పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పారా-అథ్లెట్లకు నెలవారీ ఉపకార వేతనాలు, ఆరోగ్య బీమా అందించనున్న ఇండియన్ ఆయిల్: పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్
పారిస్ పారాలంపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత పారా అథ్లెట్లకు సత్కారం
Posted On:
12 SEP 2024 7:58PM by PIB Hyderabad
పారిస్ పారాలంపిక్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించారు. కేంద్ర యుజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, సహజ వాయువు శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్, ఇండియన్ ఆయిల్ చైర్మన్, డైరెక్టర్ (మార్కెటింగ్) శ్రీ వి. సతీష్ కుమార్ సహా పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు, పీసీఐ నాయకత్వం సమక్షంలో ఈ సత్కార కార్యక్రమం జరిగింది.
ఇటీవల ముగిసిన పారిస్ పారాలింపిక్స్‌లో, భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు అలాగే 13 కాంస్యాలతో రికార్డు స్థాయిలో 29 పతకాలను సాధించింది. ఇది అత్యుత్తమ పారాలింపిక్ ప్రదర్శనగా నిలిచింది. అక్టోబర్ 2023 నుంచి పారా అథ్లెట్ల బృందానికి మద్దతునందిస్తూ వారికి సాధికారత కల్పించడంలో ఇండియన్ ఆయిల్, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది.
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి. రక్షా నిఖిల్ ఖడ్సే అథ్లెట్లను కొనియాడుతూ, “భారత పారా అథ్లెట్లు మరోసారి ప్రపంచ వేదికపై తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి, తరువాతి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ అథ్లెట్లకు ఇండియన్ ఆయిల్ అందించిన సహకారం ప్రశంసనీయం. దేశ క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంలో కార్పొరేట్ భాగస్వామ్యాల శక్తిని ఇది ప్రతిబింబిస్తుంది.” అన్నారు.
సహజ వాయువు శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ మాట్లాడుతూ, అథ్లెట్ల అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు. ప్రస్తుతం చమురు కంపెనీలు అందిస్తున్న మద్దతును మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పారా అథ్లెట్ల కోసం నెలవారీ ఉపకార వేతనాలు, వైద్య బీమాతో పాటు వారికి అవసరమైన క్రీడా సామాగ్రిని అందించడం ద్వారా ఇండియన్ ఆయిల్ మరింత సహకారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇండియన్ ఆయిల్ చైర్మన్, డైరెక్టర్ (మార్కెటింగ్) శ్రీ వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, అథ్లెట్ల విజయాలు దేశానికి గర్వకారణం అన్నారు. అలాగే “ఈ చారిత్రాత్మక ప్రదర్శన మన పారా అథ్లెట్ల దృఢ చిత్తానికి, సంకల్ప బలానికి నిదర్శనం. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఇండియన్ ఆయిల్ వారికి మద్దతు ఇచ్చినందుకు గర్వంగా ఉంది. వారు అడ్డంకులను ఎదుర్కొంటూ లక్ష్య సాధనలో విజయవంతంగా ముందుకు సాగుతున్న క్రమంలో మేము వారికి అండగా ఉండేందుకు కట్టుబడి ఉన్నాము.” అని తెలిపారు.
పీసీఐ అధ్యక్షులు దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ, “నా ఆటగాళ్లు నన్ను విశ్వసిస్తున్నారు అలాగే మేము ఇప్పటికే మా తదుపరి పోటీలకు సిద్ధమవుతున్నాం. మా అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శనలో ఇండియన్ ఆయిల్ మద్దతు అత్యంత కీలకమైనది. ఈ భాగస్వామ్యం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తిని, బలాన్ని అలాగే దృఢ సంకల్పాన్ని అందించింది.
దేశంలో క్రీడలను ప్రోత్సహించడంలో ఇండియన్ ఆయిల్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ, అథ్లెట్లకు సాధికారత కల్పించడం, ఆయా విభాగాల్లో వారి ప్రతిభను మెరుగుపరచడం ద్వారా క్రీడల్లో అగ్రగామి కావాలన్న భారత ప్రజల కల సాకారానికి మద్దతు ఇవ్వడానికి ఇండియన్ ఆయిల్ నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తుందన్నారు.
***
(Release ID: 2054439)
Visitor Counter : 68