‘విఒసిపిఎ’ ఈ ప్రాంత ప్రజల జీవితాలపై సానుకూల  ప్రభావం చూపే చర్యలు చేపట్టడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది’’ అంటూ శ్రీ సర్బానంద సోనోవాల్ తన ప్రసంగం ముగించారు.

   ట్యుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ (టిఐసిటి), ‘విఒసిపిఎ’ పరిధిలో మూడోది. దీన్ని ‘జెఎం బక్షి గ్రూప్’ నిర్వహిస్తుంది. ఇది 14.20 మీటర్ల లోతు, 370 మీటర్ల పొడవైన బెర్త్, బ్యాకప్ ప్రాంతం సహా మొత్తం 10 హెక్టార్లలో విస్తీర్ణంలో సిద్ధమైంది. ఈ టెర్మినల్ 6 ‘టిఇయు’ల (ఇరవై అడుగుల సమానమైన యూనిట్లు) కంటైనర్ల నిర్వహణకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల రేవు సరకు నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

   చివరగా ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ మాట్లాడుతూ- ‘‘ఈ టెర్మిన‌ల్‌ను జాతికి అంకితం చేయడం భారత సముద్ర రంగ ప్రగతిలో ఓ కీలక ముందడుగు. అలాగే అత్యాధునిక, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పనపై మా దార్శనికతకు అనుగుణంగా ఇది రూపొందింది. దీంతోపాటు ఇవాళ ప్రారంభించిన హరిత ఇంధన కార్యక్రమాలు, సామాజికాభివృద్ధి ప్రాజెక్టులు సహా మన ఓడరేవుల సామర్థ్యం ఇనుమడిస్తుంది. ఉద్యోగాల సృష్టి, ప్రాంతీయ/జాతీయ ఆర్థిక పురోగమనం ద్వారా సమ్మిళిత వృద్ధికి దోహదం చేస్తుంది’’ అన్నారు.

   కాగా, ‘విఒసిపిఎ’ చైర్‌పర్సన్ సుశాంత కుమార్ పురోహిత్ (ఐఆర్ఎస్ఇఇ) కార్యక్రమ ప్రారంభంలో ఆహూతులకు స్వాగతం పలికారు. అనంతరం రేవు సామర్థ్యం పెంపు దిశగా  కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. భవిష్యత్తులో మరింత వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తూత్తుకుడి నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు కనిమొళి కరుణానిధి, మంత్రిత్వశాఖ కార్యదర్శి టి.కె.రామచంద్రన్ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2055865) Visitor Counter : 38