పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌరవిమానయానంపై ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం : ప్రధానమంత్రి ప్రకటన


పౌర విమానయానంపై ఢిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించిన ఆసియా పసిఫిక్ రెండోమంత్రిత్వ సదస్సు

ఇండియాలో 15 శాతం పైలట్లు మహిళలు, ఇది అంతర్జాతీయ సగటు కంటే 5 శాతం ఎక్కువ : ప్రధానమంత్రి

మొదటినుంచీ విమానయానం కొందరికే ప్రత్యేకం, ఇండియా దానిని అందరికీ చేరువ చేసింది: ప్రధానమంత్రి

అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రాలను అనుసంధానం చేసే మార్గంపై చర్చించిన ప్రధానమంత్రి

పౌరవిమానయానం ద్వారా ప్రజలను కలపడం, సంస్కృతి, సుసంపన్నతలను పెంపొందించడం ప్రధాన లక్ష్యం : ప్రధానమంత్రి

Posted On: 12 SEP 2024 8:49PM by PIB Hyderabad

పౌర విమానయానంపై ఆసియా, పసిఫిక్ మంత్రిత్వశాఖ రెండో సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సమావేశంలో పౌరవిమానయానంపై ఢిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించినట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.

ఈ సదస్సులో 29 దేశాలకు చెందిన మంత్రులు, విధాన నిర్ణేతలు,  ఐసిఎఒ సహా 8 అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సదస్సు సందర్భంగా ఐసిఎఒ తన 80 ఏళ్ల ఉత్సవాలను కూడా జరుపుకొంది . భారత పౌరవిమానయాన శాఖ, అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసిఎఒ)తో కలిసి ఈ సదస్సు కు ఆతిథ్యం ఇచ్చింది. సెప్టెంబర్ 11,12 తేదీలలో న్యూఢిల్లీలోని భారత మండపంలో దీనిని నిర్వహించారు. పౌర విమానయాన రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడంతోపాటు, ఆసియా ,పసిఫిక్ ప్రాంతంలో మరిన్ని అవకాశాలను కల్పించేందుకు , వివిధ దేశాల మంత్రులు, పౌర విమానయాన అధికారులు, ఈ రంగంలోని కీలక భాగస్వాములదరినీ ఈ ఉన్నత స్థాయి సదస్సు ఒక చోటుకు చేర్చింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ,పౌరవిమానయాన రంగం భవిష్యత్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ  సదస్సులో ప్రయోజనకరమైన చర్చలు జరిగాయి. ఆ దిశగా ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఢిల్లీ డిక్లరేషన్ ను లాంఛనంగా ఆమోదించడం ఈ సదస్సులో కీలకమైన అంశం. ఇది విమానయన రంగంలో ప్రాంతీయ సహకారాన్ని మరింత పెంపొందించడం, సవాళ్లను ఎదుర్కోవడం, ఈ రంగంలో సుస్థిరాభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధివిధానాలకు సంబంధించినది.

పౌర విమానయాన రంగంలో ఇండియా, సాంకేతికంగా, మౌలికసదుపాయాల పరంగా సాధించిన పురోగతిని, ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆసియా పసిఫిక్ ప్రాంత  పౌరవిమానయాన రంగంలోని ఉన్నతస్థాయి నాయకులకు వివరించారు.ఈ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ‘‘ఇండియాలో 15 శాతం పైలట్లు మహిళలు, ఇది అంతర్జాతీయ సగటు కంటే 5 శాతం ఎక్కువే . దీనిని మరింత పెంచాల్సిందిగా సూచించాం.” అని ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలలో ఇండియాలో పౌర విమానయాన రంగంలో వచ్చిన గణనీయమైన మార్పు గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. మొదటి నుంచీ పౌరవిమానయాన రంగం కొందరికే ప్రత్యేకంగా ఉంటూ వచ్చిందని, అయితే ఇండియా దానిని అందరికీ చేరువ చేసిందని అన్నారు. పౌరవిమానయాన రంగం కీలక పాత్ర గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఈ రంగం ద్వారా ప్రజలమధ్య అనుసంధానత, సంస్కృతి, సుసంపన్నతలను పెంచడంపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. బుద్ధుడికి సంబంధించి ఆసియాలోని అన్ని పవిత్ర ప్రదేశాలను అనుసంధానం చేయగలిగితే అది ఒక అంతర్జాతీయ బౌద్ధ సర్క్యూట్ అవుతుందని, ఇది పౌరవిమానయాన రంగానికి, పర్యాటకులకు,ఆయా దేశాలకు వాటి ఆర్ధిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరమని ప్రధానమంత్రి అన్నారు.

పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు , ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ,  ‘‘సమ్మిళితత్వం,సుస్థిరతల పట్ల ప్రధానమంత్రి చిత్తశుద్ధికి, వారు చేపట్టిన‘ ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లిపేరుమీద ఒక మొక్కనాటండి) కార్యక్రమం, ఐసిఒ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా 80 వేల మొక్కలు  నాటించడం వంటివి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వారి దార్శనిక నాయకత్వంలో ఇండియా 2047 నాటికి 350 నుంచి 400 విమానాశ్రయాలు గల దేశం స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ రకంగా అంతర్జాతీయ విమానయాన రంగంలో ఇండియా కీలకం కానుంది. ఇవాళ ఇండియా సమష్టి కృషికి మద్దతు నివ్వడమే కాదు, నాయకత్వమూ వహిస్తోంది.  కోవిడ్ –19 సమయంలో ఇది అద్భుతంగా రుజువైంది. ఆసియా , పసిఫిక్ ప్రాంతం అంతటా కోవిడ్ వాక్సిన్ ను సరఫరా చేయడం ద్వారా   అంతా, ‘ఒకే ప్రపంచం, ఒకే గ్రహం, ఒకే భవిష్యత్తు, ఒకే కుటుంబం అన్న తన చిత్తశుద్ధిని ఇండియా పునరుద్ఘాటించినట్టు అయింది”అని ఆయన అన్నారు.

ఐసిఎఒ మండలి అధ్యక్షుడు శ్రీ సాల్వెటార్ మాట్లాడుతూ, ‘‘ అత్యున్నత భద్రత, రక్షణను కొనసాగించడం మన ప్రాథమిక లక్ష్యం.పౌరవిమానయాన రంగానికి సంబంధించిన ఈ మౌలిక అంశాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోవడంపై మనం మరింత దృష్టి పెట్టాలి. సానుకూల గణాంకాలను గమనించినపుడు, మనం ఏమాత్రం ఏమరుపాటుతో ఉండరాదని గుర్తించాలి.” అని ఆయన అన్నారు.

పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి శ్రీ మురళీధర్ మొహల్ మాట్లాడుతూ,‘‘పౌరవిమానయాన భద్రత, విమాన యాన మార్గం, భధ్రత, హరిత విమానయానం వంటి అంశాలపై జరిగిన కీలక చర్చలలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది” అని అన్నారు.

పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ ఉంలున్ మాంగ్ ఉల్నామ్, మాట్లాడుతూ, ‘‘పౌర విమానయాన రంగంలోని ఉన్నత స్థాయి నాయకుల నుంచి అంతర్జాతీయ సంస్థలు, అంకుర పరిశ్రమల వరకు ఈ రంగానికి చెందిన వారందరినీ భాగస్వాములను చేయడం ఉజ్వల భవిష్యత్ కు  మార్గం వేస్తుంద’’ని అన్నారు.

రెండో రోజు సదస్సులో పలు కీలక అంశాలు ఉన్నాయి.  చిన్న దేశాలు విమానయాన రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్ల విషయంలో వాటికి మద్దతునిచ్చేందుకు పసిఫిక్ ప్రాంత చిన్నదీవుల వర్ధమాన దేశాల ప్రధాన కార్యాలయం ఏర్పాటుపై ఐసిఎఒ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. పౌర విమానయానంపై ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి ప్రకటన ముసాయిదా (ఢిల్లీ డిక్లరేషన్) ను ఈ సదస్సు ముందుంచారు. అనంతరం దీనిపై చర్చించి, మంత్రుల స్థాయి సంప్రదింపుల అనంతరం దీనిని లాంఛనంగా ఆమోదించారు. ఈ సదస్సు సందర్భంగానే ఐసిఎఒ 80 వ వార్షికోత్సవాన్ని, చికాగో సదస్సు ఉత్సవాలను నిర్వహించారు. అలాగే అంతర్జాతీయ విమానయాన రంగ ప్రమాణాల రూపకల్పనలో గత ఎనిమిది దశాబ్దాలుగా  ఈ సంస్థ సాగిస్తున్న కృషినీ ప్రముఖంగా ప్రస్తావించారు.

 

***



(Release ID: 2055111) Visitor Counter : 6