వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎంఎస్ఎంఈలు దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయి, దేశంలో లక్షలాది మందికి ఉపాధి అందిస్తాయి, ఇవి పెద్ద పరిశ్రమలకు ముఖ్యమైన సరఫరాదారులు : శ్రీ పీయూష్ గోయల్
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌లు ఎంఎస్ఎంఈలను దేశం వెలుపల నుండి న్యాయ విరుద్ధమైన పోటీ నుండి రక్షిస్తాయి: శ్రీ గోయల్
Posted On:
24 AUG 2024 3:31PM by PIB Hyderabad
‘‘ఎంఎస్ఎంఈని కేవలం ఒక చిన్న సంస్థగా చూడకూడదు, వాటి పట్ల ఆలోచన చులకనగా లేదా ప్రతికూలంగా ఉండకూడదు, ఎందుకంటే ఎంఎస్ఎంఈలు ఒక శక్తిమంతమైనవి, అవి విజయవంతమయ్యాయి, అవి దేశానికి బలం.. లక్షలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ, అవి దేశ నిర్మాణానికి దోహదపడుతున్నాయి’’ అని ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 10వ భారత అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్‌పో, సమ్మిట్ 2024లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
వినూత్న ఆలోచనలు, పనులు చేయడానికి కొత్త మార్గాలు ఎంచుకోవడం అన్నది ఎంఎస్ఎంఈల వ్యవస్థాపకుల లక్షణమని శ్రీ గోయల్ అన్నారు. పెద్ద పరిశ్రమలు, సంస్థల చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం వేలాది ఎంఎస్ఎంలతో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈలు లేకపోతే చుట్టూ ఉన్న వ్యవస్థ విజయవంతం కాలేదని తెలిపారు. ఎంఎస్ఎంఈలు పెద్ద పరిశ్రమలకు సరఫరాదారులు, కస్టమర్లుగా పనిచేస్తాయని అన్నారు.
ఎంఎస్ఎంఈలు దేశ పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, భారతదేశ ఎగుమతుల్లో పెద్ద వాటాను కలిగి ఉన్నాయని శ్రీ గోయల్ సూచించారు. ఈ రంగం వృద్ధి దేశానికి కీలకమని, ప్రభుత్వానికి దృష్టి పెట్టాల్సిన ముఖ్య రంగమని ఆయన అన్నారు. దేశ నిర్మాణానికి 140 కోట్ల మంది దేశప్రజలు కలిసికట్టుగా పని చేస్తే, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, అందరికీ శ్రేయస్సును అందించగలమని వాణిజ్య మంత్రి అన్నారు.
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ (క్యూసిఓ) ద్వారా ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి మద్దతు ఇస్తోందని శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. "ఎంఎస్‌ఎంఈలకు అవసరాలను తీర్చడానికి మేము సమయం ఇస్తున్నాం," అంటూ రెండు కారణాల వల్ల ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయని ఆయన అన్నారు. క్యూసిఓలు దేశం వెలుపల నుండి వింత ధరలకు దిగుమతి అయ్యే నాసిరకం వస్తువులను నిలిపివేస్తాయి. తద్వారా ఎంఎస్ఎంఈ రంగాన్ని న్యాయ విరుద్ధమైన పోటీ నుండి రక్షించినట్లు అవుతుంది. ఇక రెండోది ఎంఎస్ఎంఈలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు, అవి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి పోటీనిస్తాయి, లాభదాయకంగా మారతాయి. క్యూసీఓలు వివిధ రంగాలకు ఎలా ప్రయోజనం చేకూర్చాయి అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని ఆయన అన్నారు.
***
(Release ID: 2048831)
Visitor Counter : 61