నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2024 4:32PM by PIB Hyderabad
మత్స్యకారుల హక్కుల పరిరక్షణ పై దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డిఎస్ఎన్ఎల్ యు ) సహకారంతో భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి ) విశాఖపట్నం క్యాంపస్ లో నిర్వహించిన ఒక రోజు ఓపెన్ హౌస్ చర్చ పలు కీలక సూచనలతో ముగిసింది.ఇవి మత్స్యకారుల మానవ హక్కుల సంక్షేమం కోసం మెరుగైన చర్యలు తీసుకోవడానికి సహాయపడతాయి. ఎన్ హెచ్ ఆర్ సి తాత్కాలిక చైర్ పర్సన్ శ్రీమతి విజయభారతి సయాని ఈ చర్చలకు అధ్యక్షత వహించారు. భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మత్స్యకారుల సమాజం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. అందువల్ల, వారి గౌరవప్రదమైన జీవనోపాధి కోసం వారి హక్కులను పరిరక్షించడం , సంబంధిత సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం అని ఆమె పేర్కొన్నారు.
మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు కమిషన్ కట్టుబడిఉందనిఆమెతెలిపారు. . ఈ సందర్భంగా వారి హక్కుల పరిరక్షణకు కమిషన్ తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రస్తావించారు. సమాజంలోని వివిధ బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిషన్ పనితీరులోని వివిధ కోణాలను, వివిధ రంగాల జోక్యాలను, దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు జారీ చేసిన వివిధ సలహాలను ఆమె వివరించారు.
అంతకుముందు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్ఎన్ఎల్ యు ) ఉపకులపతి ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు స్వాగతం చెబుతూ, మూడు టెక్నికల్ సెషన్లుగా చర్చల నిర్వహణ గురించి వివరించారు. వీటిలో భారత మత్స్యకారుల మానవ హక్కుల ఉల్లంఘన, చేపలు పట్టే హక్కులు, పర్యావరణ సమస్యలు , సామాజిక భద్రతా చర్యలు, మత్స్యకారుల సంక్షేమ పథకాలు ఉన్నాయి.
భారత మత్స్యకార సమాజాల మానవ హక్కుల ఉల్లంఘనలపై జరిగిన మొదటి సెషన్ లో వక్తలు- ఆర్థిక వ్యవస్థలో చేపల పెంపకం కీలక పాత్ర ను, ప్రమాదకరమైన పని పరిస్థితుల కారణంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావించారు. మత్స్యకారుల రక్షణే ధ్యేయంగా చట్టాలు ఉన్నప్పటికీ వారి మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని, ఇందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారుల హక్కులు, జీవనోపాధిని పరిరక్షించడానికి సుస్థిరమైన చేపలు పట్టే పద్ధతులు, వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్ధ్యం, అంతర్జాతీయ సహకారం అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఇ.ఉదయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, కాలుష్య ప్రభావాన్ని గురించి, ప్రకృతిని గౌరవించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్ ఎఫ్ డి సీనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్) డాక్టర్ దీపాసుమన్ మాట్లాడుతూ, భద్రతా చర్యలు, బీమా, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా మత్స్యకార సమాజానికి తోడ్పాటు అందించే ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన ప్రాముఖ్యతను వివరించారు.
