బొగ్గు మంత్రిత్వ శాఖ
పచ్చదనం పరిరక్షణ ప్రధాన కార్యక్రమాల నేపథ్యంలో
ఎన్ఎల్‌సీ ఇండియా కార్పొరేట్ ప్రణాళిక-2030, విజన్ 2047లో మార్పులు
Posted On:
13 SEP 2024 11:27AM by PIB Hyderabad
బొగ్గు-గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అందించిన మార్గదర్శకత్వంలో కర్బన ఉద్గారాలు తగ్గించుకునే దిశగా భారతదేశం పయనిస్తోంది. భారతదేశం సిఒపి-26 కట్టుబాటు ప్రకారం తన అభివృద్ధి లక్ష్యాల సాధన ప్రక్రియలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేయాలి. మన దేశం 2030 వ సంవత్సరానికల్లా 500 గిగావాట్ (జిడబ్ల్యు) మేరకు శిలాజేతర ఇంధన ఉత్పాదన సామర్థ్యానికి చేరుకోవాలని సంకల్పించుకున్నది. బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ఇటు ఇంధన భద్రతను, స్థిరత్వాన్నీ దృష్టిలో పెట్టుకుని 2030వ సంవత్సరానికల్లా తన మొత్తం విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుకొనేందుకు ప్రణాళికలు వేస్తోంది. సంస్థ మొత్తం సామర్థ్యంలో 50 శాతం సామర్థ్యాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 1.43 జిడబ్ల్యు నుంచి 10.11 జిడబ్ల్యు కు పెంచుకోవలసి ఉంటుంది.
ఈ ప్రణాళిక అమలుకు సంస్థ పునరుత్పాదక రంగంలో దాదాపు రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రణాళిక భారతదేశ ప్రతిపాదిత పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సమర్థించడంతో పాటు 2070వ సంవత్సరాని కల్లా ‘శుద్ధ శూన్య’ (‘నెట్ జీరో’) ఉద్గారాల బృహత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సైతం సంస్థ తన వంతుగా తోడ్పడుతుంది. ఈ సవరించిన లక్ష్యం- సిఒపి 26 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా వాతావరణ మార్పు దిశగా భారతదేశం చేసిన వాగ్దానంలో భాగంగా అమలుపరుస్తున్న ‘‘పంచామృత్’’ కార్యక్రమానికి అనుగుణంగా ఉన్నది.
పునరుత్పాదక ఇంధన ఉత్పాదనపై ఎన్ఎల్‌సీఐఎల్ ప్రత్యేకంగా దృష్టి సారించి తన పూర్తి యాజమాన్యంలో ఎన్ఐజిఇఎల్ (ఎన్ఎల్‌సీ ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్) పేరుతో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ అనుబంధ సంస్థ కంపెనీ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి 2 జీడబ్ల్యు సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పనులు వేగిరం సాగుతున్నాయి. ఎన్ఐజీఇఎల్ పోటీ ప్రధానమైన వేలంలో పాల్గొంటూ హరిత ఇంధన రంగంలో అందివచ్చే సరికొత్త అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రక్రియను విస్తరించాలనుకుంటోంది. ఈ విస్తరణ అమలైన అనంతరం సంప్రదాయిక ఇంధన వనరులపై భారతదేశం ఆధారపడడం తగ్గుతుంది. విద్యుదుత్పత్తి విషయంలో పాత విధానాల నుంచి కొత్త విధానాలకు దేశం మారినట్లుగా అవుతుంది. బొగ్గు దిగుమతులు కూడా తగ్గుతాయి. దీనికి అదనంగా, దేశవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా ఉండేటట్లు చూడడంలో సైతం ఇది సహాయకారి కాగలదు.
ఎన్ఎల్‌సీఐఎల్ తన విద్యదుత్పత్తి మొత్తంలో పునరుత్పాదక ఇంధన వాటాను 2030వ సంవత్సరాని కల్లా 50 శాతంగా ప్రతిపాదించగా, ఆ వాటా ను 2047వ సంవత్సరాని కల్లా 77 శాతానికి చేర్చాలని భావిస్తోంది. అదే జరిగితే, 2070 కల్లా నెట్ జీరో స్థాయికి చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. 2030వ సంవత్సరం అనంతర కాలంలో ఇంధన రంగ ముఖచిత్రం అనేక మార్పులకు లోనయ్యే ఆస్కారం ఉండడంతో, ఎన్ఎల్‌సీఐఎల్ కొత్తగా అదనపు థర్మల్ విద్యుదుత్పత్తి గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికే పని చేస్తున్న ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉద్గారాలను తగ్గించడం కోసం నవకల్పనలు కీలక పాత్రను పోషించి, ఈ రంగంలో మార్గదర్శక పాత్రను వహించనున్నాయి.
***
(Release ID: 2055140)
Visitor Counter : 44