వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అగ్రిష్యూర్ నిధిని ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
అగ్రిష్యూర్ గ్రీనథాన్ విజేతలకు సన్మానం
వ్యవసాయం దేశానికి వెన్నెముక, రైతులే ప్రాణాధారం: చౌహాన్
రైతులందరినీ సాధికారులను చేయడం మా లక్ష్యం, వ్యవసాయంపై మా అంకితభావానికి అగ్రిషూర్ నిధి నిదర్శనం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
రైతు సాధికారత, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటన
Posted On:
03 SEP 2024 7:10PM by PIB Hyderabad
వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో మంగళవారం అగ్రిష్యూర్ పథకాన్ని ప్రారంభించారు. దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలన్న లక్ష్యంతో అంకుర సంస్థలు, గ్రామీణ స్థాయి సంస్థల కోసం ఏర్పాటు చేసిన ఓ వినూత్న పథకం- అగ్రిష్యూర్. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడి, మరోవైపు నష్టభయం ఉన్నప్పటికీ, ప్రయోజనం ఎక్కువ ఉంటుందనుకున్న సంస్థలకు ఆర్ధిక దన్నును అందించాలన్నది ఈ పథక లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలను, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకానికి రూపకల్పన చేశారు. సెబీలో కేటగిరీ-2 పరిధిలోకి వచ్చే తాత్కాలిక ప్రాతిపదిక ప్రత్యామ్నాయ పెట్టుబడి (ఏఐఎఫ్) నిధిని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు, నాబార్డ్ రూ. 250 కోట్లు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి సమీకరించిన రూ. 250 కోట్లతో కలిపి మొత్తం రూ. 750 కోట్లను మిశ్రమ విధానంలో సమీకరిస్తారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ భగీరథ్ చౌదరి, శ్రీ రాంనాథ్ ఠాకూర్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేశ్ చతుర్వేది సహా పలువురు హాజరయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ రంగానికి చెందిన భాగస్వాములు పాల్గొన్నారు.
మార్పులు తెచ్చే దిశగా, ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన కార్యక్రమాలకు ఉన్న శక్తి సామర్థ్యాలను శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తన కీలకోపన్యాసంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో ప్రతి రైతు అభివృద్ధికీ అవసరమైన టెక్నాలజీ సాయాన్ని అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలకు ఇది కొనసాగింపుగా అగ్రిష్యూర్ నిధిని ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. రైతులు వినియోగ మార్గంలో తమ సంపదను వెచ్చిస్తారనీ, వారి శ్రేయస్సుతో సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యపడుతుందని అన్నారు. దేశానికి- వ్యవసాయం వెన్నుముక అయితే, రైతు ప్రాణాధారమని వ్యాఖ్యానించారు.
రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ చౌహాన్ వివరిస్తూ, ‘‘రైతు సాధికారతే మా లక్ష్యం. అగ్రిషూర్ నిధిని ప్రారంభించడం వ్యవసాయ రంగంపై అచంచలమైన మా నిబద్ధతకు నిదర్శనం. పంట బీమా ద్వారా- ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, గిట్టుబాటు ధరలు, పంట వైవిధ్యం, పంట అనంతర నష్టాన్ని నివారించడం, భీమా ద్వారా పంటలకు భరోసా.. ఉండేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’’ అన్నారు.
కార్యక్రమం అనంతరం ఉత్పాదకాల ఎంపిక నుంచి మార్కెటింగ్, అలాగే అదనపు విలువను జోడించే వరకు వివిధ దశల్లో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతికత ఆధారంగా పరిష్కారాలను చూపే అత్యంత వినూత్న అంకుర సంస్థలకు అగ్రిష్యూర్ గ్రీనథాన్ పురస్కారాలు ప్రదానం చేశారు. గ్రీనథాన్ ను ముంబైలో జూలై 12న ప్రారంభించారు. ప్రారంభానికి ముందు 10 మందితో దాని గ్రాండ్ ఫినాలే జరిగింది. 2000 వర్దమాన వ్యవసాయ అంకుర సంస్థల్లో, 500కు పైగా నమూనాలను ప్రదర్శించాయి. ఫైనల్ కు చేరుకున్న 10 సంస్థల ప్రతినిధులు తమ ఆలోచనలను వినిపించారు. గ్రీన్ సాఫియో, కృషికాంతి, ఆంబ్రోనిక్స్ అనే అంకుర సంస్థలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. రూ. 6 లక్షల నజరానా ద్వారా అత్యుత్తమ ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా, ఆలోచనలను పంచుకోవడం ద్వారా అంకుర సంస్థల మధ్య భవిష్యత్ సహకారం దిశగా ఒక వేదికను గ్రీనథాన్ అందించింది.
ఈ సందర్భంగా చతుర్వేది మాట్లాడుతూ, రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయంలో అంకుర సంస్థల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, పెట్టుబడి సమూహాలు, అంకుర సంస్థల ప్రతినిధులు సహా వివిధ భాగస్వాముల సమ్మేళనంగా ఈ కార్యక్రమం జరిగింది. అంకుర సంస్థలు, గ్రామీణ సంస్థల కోసం నిర్దేశించిన అగ్రిష్యూర్ ప్రారంభ కార్యక్రమానికి సంబంధిత వర్గాన్నీ హాజరయ్యాయి. దేశంలో వ్యావసాయిక అంకుర సంస్థల రంగంలో ఆ తరహా పథకం రావడం ఇదే మొదటిసారి.
అగ్రిషూర్ నిధి తరహాలోనే, వ్యవసాయ రంగానికి మరింతగా పెట్టుబడులను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అది రైతులను సాధికారులను చేయడంతో పాటు అందుబాటులో ఉన్న సృజనాత్మక పరిష్కారాలను వేగవంతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.
***
(Release ID: 2051598)
Visitor Counter : 158