కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

"భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం"పై 7వ టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ


కేర్ ఎకానమీలో.. మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే అవకాశం

మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిరంతర వెబినార్లు, వర్క్‌ షాపులు నిర్వహించనున్న పరిశ్రమ సంఘాలు

Posted On: 23 AUG 2024 7:38PM by PIB Hyderabad

"భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం"పై 7వ టాస్క్ ఫోర్స్ సమావేశం 2024 ఆగస్టు 23వ తేదీన న్యూఢిల్లీలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ (ఎల్ అండ్ ఇ) కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షత వహించారు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన ప్రారంభోపన్యాసంలో, శ్రామికశక్తిలో మహిళల పాత్ర అనివార్యమని స్పష్టం చేశారు, వారి భాగస్వామ్యం ఆర్థికవృద్ధికి తోడ్పాటునందించడంతో పాటు అన్ని రంగాలలో పనిచేసే చోట వైవిధ్యాన్ని పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు.

క్రియాశీలమైన, అర్థవంతమైన మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించడం శక్తిమంతమైన, వినూత్నమైన, సమసమాజ నిర్మాణం కోసం, అవసరమైన సామాజిక న్యాయం అలాగే ఆర్థిక, వ్యూహాత్మక ఆవశ్యకతలు రెండింటికీ సంబంధించిన అంశం అని ఆమె నొక్కిచెప్పారు.

 

శ్రామిక శక్తిలో చేరే మహిళలకు మద్దతుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ అమలు చేయగల కార్యక్రమాలను సిఫార్సు చేయడంలో ఆచరణాత్మక విధానాన్ని అనుసరించాలని శ్రీమతి దావ్రా టాస్క్‌ ఫోర్స్ కు సూచించారు. మహిళలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో రాణిస్తున్న కంపెనీలను గుర్తించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆమె పరిశ్రమ సంఘాలను కోరారు.

ఈ సమావేశం భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం యొక్క ప్రస్తుత స్థితిని గురించి చర్చించడానికి, ఈ విషయంలో కీలక సవాళ్లను గుర్తించి, అభివృద్ధి చేయు సంభావ్య వ్యూహాలను అన్వేషించడానికి వైదికైంది. ఈ చర్చల ద్వారా, మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కేర్ ఎకానమీ అత్యంత అవకాశం గల రంగం అని టాస్క్ ఫోర్స్ గుర్తించింది. మహిళలకు మంచి ఉద్యోగాలను కల్పించేందుకు మద్దతుగా సెక్టోరల్ విధానాన్ని అనుసరించడం గురించి కూడా చర్చించారు.

 

ఆర్థిక కార్యకలాపాల్లో మహిళా భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకు గానూ యజమానులకు అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహించడానికి నిరంతర వెబినార్లు, వర్క్ షాపులు నిర్వహించాలని పరిశ్రమ సంఘాలకు టాస్క్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో యజమానులు అనుసరించిన అత్యుత్తమ విధానాల సంకలనాన్ని కూడా సిఐఐ అందించింది.

 

మొబిలిటీ అలాగే మెరుగైన ప్రజా రవాణాకు సంబంధించి; ఉపాధి మెరుగుదల; కమ్యూనికేషన్ ప్రచారాలు; అలాగే సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి స్వయం ఉపాధి గల మహిళలు, అసంఘటిత రంగంలోని మహిళలకు సహాయం చేయడం వంటి ప్రధాన వ్యూహాలను గురించి టాస్క్ ఫోర్స్ చర్చించింది. తయారీ, డొమెస్టిక్ వర్క్, ఇ-కామర్స్, సేవలు, ఎమ్ఎస్ఎమ్ఇ మొదలైన రంగాలలో పనిచేస్తున్న మహిళల గురించి ఈ సందర్భంగా చర్చించారు.

 

ఈ సమావేశంలో చర్చించిన వ్యూహాలు శ్రామికశక్తిలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో అలాగే ఆయా రంగాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ తుది నివేదిక మూడు నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

 

భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), స్వయం ఉపాధి మహిళా సంఘం (ఎస్ఇడబ్ల్యూఏ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎమ్ఎస్), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎస్‌పిఐ), ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఎ) అలాగే వి.వి. గిరి జాతీయ కార్మిక సంస్థ (వి.వి.జి.ఎన్.ఎల్.ఐ.) ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య విశ్లేషణ, ఉపాధి పొందడంలో మహిళలు ఎదుర్కొంటున్న అడ్డంకులు, సవాళ్లను పరిష్కరించడంలో వ్యూహాత్మక సూచనలను గుర్తించడం, సూచనలు చేయడం వంటివి టాస్క్ ఫోర్స్ అందించిన నిర్ధిష్టమైన నిబంధనల్లో భాగంగా ఉన్నాయి.

 

***



(Release ID: 2048539) Visitor Counter : 54


Read this release in: English , Urdu , Hindi , Tamil