ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత ఆహార భద్రత-ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) కేంద్రీయ సలహా సంఘం (సిఎసి) 44వ సమావేశం
ఆహార భద్రత మౌలిక సదుపాయాల బలోపేతం.. పురుగుమందుల వాడకం నివారణ ప్రాధాన్యంపై నిశితంగా దృష్టి సారిస్తూ చర్చ;
ఆహార భద్రత సమస్యల పరిష్కారం దిశగా ‘ఎఫ్‌ఎస్ఒ’ పోస్టుల భర్తీ.. తనిఖీ లేబొరేటరీల ఉన్నతీకరణ వంటి తక్షణ చర్యలపై సీఈవో ఆదేశాలు
Posted On:
23 AUG 2024 7:10PM by PIB Hyderabad
భారత ఆహార భద్రత-ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) ‘సీఈవో’ శ్రీ జి.కమలవర్ధన రావు అధ్యక్షతన 2024 ఆగస్టు 22, 23 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) కేంద్రీయ సలహా సంఘం (సిఎసి) 44వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో మితిమీరిన పురుగుమందుల వాడకం సమస్య పరిష్కారం దిశగా అంతర-మంత్రిత్వశాఖల కమిటీ ఏర్పాటుపై సమావేశం లోతుగా చర్చించింది. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి కమిటీ ఏర్పాటు ద్వారా రైతుల స్థాయిలోనే పురుగుమందుల వాడకం తగ్గింపుపై దృష్టి పెట్టాలని ‘ఎఫ్ఎస్ఎస్ఎఐ’ ‘సీఈవో’ ప్రతిపాదించారు. అలాగే నియంత్రణ-పర్యవేక్షణకు తగిన వ్యూహాలను కూడా రూపొందించాలని సూచించారు. సురక్షిత, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆహారంలో పురుగుమందు అవశేషాలవల్ల ప్రజారోగ్యానికి వాటిల్లే ముప్పు నుంచి వినియోగదారులకు రక్షణనివ్వడం దీని లక్ష్యం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర జోనల్ కౌన్సిల్ సమావేశాల ప్రాధాన్యాన్ని కూడా శ్రీ రావు ఉద్ఘాటించారు. సంస్థలో ఖాళీగా ఉన్న ఆహార భద్రత అధికారుల (ఎఫ్ఎస్ఒ), డిజిగ్నేటెడ్ అధికారుల (డిఒ) పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆహార ప్రమాణ పరీక్ష లేబొరేటరీల తక్షణ ఉన్నతీకరణ అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే పరీక్ష సామర్థ్యాల పెంపు దిశగా కొత్త మైక్రోబయాలజీ లేబొరేటరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
సంచార ఆహార భద్రత పరీక్ష లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌డబ్ల్యు)ల ఏర్పాటు కోసం ఆయా రాష్ట్రాల్లో కీలక ప్రదేశాలను గుర్తించడం అవశ్యమని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులలో అవగాహన పెంపుసహా ఆహార భద్రత పద్ధతులపై ముఖ్యమైన సమాచారం ఇవ్వడంలోనూ ‘ఎఫ్‌ఎస్‌డబ్ల్యు’లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆధునిక పరీక్ష పరికరాలు-ర్యాపిడ్ కిట్‌లతో కూడిన ఈ వాహనాలు నిబంధనల మేరకు ఆహార భద్రత/నాణ్యత ప్రమాణాల అనుసరణను త్వరగా అంచనా వేస్తాయని తెలిపారు. ఆహార పరీక్ష ఫలితాలు కొన్ని గంటల్లోనే వెల్లడి కాగలవని చెప్పారు. దీంతో తక్షణ ప్రజా వినియోగం దిశగా ఆహార ఉత్పత్తుల భద్రతకు భరోసా ఇస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టే వీలుంటుందన్నారు.
సమావేశంలో చివరగా- ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యంతో దేశ ప్రజలందరికీ సురక్షిత-పౌష్టికాహార లభ్యత దిశగా తమతోపాటు భాగస్వామ్య వ్యవస్థలన్నీ నిబద్ధతతో సమష్టిగా కృషి చేస్తాయన్న హామీని ‘ఎఫ్ఎస్ఎస్ఎఐ’ ‘సీఈవో’ పునరుద్ఘాటించారు.
ఆహార భద్రత కమిషనర్లు (సిఎఫ్ఎస్), రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, ‘ఎఫ్ఎస్ఎస్ఎఐ’ సీనియర్ అధికారులు, ఆహార పరిశ్రమ, వ్యవసాయ రంగ భాగస్వాములు తదితరులు 50 మందికిపైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఆహార భద్రత రంగం మెరుగుకు మార్గాన్వేషణ సహా తదనుగుణ చర్యల అమలును ‘ఎఫ్ఎస్ఎస్ఎఐ’ పర్యవేక్షిస్తుంది.
***
(Release ID: 2048540)
Visitor Counter : 132