నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అధిక డిమాండ్, సంప్రదాయేతర వృత్తుల్లో కౌమార బాలికలు, మహిళలకు సాధికారత కల్పించే ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్ట్


ప్రాజెక్ట్ కింద నైపుణ్య శిక్షణ అమలుకు సిద్ధం చేసేలా శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులకు ఎంఎస్ డీఈ, ఎండబ్ల్యూసీడీ నిర్దేశక సదస్సు

Posted On: 28 AUG 2024 5:37PM by PIB Hyderabad

కౌమార బాలికలు, మహిళల సాధికారత లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ (ఎంఎస్డీఈ), మహిళా శిశు సంక్షేమ శాఖ (ఎండబ్ల్యూసీడీ) కలిసి 9 రాష్ట్రాల్లోని 27 అభిలషణీయ జిల్లాల్లోనూ, మరికొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నిర్దేశక సదస్సుల్ని నిర్వహించాయి. దీనిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా (పైలట్)

ఈ రెండు మంత్రిత్వ శాఖలూ ఈ సదస్సును నిర్వహించాయి.  

శ్రామిక శక్తిలో ప్రవేశించదలచుకున్న మహిళలు ఎదుర్కొంటున్న అవరోధాలను పరిష్కరించడానికి దీని ద్వారా కృషి చేస్తారు. సీడీపీవోలకు సామర్థ్య నిర్మాణ సదస్సులు, ఈ ప్రాజెక్టు కోసం వారిని సిద్ధం చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగం.  ప్రయోగాత్మక కార్యక్రమ ఫలితాలను బట్టి, దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తారు.

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 కింద శిక్షణ ఇస్తారు. దాదాపు 4000 మందికి లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యం. డిజిటల్, అధునాతన నైపుణ్యాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ సంప్రదాయేతర, డిమాండు ఎక్కువగా ఉన్న ఉద్యోగాల శిక్షణపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. అంతేకాకుండా కౌన్సెలింగ్, కెరీర్ మార్గనిర్దేశం, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, ఉద్యోగ నియామక సహాయం సహా సమగ్ర చేయూతను  కార్యక్రమం అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ-కామర్స్ వేదికలకు అనుసంధానతను సులభతరం చేయడంతో పాటు, పోష్ (లైంగిక వేధింపుల నివారణ)పై అవగాహన కల్పిస్తుంది. దాంతోపాటు  పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో (ఐటీఐలు) మహిళల నమోదును పెంచుతుందని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారి మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా కౌమార బాలికలు, మహిళల సాధికారత కోసం చేపట్టిన మా కార్యక్రమంలో ఈ నిర్దేశక కార్యక్రమం కీలకమైన దశ. సంప్రదాయేతర, డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉద్యోగ రంగాల్లో వారికి నైపుణ్యాలను అందించి శ్రామిక శక్తికోసం సిద్ధం చేయడమే కాకుండా; స్వావలంబనతో కూడిన స్వతంత్ర జీవితాలను గడిపేలా వారిని తీర్చిదిద్దుతున్నాం. మహిళా, శిశు సంక్షేమ శాఖతో మా సమన్వయం ప్రతి మహిళకు భరోసా కల్పించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దేశ వృద్ధి, శ్రేయస్సుకు అర్ధవంతంగా వారు దోహదపడేలా ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తాం’’ అన్నారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ మాట్లాడుతూ ‘‘మహిళల అభివృద్ధిపైనే దృష్టిపెట్టడం కాకుండా, మహిళల నేతృత్వంలో అభివృద్ధి దిశగా మళ్లాలని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంగా నిర్దేశించారు. దేశ పురోగతి గమనంలో మహిళలు ముందంజలో ఉండాలన్నది మా ఆకాంక్ష. ఈ దార్శనికత మన భవితను నిర్దేశిస్తుంది. మహిళలు సాధికారులై, తమ పూర్తి సామర్థ్యం మేరకు శ్రామిక శక్తిలో భాగస్వామ్యానికి ముందుకొస్తే ఇది సాకారమవుతుంది. చెల్లింపులు జరిగే, అధికారిక ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎక్కువ ఉండాలన్న సూత్రంపై ఈ కార్యక్రమాన్ని నిర్మించాం. అది ప్రస్తుతం 37%గా ఉంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా దానిని 60 శాతానికి పెంచడం మన ముందున్న లక్ష్యం. ఆ దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలు, మహిళల జీవితాలను మార్చగల సామర్థ్యం ఈ కార్యక్రమానికి ఉంది’’ అని అన్నారు.  

శ్రామిక భాగస్వామ్యంలో లింగపరమైన అంతరాన్ని పూడ్చడానికీ, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా మహిళల సమర్థతను పెంచడానికీ ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమం. స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేసుకుని ఇంటర్న్ షిప్, అప్రెంటిస్ షిప్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆచరణాత్మక శిక్షణను అందిస్తారు.

27 అభిలషణీయ జిల్లాలు, 60+ శిక్షణ కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న పీఎంకేకే, జేఎస్ఎస్ కేంద్రాలు, ప్రభుత్వ విద్యా సంస్థలను ఉపయోగించుకుని ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 కింద ఈ శిక్షణ నిర్వహిస్తారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలందరికీ రవాణా సాయం కోసం నెలకు రూ .1,000 ప్రత్యేకంగా కేటాయిస్తారు. శ్రామిక శక్తి భాగస్వామ్యంలో లింగపరమైన అంతరాన్ని పూడ్చడానికి, మహిళల అపారమైన సామర్థ్యాన్ని వెలికితీసి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడానికి కీలకమైన ముందడుగుగా ఈ కార్యక్రమాన్ని చెప్పవచ్చు.

స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. అందులో నిర్దిష్ట శిక్షణ విభాగాలు, కోర్సు ఆవిష్కరణ; ఆర్థిక, నిధుల సంబంధిత సేవలు; అంచనాలు అందుబాటులో ఉంటాయి.

సంప్రదాయేతర, డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉద్యోగ రంగాల్లో  కార్యక్రమం శిక్షణ అందిస్తుంది. కౌన్సెలింగ్, కెరీర్ మార్గనిర్దేశం, ఉద్యోగ నియామక సహకారం సహా సమగ్ర చేయూతనందిస్తూ డిజిటల్, అధునాతన నైపుణ్యాభివృద్ధిపై ఇది దృష్టి పెడుతుంది. ఇంటర్న్ షిప్, అప్రెంటీస్ షిప్ కోసం స్థానిక సంస్థలతో సమన్వయం కూడా ఇందులో ఉంటుంది. ఇది శ్రామిక శక్తిలో భవిష్యత్ భాగస్వాములు కాబోతున్న వారికి ఆచరణాత్మక అవగాహన కలిగిస్తుంది. 

 

****


(Release ID: 2049599) Visitor Counter : 55