వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛతా హీ సేవ 2024' ను 'స్వభావ స్వచ్ఛత - సంస్కార స్వచ్ఛత' అనే నినాదంతో నిర్వహించనున్న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
ఇందులో భాగంగా 400కు పైగా స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిపాదన
Posted On:
14 SEP 2024 11:46AM by PIB Hyderabad
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 'స్వభావ స్వచ్ఛత - సంస్కార స్వచ్ఛత' ఇతివృత్తంతో 'స్వచ్ఛతా హీ సేవ 2024 (ఎస్‌హెచ్ఎస్)'ను, ఆ తర్వాత అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దినోత్సవాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నిర్వహించనుంది.
ప్రజా భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ పారిశుద్ధ్యాన్ని ప్రతి ఒక్కరికి సంబంధించినదిగా మార్చేందుకు 'పూర్తి సమాజ బాధ్యత' విధానంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈ ఏడాది నిర్వహించనున్నారు. శ్రమదానం, అవగాహన కార్యక్రమాలతో పాటు సఫాయి మిత్ర సురక్షా శిబిరాలను నిర్వహించడం, గుర్తించిన లక్షిత స్వచ్ఛతా యూనిట్లను (సీటీయూ- క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్లు) పూర్తిగా శుభ్రంగా మార్చటం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. సాధారణ పారిశుద్ధ్య పనుల్లో భాగంగా శుభ్రం చేయటం కష్టమైన.. పర్యావరణ, ఆరోగ్య, పరిశుభ్రతకు సంబంధించి ప్రమాదాలను కలిగించే, తరచుగా నిర్లక్ష్యానికి గురయ్యే చెత్త ప్రదేశాలైన ఈ సీటీయూలపై వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.
ఎస్‌హెచ్‌ఎస్ 2024లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం చురుగ్గా పాల్గొననుంది. దేశవ్యాప్తంగా ఈ విభాగం కింద ఉన్న, అనుసంధానంగా పనిచేస్తున్న, స్వతంత్ర కార్యాలయాలు, పీఎస్యూలు, క్షేత్ర స్థాయి కార్యాలయాలలో 400కు పైగా స్వచ్ఛతకు సంబంధిత కార్యకలాపాలను చేపట్టాలని ఈ శాఖ ప్రతిపాదించింది. స్వచ్ఛతలో ప్రజలు పాల్గొనటం (స్వచ్ఛతా మే జన్ భాగీదారీ), సఫాయి మిత్ర సురక్షా శిబిరాలు, గుర్తించిన సీటీయూల్లో కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయి.
ప్రధాన కార్యక్రమాల్లో స్వచ్ఛతా ప్రతిజ్ఞలు, ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు, తల్లి పేరు మీద ఒక చెట్టు నాటటం, మానవ హారాలు (హ్యాుమన్ ఛైన్), సామూహిక పరిశుభ్రత కార్యక్రమాలు, స్వచ్ఛతా సమావేశాలు(చౌపాల్), సఫాయి మిత్ర శిబిరాలు ఉన్నాయి.
***
(Release ID: 2055116)
Visitor Counter : 115