జౌళి మంత్రిత్వ శాఖ
2030 నాటికి 35,000 కోట్ల డాలర్లకు భారత టెక్స్‌టైల్స్ పరిశ్రమ; 3.5 కోట్ల అదనపు ఉద్యోగాల కల్పన : కేంద్ర జౌళిశాఖా మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
“భారత్ బ్రాండ్”, హరిత జౌళి ఉత్పత్తుల ద్వారా ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు లభిస్తుందని శ్రీ గిరిరాజ్ సింగ్ ఆశాభావం
2025 ఫిబ్రవరి 14-17 తేదీల మధ్య ఢిల్లీలో “భారత్ టెక్స్ 2025” నిర్వహణ
దేశానికి చెందిన 5,000 మంది ఎగ్జిబిటర్లు, 110 పైగా దేశాల నుంచి 6,000 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు హాజరవుతారని అంచనా
Posted On:
04 SEP 2024 6:09PM by PIB Hyderabad
భారత జౌళి పరిశ్రమ 2030 నాటికి 35,000 కోట్ల డాలర్లకు చేరుతుందని, 3.5 కోట్ల ఉద్యోగాలు జోడిస్తుందని అంచనా. నేడు న్యూఢిల్లీలో “భారత్ టెక్స్ 2025” కి నాందీగా జరిగిన కార్యక్రమంలో (కర్టెన్ రైజర్) కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ విషయం తెలిపారు. ప్రపంచ యవనికపై “భారత్ బ్రాండ్”, హరిత టెక్స్‌టైల్ ఉత్పత్తుల ద్వారా భారత్ గుర్తింపు సాధిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర టెక్స్‌టైల్స్, విదేశాంగ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరిటా, టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టెక్స్‌టైల్ పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పీఎల్ఐ పథకం ఉత్పత్తిని పెంచడానికి, బ్రాండ్ ప్రచారానికి దోహదపడుతుందని శ్రీ సింగ్ చెప్పారు. అలాగే టెక్స్‌టైల్ పరిశ్రమకు చెందిన విలువ ఆధారిత వ్యవస్థ అనుసంధానానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా పీఎల్ఐ పథకం ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
మన దేశం చైనా కన్నా అధిక వృద్ధి సాధించడానికి మన దేశ జనాభా దోహదపడుతుందని శ్రీ సింగ్ చెప్పారు. భారత్ టెక్స్ 2025లో ఉత్సాహంతో పాల్గొనాలని రాష్ర్ట ప్రభుత్వాలకు ఆయన సూచించారు. ‘‘నవ్యత, సహకారం, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రధానమంత్రి 5-ఎఫ్ విజన్‌కు (వ్యవసాయ క్షేత్రాల నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుంచి విదేశాలకు) సాకారంగా నిలుస్తుంది’’ అన్నారు.
భారత టెక్స్‌టైల్ ఎగుమతుల ప్రోత్సాహక మండళ్ల (ఇపిసి) కన్సార్షియం జౌళి మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహిస్తున్న భారత్ టెక్స్ 2025 నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14-17 తేదీల మధ్యన జరిగే ఇది ప్రపంచ శ్రేణి టెక్స్‌టైల్ వాణిజ్య ప్రదర్శన, సంబంధిత పరిజ్ఞానం పంచుకునే వేదికగా వ్యవహరిస్తుంది.
అత్యంత అధునాతన వేదికలు రెండింటిపై -న్యూఢిల్లీలోని భారత మండపం, గ్రేటర్ నోయిడాలోని ఇండియన్ ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్ - సమాంతరంగా జరుగుతుంది. ఇందులో ప్రధాన కార్యక్రమం ఫిబ్రవరి 14-17 తేదీల మధ్య భారత మండపంలో నిర్వహిస్తారు. టెక్స్‌టైల్ విలువ ఆధారిత వ్యవస్థలోని అన్ని విభాగాలను ఇది కవర్ చేస్తుంది. హస్తకళా ఉత్పత్తులు, గార్మెంట్ పరిశ్రమకు అవసరమైన యంత్ర పరికరాలు, దేశీయ దుస్తుల ప్రదర్శన గ్రేటర్ నోయిడాలోని ఇండియన్ ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో ఫిబ్రవరి 12-15 తేదీల మధ్యన జరుగుతుంది.
