సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ టీవీ- దూరదర్శన్ కు 65 ఏళ్లు 2024

Posted On: 13 SEP 2024 6:10PM by PIB Hyderabad

లో "దిల్ సే దూరదర్శన్, డీడీ@65" పేరుతో ప్రత్యేక కార్యక్రమం, అదే రోజు రాత్రి 8.00 గంటలకు పున:ప్రసారం

పి ఐ బి, 13.09.2024,  న్యూఢిల్లీ

భారత ప్రజాసేవ ప్రసార సంస్థ దూరదర్శన్ ఈ ఏడాది  65వ వార్షికోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటోంది. 1959 సెప్టెంబర్ 15 న ప్రారంభమైనప్పటి నుండి, దూరదర్శన్  ఏకత, సంస్కృతి, చైతన్యం లక్ష్యంగా, జాతి గొంతుకగా భారతీయ మీడియాకు కేంద్ర బిందువుగా ఉంది. 

ఢిల్లీలో ప్రయోగాత్మక ప్రసారాలతో ప్రారంభమైన దూరదర్శన్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాడ్ కాస్టింగ్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. దశాబ్దాలుగా, ఇది ప్రజా సేవా ప్రసారాల పట్ల తన నిబద్ధతను స్థిరంగా కొనసాగిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ,  ప్రేక్షకులకు చేరువ కావడంలోనూ గొప్ప మార్పులకు వేదికగా నిలిచింది. నలుపు-తెలుపు టెలివిజన్ రోజుల నుండి, డిజిటల్, ఉపగ్రహ ప్రసారాల ప్రస్తుత యుగం వరకు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకూ, ప్రాధాన్యతలకూ అనుగుణంగా దూరదర్శన్ నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటూ వచ్చింది. నలుపు-తెలుపు ప్రసార కాలం నుంచి తన 6 జాతీయ చానళ్లు, 28 ప్రాంతీయ చానళ్లు,  ఒక అంతర్జాతీయ ఛానల్ ద్వారా, ప్రాంతీయ భాషలకు పెద్దపీట వేస్తూ భాషల గొప్పదనాన్ని ప్రతిబింబించే ప్రసారాలు అందిస్తూ 35 ఛానెళ్ల వరకు విస్తరించిన దూరదర్శన్- అగ్రగామి ప్రజా సేవా ప్రసార సంస్థగా తన ప్రయాణాన్ని నిబద్ధతతో కొనసాగిస్తోంది.

65 సంవత్సరాల సేవ

గత 65 సంవత్సరాలలో, దూరదర్శన్ భారత సామాజిక-సాంస్కృతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. భారతీయ ఇతిహాసాలయిన రామాయణం,  మహాభారతం నుండి ప్రేక్షకులు ఎంతో ఇష్టపడిన  చిత్రహార్, సురభి,  హమ్ లోగ్ వరకు తరతరాలుగా అలరించిన కొన్ని అత్యంత ప్రసిద్ధ టెలివిజన్ షోలకు  దూరదర్శన్ అందించింది.  

సాంస్కృతిక మార్పులకు దూరదర్శన్ ఒక వేదికగా మారింది. దేశంలోని గ్రామీణ , పట్టణ ప్రాంతాలను ఒకదానికొకటి దగ్గర చేసింది. వివిధ విద్యా, సమాచార కార్యక్రమాల ద్వారా ప్రధానమైన సామాజిక సమస్యలపై అవగాహన కల్పించింది.

వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని "దిల్ సే దూరదర్శన్,డిడి@65" ప్రత్యేక కార్యక్రమం

65 వసంతాల విజయయాత్రను పురస్కరించుకుని, డీడీ నేషనల్ "దిల్ సే దూరదర్శన్,డిడి@65" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది.  ప్రఖ్యాత మాస్టర్ జైవీర్ బన్సాల్,  వెంట్రిలోక్విస్ట్ అనిల్ సింగ్ నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మెజీషియన్, మెంటలిస్ట్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత శ్రీ ప్రమోద్ కుమార్ వంటి ప్రముఖ కళాకారుల కార్యక్రమాలు ఉంటాయి.  ప్రమోద్ కుమార్ అనేక రాష్ట్ర,  జాతీయ అవార్డులను అందుకున్నారు. అలాగే ఇసుక చిత్రాల్లో దేశంలోనే పేరు గాంచిన కళాకారిణి (శాండ్ ఆర్టిస్ట్) శ్రీమతి మనీషా స్వర్ణ్కర్  కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఐఐటీ బాంబే ఐడీసీ పూర్వ విద్యార్థిని అయిన మనీషా స్వర్ణ్కర్ 13 సంవత్సరాలుగా ఇసుక చిత్రకళను ప్రదర్శిస్తూ భారతదేశ  మొదటి మహిళా ‘శాండ్‘ కళాకారిణి గా ఖ్యాతి గాంచారు. 

దిల్ సే దూరదర్శన్, డీడీ@65  షోలో స్టార్ పెర్ఫార్మర్ అయిన శ్రీ కైలాష్ ఖేర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. తన అద్భుతమైన ప్రదర్శనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన బాలీవుడ్ సంచలనం. ఆయన సంగీత శైలి భారతీయ జానపద సంగీతం,  సూఫీ సంగీతం ద్వారా ఎక్కువగా ప్రభావితమైంది. దూరదర్శన్ షో రీల్ కోసం లెజెండరీ నటుడు శ్రీ మనోజ్ బాజ్ పాయ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

దూరదర్శన్ 65వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు డీడీ నేషనల్ చానెల్ సిద్ధమైంది. దూరదర్శన్ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 న ఉదయం 10.00 గంటలకు ప్రసారం అవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి రాత్రి 8.00 గంటలకు పున:ప్రసారం చేస్తారు.

 

దేశం పట్ల నిబద్ధతకు పునరంకితం

ఈ అరుదైన సందర్భంలో దూరదర్శన్ భారతదేశంలోని ప్రతి పౌరుడికీ విశ్వసనీయమైన, అందుబాటులో ఉండే నాణ్యమైన కార్యక్రమాలను అందించాలనే తన లక్ష్యానికి పునరంకితం అవుతోంది. టెలివిజన్ నుండి మొబైల్ ఫోన్ల వరకు అన్ని వేదికల్లో ప్రేక్షకులను చేరుకోవడానికి దూరదర్శన్ ఎప్పటికప్పుడు సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకుంటూనే ఉంది. ఇది వార్తలు, వినోదం, సమాచారం అందించే విశ్వసనీయ వనరుగా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ కొనసాగుతోంది. 

వెలుగు బాటలో..

66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ దూరదర్శన్ తన సృజనాత్మకత, సమ్మిళితం, ప్రేరణ ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. తన సుసంపన్నమైన చరిత్ర, ప్రజాసేవ పట్ల అంకితభావంతో దూరదర్శన్ భారతదేశ వైవిధ్యం, వారసత్వం, పురోగతికి వెలుగు వైపుగా దారి చూపుతూనే ఉంటుంది.

 

***


(Release ID: 2055124) Visitor Counter : 50