చేపలు పట్టే హక్కులు , పర్యావరణ సమస్యలపై జరిగిన రెండవ సాంకేతిక సెషన్లో, ఐ సి ఎ ఆర్- సి ఎం ఎఫ్ ఆర్ ఐ కి చెందిన డాక్టర్ జో కె. కిజాకుదన్ మాట్లాడుతూ, మహారాష్ట్ర, తమిళనాడులో మెరుగైన పరిస్థితులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు ఒడిశాకు వలస వెడుతున్నారని అన్నారు. ఐ సి ఎ ఆర్- సి ఎం ఎఫ్ ఆర్ ఐ కి చెందిన డాక్టర్ ఎస్ ఎస్ రాజు మాట్లాడుతూ, తరతరాలుగా మత్స్యకార వృత్తిలోనే ఉండిపోవడం, ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లేకపోవడం, జీవన పరిస్థితులు మెరుగ్గా లేకపోవడం , పరిశ్రమ వ్యర్థాలతో పర్యావరణ క్షీణత మొదలైన అంశాలను ప్రస్తావించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్.పి) , మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. సోనిపట్ లోని అశోక విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ దివ్యకర్ణద్, గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో పనిచేసిన ప్రొఫెసర్ వి.రాజా లక్ష్మి మాట్లాడుతూ, సంప్రదాయ మత్స్యకారుల హక్కులను పరిరక్షించాలని, అవసరమైన సేవలను అందించాలని అన్నారు. వారి సంక్షేమానికి తోడ్పడటానికి సామాజిక, వ్యక్తిగత విధానాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
మత్స్యకారులకు సామాజిక భద్రతా చర్యలు, సంక్షేమ పథకాలపై జరిగిన మూడో సెషన్ లో వి ఐ టి- ఎ పి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా కు చెందిన డీన్, లా ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ బెనర్జీ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు అరెస్టయిన భారతీయ మత్స్యకారులు ఎదుర్కొన్న న్యాయపరమైన సవాళ్లను వివరించారు. మారిటైమ్, సముద్ర చట్టాలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. డి ఎస్ ఎన్ ఎల్ యు వంటి స్థానిక న్యాయ విద్యా సంస్థలు మత్స్యకారుల కోసం అవుట్ రీచ్, విద్యా ప్రయత్నాల్లో నిమగ్నం కావాలని కోరారు. ముఖ్యంగా కచ్చతీవు చుట్టుపక్కల అస్పష్టమైన సముద్ర సరిహద్దుల సంక్లిష్టతలపై ఆయన చర్చించారు. తెలియకుండా అంతర్జాతీయ జలాల లోకి వెళ్ళే మత్స్యకారులను రక్షించడానికి చట్టపరమైన సంరక్షణ వ్యవస్థ, భీమా రక్షణ కల్పించాలని ప్రతిపాదించారు.
ముగింపు సెషన్ లో మత్స్యకార సంఘం ప్రతినిధుల ను చర్చకు అనుమతించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై తక్కువ అవగాహన, చట్టవిరుద్ధంగా తీరప్రాంత అభివృద్ధి , కాలుష్య దుష్ప్రభావాలతో సహా తమ సమాజాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వ్యక్తీకరించడానికి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
చర్చల్లో వెల్లడైన కొన్ని కీలక సూచనలు ఇలా ఉన్నాయి:
•సుస్థిర చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి తీర ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ద్వారా మత్స్యకార సమాజాలకు సముద్రాల చట్టాలపై విద్య , అవగాహన పెంపొందించడం అవసరం ;
• మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై అవగాహన పెంచడం;
• తీరప్రాంతాల చుట్టూ సముద్ర పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేసే అక్రమ తీరప్రాంత అభివృద్ధి , హానికరమైన కాలుష్య ప్రభావాలను నిరోధించాల్సిన అవసరం;
• సురక్షితమైన పని పరిస్థితులు, న్యాయమైన పరిహారం , అత్యవసర సేవల లభ్యత కోసం హక్కులకు హామీ ఇవ్వడం ద్వారా మత్స్యకారులకు సాధికారత, రక్షణ కల్పించడం;
• రాష్ట్రాల మధ్య మత్స్యకారుల వలసలను నిరోధించేందుకు వారి సంక్షేమం దిశగా ఉత్తమ పధ్ధతులు అనుసరించడం పై తీర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం;
భారత ప్రభుత్వ మత్స్య శాఖ, ప్రతినిధులు, ఆంధ్రా యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐసీఏఆర్- సీఎంఎఫ్ఆర్ఐ), నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, అంతర్జాతీయ, జాతీయ స్వచ్చంద సంస్థలు, సి ఎస్ ఒ లు, ప్రైవేటు సంస్థల ప్రొఫెసర్లు ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది మత్స్యకారులు, వారి కుటుంబాలు కూడా పాల్గొన్నాయి.
*****