గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ - జూన్ స్థూల దేశీయోత్పత్తి అంచనాలు


2024-25 మొదటి త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం

2024-25 తొలి త్రైమాసికంలో వాస్తవిక జీవీఏ వృద్ధి 6.8%

గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే (5.9%) ఈ సారి గణనీయమైన వృద్ధి సాధించిన ద్వితీయ రంగం (8.4%)

Posted On: 30 AUG 2024 5:30PM by PIB Hyderabad

స్థిర (2011-12), ప్రస్తుత ధరల ఆధారంగా వ్యయ అంశాలను పరిగణన లోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్-జూన్  త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను గణాంక-కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ వో)  విడుదల చేసింది. 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాల తొలి త్రైమాసికంలో స్థిర, ప్రస్తుత ధరల వద్ద జీడీపీలో వార్షిక శాతం మార్పులు, వ్యయ అంశాలను అనుబంధం-ఎ లోని మొదటి నాలుగు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాల రకాన్ని బట్టి ప్రాథమిక ధరల వద్ద స్థూలంగా జోడించిన అదనపు విలువ (జీవీఏ) త్రైమాసిక అంచనాలు కూడా అందులో ఉన్నాయి.

ముఖ్యాంశాలు:

·        ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో వాస్తవక జీడీపీ 6.7% వృద్ధి చెందుతుందని అంచనా. కాగా, క్రితం ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 8.2%గా ఉంది.

2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదవగా, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అది 8.5 శాతంగా ఉంది.
క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోని 8.3% వృద్ధి రేటుతో పోలిస్తే 2024-25 తొలి త్రైమాసికంలో వాస్తవిక జీవీఏ 6.8% పెరిగింది. ద్వితీయ రంగంలో (8.4 %) నమోదైన గణనీయమైన వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ జీవీఏ వృద్ధికి దోహదపడింది. ఆ రంగంలో నిర్మాణం (10.5%), విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు (10.4%), తయారీ (7.0%) భాగంగా ఉన్నాయి.
2024-25 తొలి త్రైమాసికంలో నామమాత్రపు జీవీఏలో వృద్ధి రేటు అంచనా 9.8%. కాగా, క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది 8.2% నమోదైంది.
స్థిర ధరల వద్ద - 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్ సీఈ) 7.4 శాతం, కొత్త ఆస్తుల కొనుగోలు వ్యయం  (జీఎఫ్ సీఎఫ్) 7.5 శాతం వృద్ధి రేటును సాధించాయి.
ప్రస్తుత ధరల వద్ద నికర పన్నుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.0% వృద్ధి రేటు గమనించవచ్చు. ఫలితంగా జీవీఏ, జీడీపీ వృద్ధి రేటు మధ్య 0.1 శాతం పాయింట్ల వ్యత్యాసం ఏర్పడింది.
 

I. త్రైమాసిక అంచనాలు, వృద్ధి రేట్లు

            ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ లేదా స్థిర ధరల వద్ద జీడీపీ రూ. 43.64 లక్షల కోట్లుగా అంచనా; అది 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.40.91 లక్షల కోట్లుగా ఉంది. వృద్ధిరేటు 6.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామమాత్రపు జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ రూ. 77.31 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది రూ.70.50 లక్షల కోట్లుగా ఉంది. 9.7 శాతం వృద్ధి రేటును ఇది చూపుతోంది.

            ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో వాస్తవిక జీవీఏ రూ. 40.73 లక్షల కోట్లుగా అంచనా వేశారు. క్రితం ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో అది రూ. 38.12 లక్షల కోట్లుగా ఉంది. వృద్ధిరేటు 6.8 శాతంగా అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో నామమాత్రపు జీవీఏ రూ. 70.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది రూ. 63.96 లక్షల కోట్లుగా ఉంది. 9.8% వృద్ధి రేటును ఇది చూపుతోంది.

 

ప్రాథమిక రంగం: వ్యవసాయం, పశుసంపద, అటవీ రంగం, చేపలు పట్టడం, గనుల తవ్వకం, క్వారీయింగ్

ద్వితీయ రంగం: తయారీ, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు, నిర్మాణం

తృతీయ రంగం: వర్తకం, హోటళ్లు, రవాణా, ప్రసార సంబంధిత సేవలు, ఆర్థిక అంశాలు, స్థిరాస్తి రంగం, వృత్తిపరమైన సేవలు, ప్రజా పాలన, రక్షణ, ఇతర సేవలు.

