ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ వైద్య నమోదు పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా
జాతీయ వైద్య రిజిస్టర్ అనేది భారత్ లో అలోపతి (ఎంబీబీఎస్) డాక్టర్లకు సంబంధించిన సమగ్ర, క్రియాశీల సమాచార నిధి
డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నేషనల్ హెల్త్ రిజిస్టర్ కీలక ముందడుగు: శ్రీ జేపీ నడ్డా
“పారామెడికల్, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల కూ ఇదే మాదిరి రిజిస్టర్ ప్రారంభించే దిశగా చర్యలు”
భారీ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను సృష్టించాలని యోచిస్తున్నాం, వైద్యుల డిజిటల్ నమోదు ఈ వ్యవస్థకు మూలాధారం: శ్రీమతి అనుప్రియా పటేల్
‘‘సంస్కరణ, ఆచరణ, పరివర్తన’’ అనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోంది; ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించే ప్రభుత్వ నిబద్ధతను నెరవేర్చే దిశలో ఎన్ఎంఆర్ కీలక చర్య: శ్రీ ప్రతాపరావ్ జాదవ్
Posted On:
23 AUG 2024 5:57PM by PIB Hyderabad
దేశంలో అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరి నమోదు కోసం జాతీయ వైద్య రిజిస్టర్ (ఎన్ఎంఆర్) పోర్టల్ ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ కార్యక్రమానికి హాజరవగా, మరో సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ వర్చువల్ గా పాల్గొన్నారు.
ఎన్ఎంసీ చట్టం, 2019 లోని సెక్షన్ 31 ప్రకారం జాతీయ వైద్య నమోదు (ఎన్ఎంఆర్) తప్పనిసరి. ఎన్ఎంసీకి చెందిన ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు (ఈఎంఆర్బీ) లైసెన్స్ పొందిన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి పేరు, చిరునామా, గుర్తింపు పొందిన అన్ని అర్హతలతో ఎలక్ట్రానిక్ రూపంలో జాతీయ రిజిస్టర్‌ను నిర్వహించాలని ఆ సెక్షన్ పేర్కొంటున్నది. భారతదేశంలో అలోపతి (ఎంబీబీఎస్) కింద నమోదైన వైద్యులకు సంబంధించి ఎన్ఎంఆర్ సమగ్ర, క్రియాశీల సమాచార నిధి. వైద్యుల ఆధార్ గుర్తింపుతో అనుసంధానం చేయడం ఎన్ఎంఆర్ ప్రత్యేకత. ఇది ఆ వ్యక్తి ప్రామాణికతను నిర్ధారిస్తుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ నడ్డా మాట్లాడుతూ, భారతదేశంలో అలోపతి (ఎంబీబీఎస్) కింద నమోదైన వైద్యుల కోసం సమగ్ర, క్రియాశీల సమాచార నిధి అయిన జాతీయ వైద్య రిజిస్టర్ ను రూపొందించినందుకు ఎన్ఎంసీ, జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ఏ)లను ఆయన అభినందించారు. “భారతదేశాన్ని సాంకేతికంగా పటిష్టంగా మార్చాలన్నది ప్రధాన మంత్రి దార్శనికత. ఆరోగ్య వ్యవస్థ కూడా సాంకేతికంగా దృఢంగా ఉంటే అది సాధ్యమవుతుంది. ఈ దిశలో ఎన్ఎంఆర్ కీలక ముందడుగు. డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఇది బలోపేతం చేసి, దేశ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను నిర్ధారిస్తుంది” అని ఆయన అన్నారు. పోర్టల్ లో నమోదు ప్రక్రియలో నిరంతర మెరుగుదలతో ఎన్ఎంర్ ను నవీకరించి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర వైద్య మండళ్ల పాత్ర గురించి వివరిస్తూ “జాతీయ వైద్య రిజిస్టర్ అభివృద్ధి, నిర్వహణలో రాష్ట్ర వైద్య మండళ్లు ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. అది నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుంది” అని నడ్డా అన్నారు. ‘‘వారి ప్రామాణీకరణ చర్యలు, ధ్రువీకరణ వేగం ఎన్ఎమ్ఆర్ విజయంలో కీలక అంశాలు; నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలంటే వాటి క్రియాశీల భాగస్వామ్యం అవసరం’’ అని ఆయన ఎస్ఎంసీలను అభ్యర్థించారు. పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం కూడా ఇలాంటి రిజిస్టర్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.
