వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎగుమతుల కోసం ఏకగవాక్ష విధానం: ట్రేడ్ కనెక్ట్ పేరుతో వెబ్ సైట్; వేగం, అందుబాటు, మార్పుదిశగా ప్రయాణం: శ్రీ పీయూష్ గోయల్
న్యూఢిల్లీలో ట్రేడ్ కనెక్ట్ ఈ-వేదికను ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయెల్
ఇది ప్రపంచం మార్కెట్లో భారతదేశం వాటాను పెంచుతుంది, చిన్న వ్యాపారాలకు సహాయకారి : శ్రీ గోయెల్
సరఫరాదారులకు విస్తృత మార్కెట్లు, అనియంత్రిత ఈ-కామర్స్, ప్రభుత్వ ఈ-మార్కెట్టుతో సంబంధాలు : శ్రీ గోయెల్
2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల వాణిజ్య ఎగుమతులు, లక్ష కోట్ల డాలర్ల సేవల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించిన శ్రీ పీయూష్ గోయెల్
Posted On:
11 SEP 2024 4:43PM by PIB Hyderabad
ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెచ్చే ట్రేడ్ కనెక్ట్ వెబ్ సైటు అందరికీ అందుబాటులో ఉంటూ వేగవంతంగా పని చేయగలిగిన వ్యవస్థ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ అన్నారు. శ్రీ గోయెల్ నేడు న్యూఢిల్లీలో ట్రేడ్ కనెక్ట్ ఈ-వేదికను ప్రారంభించారు.
ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించడమే మన లక్ష్యం కావాలని శ్రీ గోయెల్ సూచించారు. ఈ వ్యవస్థ ప్రారంభం కావడంతో ప్రపంచ వాణిజ్యంలో భారత మార్కెట్ వాటా పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా ఇది అందిస్తుందని చెప్పారు. చిన్న స్థాయి ఎఫ్‌పిఓలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వేదిక అందుబాటులో ఉంటుందంటూ, వ్యాపారాలను విస్తరించుకునేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో వారు తెలుసుకోవచ్చునని కేంద్ర మంత్రి చెప్పారు.
రాబోయే వాణిజ్య బోర్డు సమావేశం నాటికి జోడించిన సరికొత్త ఫీచర్లతో ఈ వెబ్ సైట్ 2.0 అందుబాటులోకి రావొచ్చునని శ్రీ గోయెల్ ప్రకటించారు. దీన్ని మరింత నవ్యంగా తీర్చి దిద్దే క్రమంలో వినియోగదారులు, భాగస్వాముల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. దీని ప్రయోజనాలను ప్రతీ ప్రాంతానికీ అందించేందుకు వీలుగా సరికొత్త వెబ్ సైటును హిందీ సహా పలు అధికార భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ప్రాంతీయ భాషల ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేస్తున్న విషయం ఆయన గుర్తు చేశారు.
ఈ నూతన వేదికను రూపొందించినందుకు డిజిఎఫ్‌టిని శ్రీ గోయెల్ అభినందిస్తూ ఇది భవిష్యత్ దృక్పథంతో కూడిన అనుసంధాన సమాచార వేదిక (పోర్టల్)అనీ, వాణిజ్యానికి సంబంధించిన విభిన్న రకాల సమాచారం, గణాంకాలు కూడా అందుబాటులో ఉంటాయనీ శ్రీ గోయెల్ చెప్పారు. ఎగుమతిదారులకు మద్దతు ఇచ్చేందుకు అత్యంత మెరుగైన, తెలివైన వేదిక- అని ఆయన అన్నారు.
2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల వాణిజ్య ఎగుమతులు, లక్ష కోట్ల డాలర్ల సేవల ఎగుమతులు సాధించాలన్న లక్ష్యాన్ని కేంద్ర మంత్రి పునరుద్ఘాటిస్తూ ఆ లక్ష్యాలను చేరుకోవడానికీ ఈ పోర్టల్ సహాయకారి కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇప్పటికే పని చేస్తున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ), ప్రభుత్వ ఈ-మార్కెట్ (జీఈఎం) - రెండింటితోనూ అనుసంధానం అవుతుందనీ, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు సహాయకారి అవుతుందని అన్నారు. దీనితో సరఫరాదారులు విస్తృత మార్కెట్లను చేరుకుని పోటీ సామర్ధ్యాన్ని పెంచుకోగలుగుతారని చెప్పారు.