 

II. విధానం, ప్రధాన సమాచార వనరులు:

            జీడీపీ త్రైమాసిక అంచనాలకు సూచికలు ఆధారం. ప్రామాణిక సూచికల పద్ధతిని, అంటే క్రితం ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే త్రైమాసికానికి అందుబాటులో ఉన్న అంచనాలను ఉపయోగించి సంకలనం చేస్తారు. ఆ అంచనాల కోసం ఉపయోగించే సంబంధిత సూచికలు వివిధ రంగాల పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ అంచనాలను సంకలనం చేయడంలో వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ ప్రైవేటు ఏజెన్సీల నుంచి సేకరించిన సమాచారం కీలకంగా ఉపయోగపడుతుంది.

            రంగాలవారీ అంచనాలను సూచికలు/ సమాచార వనరులను ఉపయోగించి సంకలనం చేస్తారు. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి కింది అంశాల్లో అందుబాటులోని సమాచారం ఉంటుంది - (i) పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), (ii) 2024-25 మొదటి త్రైమాసికానికి అందుబాటులో ఉన్న ఆర్థిక ఫలితాల ఆధారంగా ప్రైవేటు రంగంలోని నమోదైన ఆర్థిక కంపెనీల పనితీరు, (iii) 2024-25లో పంట ఉత్పత్తి లక్ష్యాలు, (iv) 2024-25 సంవత్సరానికి ప్రధాన పశు ఉత్పత్తుల లక్ష్యాలు; (v) చేపల ఉత్పత్తి, (vi) సిమెంటు, ఉక్కు ఉత్పత్తి/వినియోగం, (vii) రైల్వేల్లో నికర టన్ను కిలోమీటర్లు, ప్యాసింజర్ కిలోమీటర్లు, (viii) పౌర విమానయానం ద్వారా ప్రయాణికులు, సరుకు రవాణా వర్తక నిర్వహణ, (ix) ప్రధాన, చిన్న సముద్ర నౌకాశ్రయాల వద్ద రవాణా సరుకు వర్తక నిర్వహణ, (x) వాణిజ్య వాహనాల విక్రయాలు, (xi) బ్యాంకు డిపాజిట్లు, రుణాలు, (xii) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలు మొదలైనవి.

అంచనాలో ఉపయోగించే ప్రధాన సూచికలలో వార్షిక వృద్ధి రేట్లను (%) అనుబంధం-బిలో పేర్కొన్నారు.

జీడీపీ సంకలనం కోసం ఉపయోగించే మొత్తం పన్ను ఆదాయంలో జీఎస్టీయేతర ఆదాయంతో పాటు జీఎస్టీ ఆదాయం కూడా ఉంటుంది. ప్రస్తుత ధరల వద్ద ఉత్పత్తులపై పన్నులను అంచనా వేయడానికి ముఖ్య గణాంకాధికారి (సీజీఏ), భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగిస్తారు. పన్ను విధించిన వస్తువులు, సేవల పరిమాణంలో పెరుగుదలను ఉపయోగించి పరిమాణాన్ని విస్తరించడం ద్వారా స్థిర ధరల వద్ద ఉత్పత్తులపై పన్నులు సంకలనం చేస్తారు. దానిని ఏకీకృతం చేసి మొత్తం పన్ను పరిమాణాన్ని నిర్ణయిస్తారు. ప్రధాన సబ్సిడీల సమాచారాన్ని ఉపయోగించి ప్రస్తుత ధరల వద్ద మొత్తం ఉత్పత్తి సబ్సిడీలను సంకలనం చేస్తారు. అందులో, కేంద్రానికి సంబంధించిన ఆహారం, యూరియా, పెట్రోలియం, పోషక ఆధారిత సబ్సిడీ వంటివి ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చాలా రాష్ట్రాలు సబ్సిడీలపై చేసిన వ్యయం కూడా అందులో ఉంటుంది. కేంద్రం, రాష్రాలు చేసిన రెవెన్యూ వ్యయం, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు మొదలైన అంశాలపై సీజీఏ, కాగ్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగించి ప్రభుత్వ తుది వినియోగ వ్యయాన్ని (జీఎఫ్ సీఈ) అంచనా వేస్తారు.

సమాచార సేకరణలో మెరుగుదల, ఆధార సంస్థలు అందించిన ఆవశ్యక సమాచారంలో సవరణలు ఈ అంచనాల తదుపరి సవరణలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, విడుదల క్యాలెండర్ ప్రకారం పైన పేర్కొన్న కారణాల వల్ల అంచనాలు కాలానుగుణంగా సవరణలకు లోనయ్యే అవకాశం ఉంది. గణాంకాలపై వ్యాఖ్యానించే సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. 2024-25 జూలై-సెప్టెంబర్ (రెండో త్రైమాసికం)కు సంబంధించి జీడీపీ అంచనాలు నవంబరు 29న విడుదలవుతాయి.  

 

 

***



(Release ID: 2050683) Visitor Counter : 4