ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మానవుల్లో మొదటి విడత క్లినికల్ ప్రయోగాల కోసం పరిశ్రమ, పరిశోధనా సంస్థలతో అంగీకార ఒప్పందం కుదుర్చుకున్న భారత వైద్య పరిశోధన మండలి
పౌరులందరికీ సరసమైన ధరల్లో, అందుబాటులో అత్యాధునిక చికిత్సలను అందించే దిశగా కీలక విజయం: శ్రీ జేపీ నడ్డా
క్లినికల్ ప్రయోగాల విషయంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు,
స్వదేశీ ఔషధాల తయారీకి ఈ భాగస్వామ్యం కీలకం
Posted On:
14 SEP 2024 12:05PM by PIB Hyderabad
భారత క్లినికల్ పరిశోధనలకు సంబంధించి విస్తారిత వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మానవుల్లో మొదటి విడత క్లినికల్ ప్రయోగాల కోసం వివిధ సంస్థలతో అంగీకార ఒప్పందం(ఎంఓఏ) చేసుకుంది. నాలుగు ఆశాజనక అణువుల (ప్రామిసింగ్ మాలిక్యూల్స్) కోసం మానవుల్లో మొదటి సారి చేసే క్లినికల్ ప్రయోగాల కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. మల్టిపుల్ మైలోమా వ్యాధికి సంబంధించిన ఒక పరమాణువు పరిశోధన కోసం ఆరిజీన్ ఆంకాలజీ కంపెనీతోనూ, జైకా టీకా అభివృద్ధి కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థతోనూ, సీజనల్ ఇన్‌ఫ్లూయంజా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల కోసం మైన్వాక్స్ సంస్థతోనూ, దీర్ఘకాలిక లింఫోసైట్ లుకేమియాకు సంబంధించిన సీఏఆర్-టీ సెల్ చికిత్స అధ్యయనం కోసం ఇమ్యునోయాక్ట్ కంపెనీతో- పరస్పర సహకరించుకునేందుకు ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. కొత్త రకం ఔషధ చికిత్సల అభివృద్ధిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఈ ఒప్పందం ఒక కీలకమైన అడుగుగా చెప్పుకోవచ్చు.
ప్రముఖ పరిశ్రమ, పరిశోధనా సంస్థలతో ఐసీఎంఆర్ చేసుకున్న ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా ప్రశంసించారు. పౌరులందరికీ సరసమైన ధరల్లో, అత్యాధునిక చికిత్సలను అన్వేషించడంలో ఇది ఒక కీలక విజయమని ఆయన అన్నారు. వైద్యారోగ్య రంగ ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకత్వ స్థాయికి భారత్ ఎదగడానికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సరికొత్త మార్పులను తేగలిగిన ఈ ప్రాజెక్టు గొప్పతనం గురించి ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ ప్రస్తావించారు. "భారతదేశంలో క్లినికల్ పరిశోధనను ముందుకు తీసుకెళ్లే విషయంలో మా నిబద్ధతను ఈ వ్యూహాత్మక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. దేశీయంగా అణువుల అభివృద్ధి, అత్యాధునిక చికిత్సలను ప్రోత్సహించడంలో మొదటి విడత క్లినికల్ ప్రయోగాల మౌలిక సదుపాయలను ఏర్పాటుచేయటం చాలా కీలకం. సరసమైన ధరల్లో ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల అభివృద్ధిలో భారత్ ముందంజలో ఉందని నిర్ధారించుకుంటూ ఈ వ్యవస్థను మరింత విస్తరించాలనేది మా లక్ష్యం” అని అన్నారు.
మొదటి విడత క్లినికల్ ప్రయోగాల కోసం వ్యవస్థాగత అనుబంధాలను ఏర్పాటు చేసుకోవటం, ఇంటెంట్ నెట్‌వర్క్, మెడ్‌టెక్ మిత్ర వంటి ఐసీఎంఆర్ కార్యక్రమాల విస్తృత ప్రభావాన్ని డాక్టర్ బహ్ల్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి వికసిత్ భారత్ అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయన్నారు. భారత్ బయోటెక్ సహకారంతో కొవాగ్జిన్ అభివృద్ధిలో ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషించడాన్ని చూస్తే, అందరికీ సరసమైన ధరల్లో, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ పట్ల సంస్థ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
మొదటి విడత క్లినికల్ ప్రయోగాల కోసం ఐసీఎంఆర్ వ్యవస్థాగత అనుబంధాల కోసం భారత్‌లో వ్యుహాత్మకమైన నాలుగు సంస్థలు ఉన్నాయి. అవి: ముంబయిలోని కేఈఎంహెచ్, జీఎస్ఎంసీ, నవీ ముంబయిలోని ఏసీటీఆర్ఈసీ, కట్టంకుళత్తూర్‌లోని ఎస్ఆర్‌ఎం ఎంసీహెచ్, చంఢీగడ్‌లోని పీజీఐఎంఈఆర్. ఇవి ఢిల్లీలోని ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న కేంద్ర సహకార విభాగం సమన్వయంలో పని చేస్తాయి. ప్రారంభ దశ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యాన్ని భారత్‌కు అందించేందుకు, మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రతి ప్రయోగ కేంద్ర వద్ద కార్యకలాపాలు సజావుగా, సమర్థవంతంగా జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రత్యేక మానవ వనరులు ఉంటాయి.
కీలక పారిశ్రామిక సంస్థలతో ఐసీఎంఆర్‌కు ఉన్న సహకారాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది. ఇది దేశంలో క్లినికల్ ప్రయోగాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు, ప్రారంభ దశ ప్రయోగాల నుంచి మార్కెటింగ్ వరకు కొత్త మందులను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని పెంపొందించడానికి, తద్వారా అంతర్జాతీయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు.. అంతిమంగా అందరికీ సరసమైన, అధిక-నాణ్యతగల ఆరోగ్య సంరక్షణ మిషన్‌ను నడిపించడానికి సంస్థకు ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది.
***
(Release ID: 2055112)
Visitor Counter : 56