ఈ ఏడాది జరిగిన భారత్ టెక్స్ సాధించిన అద్భుత విజయం పునాదిగా భారత్ టెక్స్ 2025 నిర్వహించాలన్నది లక్ష్యం. ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థల స్థితిస్థాపకత, టెక్స్‌టైల్ సుస్థిరత అనే రెండు థీమ్ లపై నిర్మించిన తొలి ఎడిషన్ కన్నా శక్తివంతంగా, ఆకర్షణీయంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అత్యున్నత విధానకర్తలు, ప్రపంచ సిఇఓలు, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు, ప్రపంచ దేశాలకు చెందిన కొనుగోలుదార్లను ఇది ఆకర్షిస్తుందన అంటున్నారు.
20,000 చదరపు మీటర్ల విస్తీర్ణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 110 పైగా దేశాలకు చెందిన 5,000 మంది పైగా ఎగ్జిబిటర్లు; 6,000 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొనేందుకు అవసరమైన వసతులున్నాయి. అలాగే 1,20,000 మంది పైగా సందర్శకులు కూడా పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు అంతర్జాతీయ వక్తలు పాల్గొని తమ భావాలు పంచుకోవచ్చునంటున్నారు.
భారత్ టెక్స్ ప్రదర్శనలో దుస్తులు, హోమ్ ఫర్నిషింగ్ వస్తువులు, ఫ్లోర్ కవరింగ్‌లు, ఫైబర్, యార్న్, దారాలు, ఫ్యాబ్రిక్‌లు, తివాచీలు, సిల్క్ దుస్తులు, టెక్స్‌టైల్ ఆధారిత హస్తకళా ఉత్పత్తులు, టెక్నికల్ టెక్స్‌టైల్స్ వంటివి భారత్ టెక్స్‌లో ప్రదర్శనకు రావచ్చు. భారత ఫ్యాషన్ రిటైల్ మార్కెట్ అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ రిటైల్ విక్రయ వీధి కూడా ఒకటి ఉంటుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోలో నిర్వహించే ప్రదర్శనలో హస్తకళా ఉత్పత్తులు, దుస్తుల తయారీ యంత్రపరికరాలు, దేశీయ దుస్తులు ప్రదర్శనకు వస్తాయని భావిస్తున్నారు.
ఈ టెక్స్‌టైల్ వేడుకలో విభిన్న రకాల కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రపంచ శ్రేణి వాణిజ్య ప్రదర్శన, ఎక్స్‌పో, ప్రపంచ శ్రేణి టెక్స్‌టైల్ సదస్సులు, సెమినార్లు, సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశాలు, బీ2బీ, జీ2జీ సమావేశాలు కూడా ఉంటాయి. అలాగే టెక్స్‌టైల్ రంగంలో వ్యూహాత్మక పెట్టుబడి ప్రకటనలు, కొత్త ఉత్పత్తుల విడుదల, ప్రపంచ టెక్స్‌టైల్ పరిశ్రమ గతిని మార్చగల సహకార భాగస్వామ్యాల ప్రకటనలు వంటివి ఉండవచ్చు. అలాగే లైవ్ డెమోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ ప్రదర్శనలు, డిజైన్ అండ్ బ్రాండ్ ఎగ్జిబిషన్లు, సుస్థిరత వర్క్‌షాప్‌లు, నిపుణుల ప్రసంగాలు కూడా సందర్శకులు వీక్షించవచ్చు.
ఈ భారత్ టెక్స్ 2025 నాంది కార్యక్రమంలో పారిశ్రామిక సంఘాలు, టెక్స్‌టైల్ పరిశ్రమకు చెందిన నాయకులు, విభిన్న మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత్ టెక్స్ 2024కి సంబంధించిన మరింత సమాచారం ఈ లింక్ ద్వారా తెలుసుకోండి. www.bharat-tex.com
***
(Release ID: 2052789)
Visitor Counter : 59