కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ పై సిఫారసులు విడుదల చేసిన ట్రాయ్
Posted On:
21 AUG 2024 7:23PM by PIB Hyderabad
భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ పై సిఫార్సులు విడుదల చేసింది. 08.12.2022 నాటి లేఖ ద్వారా ట్రాయ్ చట్టం, 1997లోని సెక్షన్ 11(1)(a) (సవరించిన విధంగా) ప్రకారం – లైసెన్సు ఇవ్వని, లేదా లైసెన్సు రద్దయి- ఉపయోగించకుండా ఉన్న, లేదా పరిమితగా వాడిన - టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ కు పరిమిత కాలానికి డిమాండును సృష్టించేందుకు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) కోరింది. టెరా హెర్ట్జ్ రేంజ్ లో పరిమిత కాలానికి డిమాండును సృష్టించేందుకు ఉపయోగించని, లేదా పరిమితంగా ఉపయోగించిన, లైసెన్సు ఇవ్వని, లేదా లైసెన్సు రద్దయిన స్పెక్ట్రం బ్యాండ్ల వినియోగంపై 2023 సెప్టెంబరు 27న భాగస్వాముల అభిప్రాయాలు, ప్రతివాదనలను కోరుతూ సంస్థ ఒక సంప్రదింపు పత్రాన్ని జారీ చేసింది. దీనిపై 17 మంది భాగస్వాములు వ్యాఖ్యానించగా, ఇద్దరు భాగస్వాములు ప్రతివ్యాఖ్యానాలు అందించారు. సంప్రదింపుల పత్రంపై 08.03.2024న వర్చువల్ విధానంలో బహిరంగ చర్చ జరిగింది.
సంప్రదింపుల ప్రక్రియలో భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాలు, తన సొంత విశ్లేషణ ఆధారంగా టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ సిఫార్సులను ట్రాయ్ ఖరారు చేసింది. సిఫార్సుల్లోని ముఖ్యాంశాలు:
- 95 గిగా హెర్ట్జ్ నుంచి 3 టెరాహెర్ట్జ్ పరిధిలో స్పెక్ట్రమ్‌కు ‘టెరా హెర్ట్జ్ ప్రయోగాత్మక అధీకృత సంస్థ’ (సంక్షిప్తంగా టీహెచ్ఈఏ) పేరుతో కొత్త ప్రయోగాత్మక అధికార వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టాలి.
- టీహెచ్ ఈఏ అధీకృత ఛట్రంలోని ప్రధాన అంశాలు:
- ప్రయోజనం: 95 గిగాహెర్ట్జ్ నుంచి 3 టెరా హెర్ట్జ్ పరిధిలో ఆర్ అండ్ డీ, ఇండోర్-అవుట్‌డోర్ పరీక్ష, సాంకేతిక పరిశీలన, ప్రయోగాలు, ప్రదర్శనను ప్రోత్సహించడం టీహెచ్ఈఏ ఉద్దేశంగా ఉండాలి.
- పరిధి: 95 గిగాహెర్ట్జ్ నుంచి 3 టెరా హెర్ట్జ్ పరిధిలో ఆర్ అండ్ డీ, ఇండోర్-అవుట్‌డోర్ పరీక్షలు, సాంకేతిక పరిశీలన, ప్రయోగాలు, ప్రదర్శనను ప్రోత్సహించడం; దాంతో పాటు ప్రత్యక్ష విక్రయం ద్వారా 95 గిగా హెర్ట్జ్ నుంచి 3 టెరాహెర్ట్జ్ పరిధిలో పని చేసేలా రూపొందిన ప్రయోగాత్మక పరికరాల విక్రయ బాధ్యతలు దీని పరిధిలో ఉంటాయి.
- అర్హత: ఏదైనా భారతీయ సంస్థ (విద్యాసంస్థ, పరిశోధన-అభివృద్ధి ప్రయోగశాల, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్రపాలిత ప్రాంతం, సాంకేతిక పార్క్, టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్, ఇంక్యుబేటర్, మౌలిక పరికరాల తయారీదారులు మొదలైనవి) టీహెచ్ఈఏను పొందడానికి అర్హమైనది.
- ప్రయోగాత్మక పరికరాల మార్కెటింగ్: 95 గిగాహెర్ట్జ్ నుంచి 3 టెరా హెర్ట్జ్ పరిధిలో పనిచేసేలా రూపొందించిన ప్రయోగాత్మక పరికరాల మార్కెటింగ్ ను ప్రత్యక్ష విక్రయం ద్వారా టీహెచ్ఈఏ కింద అనుమతించాలి.
- అనుమతి సమయం: టీహెచ్ఈఏ అనుమతి వ్యవధి ఐదేళ్లుగా ఉండాలి. ఈ అనుమతిని ఒకసారి ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు.
- అనుమతి రుసుము: టీహెచ్ఈఏ అనుమతి రుసుము ఐదేళ్ల కాలానికి వెయ్యి రూపాయలుగా ఉండాలి.
- భారతదేశంలో 116-123 గిగాహెర్ట్జ్, 174.8-182 గిగాహెర్ట్జ్, 185-190 గిగాహెర్ట్జ్, 244-246 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో అనుమతి, కేటాయింపుల- మినహాయింపు కార్యకలాపాలను అనుమతించాలి.
- భారతదేశంలో ఆటోమోటివ్ రాడార్ వ్యవస్థల అనుమతి, కేటాయింపుల- మినహాయింపు కార్యకలాపాల కోసం 77-81 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పరిధిని అందుబాటులోకి తేవాలి.
