జౌళి మంత్రిత్వ శాఖ
అగ్ని ప్రమాదాల నివారణ కోసం గృహేతర ఫర్నిచర్ తయారీలో తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు
Posted On:
13 SEP 2024 3:20PM by PIB Hyderabad
ప్రజల సంరక్షణ కోసం, ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నుంచి వారిని రక్షించే దిశగా ప్రభుత్వం కొన్ని కఠినమైన నాణ్యతా ప్రమాణాలను ప్రవేశపెడుతున్నది. దీని ప్రకారం, ఇక గృహేతర ఫర్నీచర్ తయారీలో అగ్ని నిరోధక వస్త్రాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రజోపయోగ ప్రదేశాలలో ఉపయోగించే ఫర్నీచర్ తరహా ఉపకరణాలన్నీ కూడా అక్టోబర్ 2023 నుండి అమల్లోకి వచ్చిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నాణ్యతా నియంత్రణ ఆదేశాలకు (క్యూసీఓ) అనుగుణంగా, ముఖ్యంగా ఐఎస్ 15768: 2008 కు అనుగుణంగా ఉండాలి.
కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, హోటళ్లు, భూగర్భ షాపింగ్ సముదాయాలు, మ్యూజియంలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు వంటి బహిరంగ ప్రదేశాలలో ఉపయోగించే ఫాబ్రిక్, ఫోమ్ వంటి వస్త్రాలకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి. ప్రజల ఉపయోగం కోసం ఉద్దేశించిన వస్త్రాలు కలిగిన పూర్తి లేదా పాక్షిక ఉపకరణాల దిగుమతులకు కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుంది. అయితే పరిశ్రమల అభ్యర్థన మేరకు 2025 మార్చి 31 వరకు సడలింపును ఇచ్చారు.
ఫర్నిచర్ కోసం నాణ్యతా నియంత్రణ ఆదేశాలతో ఐఎస్ 15768:2008ను అనుసంధానం చేయాలని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)ను జౌళి మంత్రిత్వ శాఖ కోరింది. దీనివల్ల ఫర్నిచర్ కు సంబంధించిన ప్రమాణాలన్నీ ఒకే దగ్గర ఉండటంతోపాటు, ఈ చర్య వల్ల అగ్ని ప్రమాదాల బారి నుంచి ప్రజల్ని సంరక్షించడం సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. గృహేతర ఫర్నీచర్ తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడం వల్ల ప్రజల ప్రాణాలనీ, ఆస్తులనీ రక్షించినట్లు అవుతుంది. ఇది ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తోంది.
కీలక ఉత్పత్తుల నాణ్యత, భద్రతలను నిర్ధారించడానికి ప్రభుత్వం నాణ్యతా నియంత్రణ ఆదేశాలు (క్యూసిఓ) రూపొందించింది. అనేక ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ స్వచ్ఛందమే అయినప్పటికీ, కొన్ని కీలక ఉత్పత్తులకు అగ్ని నిరోధకత కలిగిన వస్త్రాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సురక్షితమైన ప్రజోపయోగ బహిరంగ ప్రాంతాలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో ఉపయోగించిన ఫర్నీచరు అత్యంత నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటుందన్న భరోసాని అందించడం సుసాధ్యం అవుతుంది.
***
(Release ID: 2055138)
Visitor Counter : 34