అంతర్జాతీయ వాణిజ్య ముఖచిత్రాన్ని భారత ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఇలకు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) సరికొత్తగా ఆవిష్కరించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నూతన డిజిటల్ చొరవ ట్రేడ్ కనెక్ట్ ఇ-ప్లాట్‌ఫారం (https://trade.gov.in). ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ, ఎగ్జిమ్ బ్యాంక్, ఆర్థిక సర్వీసుల శాఖ (డీఎఫ్ఎస్), విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వంటి కీలక భాగస్వాములతో కలిసి అభివృద్ధి చేసిన ఈ వేదిక గతంలో ఉన్న సమాచార లోపాన్ని సరిదిద్ది ఎగుమతిదారులకు సమగ్ర సమాచారాన్నీ, వనరులను అందించడంలో సహాయకారిగా ఉంటుంది.
ఎగుమతిదారులకు ట్రేడ్ కనెక్ట్ వెబ్ సైటు ఏకకాల పరిష్కారంగా నిలుస్తుంది. వాణిజ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సకాలంలో ఎగుమతిదారులకు అందుబాటులో ఉంచుతుంది. అంతే కాదు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, ఇతర వాణిజ్య నిపుణులతో నిరంతర అనుసంధానాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే ఎగుమతి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారైనా లేదా కొత్త ఎగుమతిదారులైనా వారి ఎగుమతి కార్యకలాపాల ప్రతిదశలోనూ సహాయకారిగా ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ వేదిక 6 లక్షలకు పైగా ఐఈసీ హోల్డర్లు, 180 భారత రాయబార కార్యాలయాల అధికారులు, 600 పైగా ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, డీజీఎఫ్టీ, డీఓసీ, బ్యాంకు అధికారులతో అనుసంధానత కల్పిస్తుంది.
అంతర్జాతీయ వాణిజ్యంలోని సంక్లిష్టతలను సరళీకృతం చేసే విభిన్న ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్లకు సంబంధించిన లోతైన అవగాహన కోసం ఉత్పత్తులు, దేశాల మ్యాపులు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ప్రయోజనం ఎగుమతిదారులు పూర్తిగా పొందేందుకు వీలుగా వాణిజ్య ఒప్పందాలు, సుంకాల సమాచారం; ఆన్‌లైన్ మార్కెట్లలో విజయం సాదించేందుకు ప్రపంచ ఇ-కామర్స్ గైడ్; ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతిదారులు నిష్ణాతులు కావడానికి వీలుగా వారిని విద్యావంతులను చేసే ఎగ్జిమ్ పాఠశాల; భారతీయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు తెలియచేసే సోర్స్ ఫ్రమ్ ఇండియా; వాణిజ్య వృత్తి నిపుణుల నుంచి తక్షణ సలహాలు పొందేదుకు ఆస్క్ యాన్ ఎక్స్‌పర్ట్ (నిపుణుని అడిగి తెలుసుకోండి) వంటి సౌకర్యాలన్నీ ఈ వేదికపై అందుబాటులో ఫీచర్లు.
ఈ వేదికను ఉపయోగించుకుని మన ఎగుమతిదారులు మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ మార్కెట్లను చేరవచ్చు. అలాగే వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించుకుని ప్రపంచ దేశాల్లో తమ అస్తిత్వాన్ని విస్తరించుకోవచ్చు. దీని వల్ల ఎగుమతుల పరిమాణం పెరగడంతో పాటు విభిన్న మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. భారత ఎగుమతిదారుల పోటీ సామర్థ్యం పెరిగి వాణిజ్య అవకాశాలు విస్తరిస్తాయి. తద్వారా దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో ఇది కీలక పాత్రధారి అవుతుంది.
డిజిటల్ ఇండియాను ప్రోత్సహించి తద్వారా విస్తృత పారదర్శకత సాధించడం; వాణిజ్యవేత్తలకు కీలక వాణిజ్య సమాచారం నిరంతరాయంగా అందిస్తూ వారిని సాధికారం చేయడం అనే ప్రభుత్వ విస్తృత విజన్‌లో భాగంగా ఈ చొరవ తీసుకున్నారు. ట్రేడ్ కనెక్ట్ వెబ్ సైటు ప్రపంచ వాణిజ్యంలో సంక్లిష్టతలను తొలగించి వ్యయాలను నియంత్రించవచ్చు. ఎగుమతుల కాలవ్యవధిని కూడా తగ్గించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత వ్యాపారాలు మరింతగా విస్తరించేందుకు ఉపయోగపడవచ్చు.
****
(Release ID: 2054108)
Visitor Counter : 54