సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

9 ఫారాల బదులు ఇక ఒకటే ఫారం. ఏకీకృత ఫారాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


వృద్ధుల కోసం పింఛను ప్రక్రియను సులభతరం చేసేందుకు

ఒకే ఫారం నింపడం ద్వారా ప్రధాని కల నెరవేరింది: కేంద్ర మంత్రి


డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పెన్షన్ అదాలత్, అనుభవ్ అవార్డులు,

ప్రీ రిటైర్మెంట్ కౌన్సిలింగ్ కార్యశాల వంటి సంస్కరణలతో మరో ఘనత సాధించిన పెన్షన్ శాఖ

Posted On: 30 AUG 2024 4:23PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా వృద్ధుల, పెన్షనర్ల జీవన సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తొమ్మిది వేర్వేరు ఫారాలను విలీనం చేస్తూ ఒక ఏకీకృత ఫారాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. వృద్ధుల కోసం వివిధ ప్రక్రియలను సరళతరం చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను ఈ తాజా నిర్ణయం ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగుల విలువైన సమయాన్ని ఆదా చేస్తూ, తమ శక్తియుక్తులు, నైపుణ్యాన్ని కాపాడుకోవడం ద్వారా "వికసిత్ భారత్" సాకారానికి సమర్థవంతంగా సహకరించేలా వారిని ప్రోత్సహిస్తుందన్నారు.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ సంస్కరణ ప్రాముఖ్యతను తెలిపారు, 'భవిష్య' ఏక సరళతర పెన్షన్ ధరఖాస్తు ఫారం, ఈ-హెచ్ఆర్ఎంఎస్ తో డిజిటల్ ఏకీకరణను ప్రారంభించడం మంత్రిత్వ శాఖ చేపట్టిన సంస్కరణల్లో మరో మైలురాయిగా చెప్పవచ్చన్నారు. వృద్ధుల జీవితాలను మెరుగుపరచడానికి పెన్షన్ల శాఖ నిరంతరం సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సంస్కరణ కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాదు...  పెద్దల సమయాన్ని, అనుభవాన్ని గౌరవించడం, వారు గౌరవప్రదమైన, ఇబ్బంది లేని జీవితాలను గడపగలరని నిర్ధారించడమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యత అయిన వృద్ధుల సంక్షేమం కోసం ఇరు శాఖలు చేపట్టిన ప్రయత్నాలను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పెన్షన్ అదాలత్, అనుభవ్ అవార్డులు, ప్రీ రిటైర్ మెంట్ కౌన్సెలింగ్ కార్యశాలలతో సహా అనేక  సంస్కరణలను ప్రవేశపెట్టడంలో పెన్షన్ల శాఖ ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెన్షనర్లకు పారదర్శకత, సమర్థత, అంతరాయం లేని అనుభవాన్ని అందించడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు.

కుటుంబ పెన్షన్ ఫిర్యాదుల కోసం చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ పిల్లలు, దివ్యాంగ కుమార్తెలు, వితంతువు, విడాకులు పొందిన కుమార్తెలు, ఆధారపడిన తల్లులు, యుద్ధవీరుల వితంతువుల కేసుల పరిష్కారంలో పరిష్కార రేటు 96 శాతం దాటిందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో ఉన్న పదవీ విరమణ పొందిన అధికారులు ఈ-హెచ్‌ఆర్‌‌ఎంఎస్ (కేవలం పదవీ విరమణ కేసులు) ద్వారా ఫారం 6-ఏ నింపుతారని, ఈ-హెచ్ఆర్ఎంఎస్‌లో లేని అధికారులు భవిష్యలో ఫారం 6-ఏ నింపుతారని మంత్రి వివరించారు. పెన్షనర్ సింగిల్ ఈ-సైన్ (ఆధార్ ఆధారిత ఓటీపీ)తో ఫారం సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.

పెన్షనర్లకు వివిధ ఫారాలను నింపే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, సంక్లిష్టతను తగ్గించడానికి, అవసరమైన సమయాన్నీ, శ్రమనీ గణనీయంగా తగ్గించడానికి ఈ నూతన ఏకీకృత ఫారం రూపొందించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పెన్షనర్ల అనుకూల విధానం లక్షలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని, వారి పెన్షన్ సంబంధిత విషయాలను మరింత సులభంగా, సౌలభ్యంతో నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.


వృద్ధులకు సాధికారత కల్పించడం, వారి విజ్ఞత, అనుభవాన్ని దేశాభివృద్ధికి వినియోగించాలన్న దార్శనికతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వృద్ధుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే వ్యవస్థలను సరళీకరించడానికి, మెరుగుపరచడానికి, ప్రభుత్వ నిరంతర ప్రయత్నాలకు ఈ తాజా చొరవ నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

వృద్ధులు వారి విలువైన కాలాన్ని గౌరవప్రదంగా, మనశ్శాంతితో ఆస్వాదించేలా చూడటానికి ప్రభుత్వం ఇటువంటి సంస్కరణలను అమలు చేస్తూ అంకితభావాన్ని చూపుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు, అదే సమయంలో వారు "వికసిత్ భారత్" కల సాకారానికి కూడా దోహదపడతారని ఆయన అన్నారు.

 

***


(Release ID: 2050519)