ఎన్ఎంఆర్ ను ప్రారంభించడాన్ని కీలకమైన సందర్భంగా అభివర్ణించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, జాతీయ వైద్య రిజిస్టర్ ఆవశ్యకత చాలా కాలం నుంచి ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా వైద్యులకు సంబంధించిన ప్రామాణిక సమాచారం కీలకం కావడంతో, ఎన్ఎంఆర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు వైద్యుల సమాచారం సరిగా అందుబాటులో లేదు. దానికి సవరణలు, నవీకరణ అవసరం. ఎన్ఎంఆర్ పోర్టల్ ఆ పని చేస్తుంది. సులభమైన నమోదు ప్రక్రియ ప్రామాణిక సమాచార నిర్వహణకు అవకాశం కల్పిస్తుంది. ఈ సమాచార ప్రామాణికత చాలా విలువైనది. ఎందుకంటే, భారత్ ఒక భారీ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను సృష్టించాలని భావిస్తోంది. ఆ దిశగా వైద్యుల డిజిటల్ నమోదు కీలకమైన మూలాధారం” అని ఆమె అన్నారు.
ఎన్ఎంఆర్ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ, ఎన్ఎంఆర్ పోర్టల్ దేశంలోని వైద్యులకు సంబంధించి క్రియాశీల, ప్రామాణిక, ఏకీకృత సమాచారాన్ని అందిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ తెలిపారు. పోర్టల్‌లో వేగవంతమైన, సులభమైన నమోదు ప్రక్రియ సకాలంలో సమాచార నవీకరణను సులభతరం చేస్తుందన్నారు. ఇది వైద్య నిపుణుల్లో పారదర్శకత, నాణ్యమైన సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుంది. పారదర్శకమైన పద్ధతిలో ధ్రువీకృత సమాచారాన్ని వారు పొందుతారు. ‘‘సంస్కరణ, ఆచరణ, పరివర్తన’’ అన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య రక్షణ సేవలందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నెరవేర్చే దిశలో ఎన్ఎంఆర్ ప్రారంభం ముఖ్యమైన అడుగు.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ “ఇప్పటి వరకు, దేశంలోని మొత్తం వైద్యుల సంఖ్య, దేశం విడిచి వెళ్లినవారు, లైసెన్స్ కోల్పోయినవారు, ప్రాణాలు కోల్పోయిన వైద్యుల సంఖ్య, వివరాల వంటి అంశాల్లో వివరణాత్మక, సమగ్ర సమాచారం లేదు. ఎన్ ఎంఆర్ ను ప్రారంభించడం ద్వారా 13లక్షలకు పైగా వైద్యుల సమాచారాన్ని అది అందించనుంది” అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆరోగ్య రక్షణ నిపుణుల రిజిస్ట్రీలో ఎన్ఎంఆర్ భాగంగా ఉంటుందని, వైద్య నిపుణుల అన్ని వివరాలు అందులో ఉంటాయని శ్రీ చంద్ర పేర్కొన్నారు.
జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ బీఎన్ గంగాధర్, అదనపు కార్యదర్శి, సీఈవో శ్రీమతి ఎల్.ఎస్. చాంగ్సన్, డీడీజీ (ఎంఈ), కార్యదర్శి డా. బి. శ్రీనివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి వి. హెకాలీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ పుష్పేంద్ర రాజ్ పుత్, జాతీయ ఆరోగ్య సంస్థ ఐడీ, ఎండీ (ఏబీడీఎమ్) సంయుక్త కార్యదర్శి శ్రీ కిరణ్ గోపాల్ వాస్కా, జాతీయ వైద్య కమిషన్ పీఎంఈబీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ ఓజా, జాతీయ వైద్య కమిషన్ ఈఎంఆర్బీ సభ్యురాలు డా. విజయలక్ష్మి నాగ్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య మండళ్ల ప్రతినిధులు వర్చువల్ గా పాల్గొన్నారు.
