సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
గాంధీజీ తాత్వికతను మన జీవితాలలో మరింతగా అనుసరించే సంకల్పంతో ముందుకు సాగాలి : శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
మహాత్మాగాంధీకి అంకితం చేసిన ప్రత్యేక రైల్వే కోచ్ ని, రాజ్ ఘాట్ లో గాంధీదర్శన్ లో ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి
Posted On:
11 SEP 2024 5:02PM by PIB Hyderabad
మహాత్మాగాంధీకి అంకితం చేసిన ప్రత్యేక రైల్వే కోచ్ ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మంగళవారం న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ రైల్వే కోచ్ గాంధీజీ జీవితంలో మార్పును తెచ్చిన ఓ ఘటనకు సంబంధించినదని అన్నారు. గాందీజీ దార్శనికతను ఆచరణాత్మకంగా వివరించే ఉద్దేశంతో ఈ కోచ్ ను దాని పూర్వస్థితికి తెచ్చేలా మరమ్మతులు చేసినట్లు ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ ప్రస్థానాన్నీ, ఆయన చిర వారసత్వాన్నీ గుర్తుచేసుకునే గొప్ప సందర్భంగా ఈ కోచ్ ప్రారంభోత్సవాన్ని ఆయన అభివర్ణించారు. గాంధీజీ తాత్వికతను మన జీవితాలలో మరింతగా అనుసరించే సంకల్పంతో మనం ముందుకు సాగాలని షెకావత్ కోరారు.
మహాత్మాగాంధీ కాలం నాటి ఈ ప్రత్యేక కోచ్ ను జాగ్రత్తగా పునరుద్ధరించి, రైల్వే మంత్రిత్వశాఖ ఉదారంగా అందజేసింది. దేశ ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకురావవడానికీ, న్యాయం , సమానత్వ సాధన లక్ష్యంతో గాంధీజీ చేపట్టిన ప్రముఖ రైలు యాత్రలకూ ఇది గుర్తుగా నిలుస్తుంది.
గాంధీ దర్శన్లోని రైల్వే కోచ్ నీ, గాంధీజీ ప్రయాణాలు, తోటి ప్రయాణికులతో వారు ముచ్చటిస్తున్నట్టుండే కళాఖండాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవి మహాత్మాగాంధీ వాస్తవ రైలు ప్రయాణాలను కళ్లకు కట్టిన అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడి మ్యూజియంలో ఈ రైల్వే కోచ్ ప్రధాన ఆకర్షణ కానుంది.
మహాత్మాగాంధీ తొలినాళ్లలో భారత ఉపఖండం అంతటా మూడో తరగతి రైలు బోగీలో సాగించిన ప్రయాణం- భారతదేశం గురించి ఆయనకు ఉన్న అవగాహననీ, ఐక్య భారతావని గురించిన దార్శనికతనీ మలచడంలో కీలక పాత్ర వహించింది.
గాంధీజీ జీవితంలో ఈ ప్రయాణాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. అన్ని రంగాలలోని ప్రజలతో గాంధీజీ మమేకం కావడానికీ, వారి బాధలు తెలుసుకోవడానికీ- సత్యం, అహింస,సామాజిక న్యాయం, సమష్టితత్వానికి ఉన్న శక్తిని అవగాహన చేసుకోవడానికీ, అణచివేతకు వ్యతిరేకంగా దేశప్రజలు చేస్తున్న పోరాటంలో వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ ప్రయాణాలు దోహదపడ్డాయి. ఐక్య , సమ్మిళిత భారతావని లక్ష్యసాధనకు ఆ రకంగా రైల్వే- గాంధీజీకి కీలక ఉపకరణంగా మారింది.
భారతీయ రైల్వేలతో మహాత్మాగాంధీజీకి గల అనుబంధం, వారి ఆలోచనా విధానాన్ని, సామాజిక మార్పుకోసం వారి సంకల్పాన్ని ఎంతగొప్పగా మలిచిందీ గుర్తుచేసుకుంటూ గాంధీ దర్శన్ ఉపాధ్యక్షుడు విజయ్ గోయల్ మాట్లాడుతూ “మహాత్మాగాంధీ దృష్టిలో రైల్వే కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, భారతదేశాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించే వాహనం’’ అని అన్నారు.
***
(Release ID: 2054090)
Visitor Counter : 54