కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘పిఎం-వాణి’ పథకం నియంత్రణ చట్రంపై టెలికమ్యూనికేషన్ టారిఫ్ సవరణ ముసాయిదా ఆదేశాలు జారీచేసిన ‘ట్రాయ్’
Posted On:
23 AUG 2024 7:04PM by PIB Hyderabad
‘‘పిఎం-వాణి’’ పథకం నియంత్రణ చట్రంపై ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) ఇవాళ ‘‘టెలికమ్యూనికేషన్ టారిఫ్ (70వ సవరణ) ఆర్డర్-2024 ముసాయిదాను జారీ చేసింది.
దేశంలో బలమైన డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2022 నాటికి కోటి ‘పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్’లను ఏర్పాటు చేయాలని ‘కనెక్ట్ ఇండియా’ కార్యక్రమం కింద రూపొందించిన జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ల విధానం-2018 (ఎన్‌డిసిపి) లక్ష్య నిర్దేశం చేసింది. అంతేకాకుండా ‘భారత్ 6జి విజన్’ కూడా 2022 నాటికి కోటి ‘పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్’ల ఏర్పాటును నిర్దేశించింది. మరోవైపు ‘డిజిటల్ ఇండియా-2030 మొబైల్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ విధానం’ దేశంలో 2030 నాటికి ‘పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్’ల సంఖ్యను 5 కోట్లకు చేర్చే లక్ష్యాన్ని నిర్ణయించింది. అయినప్పటికీ ‘ఎన్‌డిసిపి-2018’, ‘భారత్ 6జి విజన్’ పత్రాలు నిర్దేశించిన మేరకు ‘పిఎం-వాణి హాట్‌స్పాట్’ల సంఖ్య ప్రస్తుతం లక్ష్యానికి చాలా దూరంలో ఉంది.
ఈ నేపథ్యంలో ‘పిఎం-వాణి’ పథకం విస్తరణ నిర్దేశిత లక్ష్యాలతో పోలిస్తే అత్యంత పరిమిత స్థాయిలోనే ఉందంటూ ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’ (డిఒటి) 2022 నవంబరులో ‘ట్రాయ్’కి రాసిన లేఖలో పేర్కొంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పిడిఒ) నుంచి ‘బ్యాక్‌హాల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ’ సదుపాయం కల్పించే ‘టెలికాం సేవా ప్రదాన సంస్థ (టిఎస్‌పి)లు, ఇంటర్నెట్ సేవాప్రదాన సంస్థ (ఐస్‌పి)లు వసూలు చేసే రుసుము అధికంగా ఉండటమే ఇందుకు కారణమని కూడా పేర్కొంది. మరోవైపు వాణిజ్య ఒప్పందాల సాకుతో సాధారణ ‘ఫైబర్-టు-ది-హోమ్’ (ఎఫ్‌టిటిహెచ్) బ్రాడ్‌బ్యాండ్‌కు బదులు ఖరీదైన ‘ఇంటర్నెట్ లీజ్డ్ లైన్’ (ఐఎల్ఎల్) ద్వారా ‘పబ్లిక్ వైఫై యాక్సెస్ పాయింట్ల’ను అనుసంధానించాలని ‘టిఎస్‌పి/ఐఎస్‌పి’లు తరచూ ‘పిడిఒ’లపై ఒత్తిడి తెస్తున్నట్లు ‘డిఒటి’ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో సమస్యలను విశ్లేషించిన అనంతరం ‘పిఎం-వాణి’ పథకం విస్తరణను వేగిరపరచే దిశగా ‘పిడిఒ’లకు బ్రాడ్‌బ్యాండ్ సంధాన ధరను హేతుబద్ధీకరించాల్సి ఉందని ‘ట్రాయ్’ అభిప్రాయపడింది. ఆ మేరకు ‘పిఎం-వాణి’ పథకం కింద ‘పిడిఒ’లకు విధించే రుసుమును రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ (ఎఫ్‌టిటిహెచ్) కనెక్షన్లకు వర్తించే విధంగా నిర్ణయించాలని ప్రతిపాదించింది.
దీనికి సంబంధించి రూపొందించిన సవరణ ముసాయిదా ఆదేశాలను తమ వెబ్‌సైట్ (www.trai.gov.in)లో ఉంచింది. దీనిపై భాగస్వామ్య సంస్థలు 2024 సెప్టెంబర్ 6లోగా తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా పంపాలని సూచించింది. అలాగే దీనిపై వ్యతిరేకత ఉన్నట్లయితే తమ సలహాదారు (ఫైనాన్స్ అండ్ ఎకనమిక్ అనాలిసిస్-ఎఫ్ అండ్ ఇఎ) శ్రీ అమిత్ శర్మకు 2024 సెప్టెంబర్ 13లోగా ఎలక్ట్రానిక్ రూపంలో fa@trai.gov.in చిరునామాకు మెయిల్ పంపాలని కోరింది.
***
(Release ID: 2048524)
Visitor Counter : 77