నేపథ్యం: దేశంలో అలోపతి (ఎంబీబీఎస్) కింద నమోదు చేసుకున్న వైద్యులకు సంబంధించి సమగ్ర క్రియాశీల సమాచారం ఎన్ఎంఆర్. వైద్యుల ఆధార్ గుర్తింపుతో అనుసంధానం చేయడం ఎన్ఎంఆర్ ప్రత్యేకత. ఇది వారి ప్రామాణికతను నిర్ధారిస్తుంది. ఎన్ఎంఆర్ లో నమోదు చాలా సరళమైన ఆన్లైన్ ప్రక్రియ. అన్ని వైద్య కళాశాలలు / సంస్థలు (జాతీయ ప్రాధాన్యం గలవి సహా), రాష్ట్ర వైద్య మండళ్లు పోర్టల్ తో అనుసంధానమై ఉంటాయి. కొన్ని వివరాలు ప్రజలకు కనిపిస్తాయి. ఇతర సమాచారం జాతీయ వైద్య కమిషన్ లోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు, రాష్ట్ర వైద్య మండళ్లు, జాతీయ పరీక్షల బోర్డు, వైద్య సంస్థలు (జాతీయ ప్రాధాన్యం గలవి సహా), నమోదు చేసుకుని వైద్య వృత్తిలో ఉన్నవారికి అవసరాలకు అనుగుణంగా మాత్రమే కనిపిస్తాయి.
నమోదు, అర్హత ఆధారాల వంటి అదనపు వివరాలను పోర్టల్ ద్వారా నేరుగా నమోదు చేసి సమర్పించవచ్చు. అనంతరం ధ్రువీకరణ కోసం ఆ దరఖాస్తును సంబంధిత రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తారు. తదుపరి సమీక్ష కోసం ఎస్ఎంసీ ఆ దరఖాస్తును సంబంధిత కళాశాల లేదా సంస్థకు పంపుతుంది. రాష్ట్ర వైద్య మండలి విజయవంతంగా ధ్రువీకరించిన అనంతరం ఆ దరఖాస్తును జాతీయ వైద్య కమిషన్ కు పంపుతారు. ఎన్ఎంసీ ధ్రువీకరణ తర్వాత ఒక ప్రత్యేకమైన ఎన్ఎంఆర్ ఐడీ జారీ అవుతుంది. ఈ ప్రక్రియలో, వైద్యులు ఆరోగ్య రక్షణ సేవకుల కింద నమోదును ఎంచుకోవడానికి అవకాశముంది. ఇది వారిని విస్తృత డిజిటల్ ఆరోగ్య రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తుంది.
ఈ పోర్టల్ ద్వారా ఎస్ఎంసీలు, విద్యా సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే వేదిక ద్వారా లాగిన్ అయి దరఖాస్తులను ధ్రువీకరించవచ్చు. అదనపు అర్హతల జోడింపు, దరఖాస్తుల స్థితిని గుర్తించడం, లైసెన్సుల రద్దు, ఎన్ఎంఆర్ గుర్తింపు కార్డులు, వైద్య ధ్రువీకరణ పత్రాల జారీ వంటి వివిధ లక్షణాలు ఎన్ఎంఆర్ పోర్టల్ లో ఉంటాయి. పోర్టల్ ను మెరుగుపరచడం సహా భవిష్యత్తులో ఎన్ఎంఆర్ అభివృద్ధికి జాతీయ వైద్యమండలి చేయూతనిస్తుంది. ఇందులో తర్వాతి సాఫ్ట్ వేర్ తో ప్రత్యక్ష సమీకరణ, వైద్య విద్య కొనసాగింపు, క్రెడిట్ పాయింట్లు ఉంటాయి.
ఇప్పటికే భారత వైద్య రిజిస్టర్ (ఐఎంఆర్)లో నమోదు చేసుకున్న ఎంబీబీఎస్ వైద్యులందరూ మళ్లీ ఎన్ఎంసీ ప్రారంభించిన ఎన్ఎంఆర్ లో నమోదు చేసుకోవాలి. నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి సదరు డాక్టరు డిగ్రీ (ఎంబీబీఎస్) ధ్రువీకరణ పత్రం, మొదటిసారి నమోదు చేసుకున్న రాష్ట్ర వైద్య మండలి/ భారత వైద్య మండలి నమోదు ధ్రువీకరణ పత్రాల డిజిటల్ నకళ్లను అందుబాటులో పెట్టుకోవాలి. ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే వైద్యుడు తన ఆధార్ సంఖ్యను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎన్ఎంఆర్ లో నమోదు కోసం లింక్ https://nmr-nmc.abdm.gov.in/nmr/v3/
***
(Release ID: 2048824)
Visitor Counter : 72