వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలు, రైతులను కలిసి వారి సమస్యలు విన్న కేంద్ర మంత్రి


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో వరద పరిస్థితులపై

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెంటనే స్పందించారన్న కేంద్ర మంత్రి

ప్రధాని సూచనతో ముమ్మర చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి

చంద్రబాబునాయుడు: శివరాజ్ సింగ్ చౌహాన్

శ్రీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది

బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది : శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర వాటా సహా రూ. 3,448 కోట్ల ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులతో సత్వర సహాయం : శ్రీ చౌహాన్

Posted On: 06 SEP 2024 5:48PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఈ రోజు మొదటగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన మీనవల్లు, పెద్దగోపవరం, మన్నూర్, కట్లేరు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని పరిశీలించారు. వీటితోపాటు ఖమ్మం, మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఖమ్మంలో బాధిత ప్రజలను కలిసిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ తెలిపారు. ఎవ్వరూ నిరాశ చెందవద్దని, మనమంతా కలిసికట్టుగా పనిచేసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం నుండి ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందనీ, అలాగే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందనీ తెలిపారు.

తెలంగాణలో, ఖమ్మం జిల్లా రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా.. ఓ రైతు వరద వల్ల తన పంటకు జరిగిన నష్టాన్ని గురించి చెప్పగా, కేంద్ర మంత్రి వెంటనే ఆ రైతును పిలిచి హత్తుకుని, కన్నీరు తుడిచి ఓదార్చారు. మీ బాధను అర్థం చేసుకునేందుకు ప్రధానంత్రి మోదీ నన్ను ఇక్కడికి పంపినట్లుగా బాధితులతో కేంద్ర మంత్రి చెబుతూ, మీరు పంటను కోల్పోయినా, మీ జీవితాలకు మాత్రం ప్రధాని అండగా ఉంటారని ఆయన అన్నారు. తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని, రైతు సోదరుడి బాధ తనకు తెలుసునని అన్నారు. అయితే ఈ బాధ, ఈ కన్నీళ్లు శాశ్వతం కాదని, తగిన నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకుంటామని తెలిపారు. మంత్రితో ఓ రైతు మాట్లాడుతూ... మధ్య ప్రదేశ్‌లో మీరు రైతుల కోసం ఎంతో చేశారనీ, మమ్మల్ని కూడా ఆదుకోవాలనీ కోరాడు. దీనికి కేంద్ర మంత్రి స్పందిస్తూ, మొదట జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, త్వరలోనే తగిన పరిహారం అందిస్తామని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో రుణాల వసూలు గురించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను ఆదేశిస్తామన్నారు. తరువాతి పంట కోసం ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంక్షోభం ఊహించని పరిణామం అన్న కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి సత్వరమే స్పందించారని గుర్తు చేశారు. రైతుల జీవితాలను మామూలు స్థితికి తెచ్చేందుకు తాము రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్నారు.

ఈరోజు రైతుల పొలాలను సందర్శించి జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నామని కేంద్ర మంత్రి చౌహాన్ తెలిపారు. అరటి, పసుపు, కూరగాయలు సహా రైతుల పంటంతా నాశనమైందన్నారు. ఈ ప్రాంత ప్రజలు అధికంగా ఉద్యానపంటలు సాగు చేస్తారని, వీరిలో కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారన్నారు. కౌలుకు తీసుకుని సాగు చేసే రైతులు యజమానులకు పంటలో అధిక భాగం లేదా డబ్బును చెల్లించాల్సి ఉన్నందున ఇది వారికి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్నారు. వారు ఉన్న డబ్బంతా పెట్టి పంట వేస్తే, వరద వల్ల అదంతా నాశనమైందన్నారు. అయితే ప్రధాని సూచనలతో రైతులకు భరోసానివ్వడానికే తాము ఇక్కడికి వచ్చామని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సత్వరమే సహాయక చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నాలుగు ప్రాధాన్యతలను వివరించారు. మొదటిది తక్షణం రైతులకు సాయం అందించడం, రెండోది పంట బీమా పథకం ప్రయోజనం రైతులకు అందించేలా కృషి చేయడం, మూడోది కౌలు రైతులకు సహాయం కోసం ఏర్పాట్లు చేయడం, నాలుగోది తదుపరి పంట వేయడంలో రైతులకు సహాయపడడం అని మంత్రి వివరించారు. ఈ సమస్యలు మన ముందు ఉన్నాయని, అయితే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయకత్వంలో మనం ఈ సమస్యలకు పరిష్కారం కనుగొందామన్నారు.

 

***


(Release ID: 2052673)
Read this release in: Tamil , English , Urdu , Hindi