రక్షణ మంత్రిత్వ శాఖ
కాలిఫోర్నియాలో ముగిసిన మూడో ఇండస్-ఎక్స్ సదస్సు
రక్షణ రంగ ఆవిష్కరణల కోసం సహకారాన్ని పెంచుకునేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఐడెక్స్, డిఫెన్స్ ఇన్నొవేషన్ యూనిట్
Posted On:
13 SEP 2024 9:42AM by PIB Hyderabad
అమెరికాలో జరిగిన మూడో ఇండస్-ఎక్స్ సదస్సు ముగిసింది. భారత్‌తో పాటు అమెరికాలో ఉమ్మడి రక్షణ రంగ ఆవిష్కరణల విస్తారిత వ్యవస్థ పురోగతిని ఈ సదస్సు చాటిచెప్పింది. 9-10 తేదీల్లో యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్(యూఎస్ఐఎస్‌పీఎఫ్), స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి నిర్వహించిన కీలకమైన సదస్సు ఇది.
ఈ సదస్సు సందర్భంగా ఐడెక్స్‌తో పాటు యూఎస్ రక్షణ విభాగం ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్నొవేషన్ యూనిట్(డీఐయూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఆవిష్కరణల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంతో పాటు వాటాదారుల మధ్య పరిశ్రమ, పరిశోధన, పెట్టుబడి భాగస్వామ్యాల్లో సహకారాన్ని సులభతరం చేయడం ఈ ఒప్పంద ఉద్దేశ్యం. ఇండస్-ఎక్స్ కింద కొత్త సవాల్‌ను ప్రకటించడం, ఇండస్-ఎక్స్ ప్రభావ నివేదిక విడుదల, ఐడెక్స్, డీఐయూ వెబ్‌సైట్‌లలో అధికారిక ఇండస్-ఎక్స్ వెబ్‌పేజీని ఆవిష్కరించడం వంటివి ఈ సదస్సులో కీలక అంశాలు.
అంకుర సంస్థలు/ఎంఎస్ఎంఈలు అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించడానికి ఈ సదస్సు వేదికగా నిలిచింది. రెండు కీలక సలహా మండళ్లైన సీనియర్ అడ్వైజరీ గ్రూప్, సీనియర్ లీడర్స్ ఫోరమ్ మధ్య కీలక చర్చలకు ఇండస్-ఎక్స్ అవకాశం కల్పించింది. భవిష్యత్తు సాంకేతిక మార్పులు, అంకుర సంస్థల సామర్థ్యాలను పెంపొందించడం, రక్షణ రంగ ఆవిష్కరణలకు నిధులు సమకూర్చే అవకాశాలు, రక్షణ రంగ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇరు దేశాలకు చెందిన రక్షణరంగ పరిశ్రమలు, పెట్టుబడి సంస్థలు, అంకుర సంస్థలు, విద్యా సంస్థలకు చెందిన నిపుణులు, యాక్సెలరేటర్లు, విధానకర్తలు ఇందులో పాల్గొన్నారు.
ఆవిష్కరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రక్షణ రంగ సాంకేతికతను పెంపొందించడానికి ఇరు దేశాల అంకితభావాన్ని మూడో ఇండస్-ఎక్స్ సదస్సు పునరుద్ఘాటించిందని భారతదేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన సంయుక్త కార్యదర్శి(రక్షణరంగ పరిశ్రమల ప్రోత్సాహం) శ్రీ అమిత్ సతిజా పేర్కొన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సెలెన్స్(ఐడెక్స్), యూఎస్ రక్షణ రంగ విభాగం(డీఓడీ) కలిసి ఇండస్-ఎక్స్ కార్యక్రమాన్ని చేపట్టాయి. 2023 జూన్‌లో ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇండస్-ఎక్స్ ప్రారంభమైంది. అప్పటి నుంచి స్వల్పకాలంలోనే ఈ కార్యక్రమం అనేక కీలకమైన మైలురాళ్లను అధిగమించింది.
***
(Release ID: 2054532)
Visitor Counter : 101