సంస్థ సిఫార్సు చేసిన టెరా హెర్ట్జ్ ప్రయోగాత్మక అనుమతి (టీహెచ్ఈఏ) టెరా హెర్ట్జ్ బ్యాండ్ లో వినూత్నమైన కొత్త సాంకేతికతలు, సేవల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలను ప్రోత్సహిస్తుంది. భావన, అభివృద్ధి, రూపకల్పన దశల్లో టెరా హెర్ట్జ్ బ్యాండ్ లోని ఉత్పత్తుల పనితీరు మదింపు ప్రయోగాలకు టీహెచ్ఈఏ సహాయపడుతుంది. ఇది టెరా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ పై నిర్మించిన సాంకేతికతలు, సేవల సాంకేతిక సాధ్యతను నిర్ధారించడానికి మార్గం సుగమం చేస్తుంది. సంస్థ సిఫారసు చేసిన కొత్త ప్రయోగాత్మక అనుమతి విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలకు సహాయం లభిస్తుంది.
116-123 గిగాహెర్ట్జ్, 174.8-182 గిగాహెర్ట్జ్, 185-190 గిగాహెర్ట్జ్, 244-246 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల అనుమతి, కేటాయింపు- మినహాయింపు వినియోగాన్ని అనుమతించడం ఇండోర్ లేదా అవుట్ డోర్- రెండువిధాలా ఉపయోగించగల తదుపరి తరం వైర్ లెస్ సాంకేతికతలకు దోహదపడుతుందని అథారిటీ అభిప్రాయపడింది. అవి ఒక మీటరు నుంచి కొన్ని వందల మీటర్ల కన్నా తక్కువ దూరాలలో పనిచేయగలవని, అంతేకాకుండా సామర్థ్యంలో పెరుగుదలతో పాటు ఇప్పటికే వినియోగంలో ఉన్న, ఉద్భవిస్తున్న వినియోగ అంశాల్లో విశ్వసనీయతను పెంచుతాయని అథారిటీ అభిప్రాయం. ఈ బ్యాండ్‌ల విడుదల వల్ల వివిధ రకాల వినూత్న అవసరాలకు దోహదపడుతుంది. నిర్దేశిత సేవలందించే పరిశ్రమల కార్యకలాపాలు, వృద్ధిని గణనీయంగా మెరుగురుస్తుంది.
వాహన రాడార్లు తక్కువ దృశ్యమాన పరిస్థితుల్లో లేదా చీకటి ప్రదేశాల్లో వస్తువులను గుర్తించడంలో డ్రైవర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వాహనం ముందు, బయట లేదా వెనుక ఉన్న వస్తువుల దూరం, వేగాన్ని సాపేక్షంగా నిర్ణయించగలవు. దీర్ఘశ్రేణి వాహన రాడార్లు (ఎల్ఆర్ఆర్ లు) ఒక గిగాహెర్ట్జ్ వరకూ బ్యాండ్ విడ్త్ ను వినియోగించి, సాధారణంగా 0.5 మీటర్ల పరిధి ప్రాదేశిక స్పష్టతను అందిస్తాయి. వాహన రాడార్ పరిశ్రమ 4 గిగాహెర్ట్జ్ వరకూ బ్యాండ్ విడ్త్ వినియోగించగల స్వల్పశ్రేణి వాహన రాడార్ (ఎస్ఆర్ఆర్) అనువర్తనాలను కూడా అభివృద్ధి చేసింది. అది సాధారణంగా 0.1 మీటర్ల పరిధిలో ఎల్ఆర్ఆర్ కన్నా అధిక ప్రాదేశిక స్పష్టతను అందిస్తుంది. అంతర్జాతీయంగా, 77 గిగాహెర్ట్జ్ నుంచి 81 గిగాహెర్ట్జ్ బ్యాండ్ లో పనిచేసే ఎస్ఆర్ఆర్ యూనిట్లు అనేక అనువర్తనాల ద్వారా రోడ్డు వినియోగదారుల క్రియాత్మక, పరోక్ష భద్రతను మెరుగుపరుస్తున్నాయి. అడ్డంకులను గుర్తించడం, ప్రమాద హెచ్చరిక, వీధుల్లో ప్రయాణ హెచ్చరికలు, వీధులు మారడంలో సాయం, చీకటి ప్రదేశాల గుర్తింపు, పార్కింగ్ సాయం, ఎయిర్ బ్యాగులు సిద్ధం చేయడం వంటి అంశాలు పరోక్ష భద్రతను పెంచే అనువర్తనాల్లో ఉంటాయి. ఈ విధులన్నిటినీ కలిపి కార్లకు ‘సేఫ్టీ బెల్ట్’గా పేర్కొన్నారు. స్వల్ప శ్రేణి వాహన రాడార్ (ఎస్ఆర్ఆర్) అనువర్తనాలు డ్రైవర్లు, ఇతర రోడ్డు వినియోగదారుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తున్న దృష్ట్యా, భారతదేశంలో ఆటోమోటివ్ రాడార్లకు 77-81 గిగాహెర్ట్జ్ బ్యాండ్ అనుమతి, కేటాయింపుల- మినహాయింపు కార్యకలాపాలను అనుమతించాలని అథారిటీ సిఫార్సు చేసింది.
ఈ సిఫార్సులు ట్రాయ్ వెబ్ సైట్ (www.trai.gov.in)లో అందుబాటులో ఉన్నాయి. స్పష్టత/సమాచారం కోసం ట్రాయ్ సలహాదారు (నెట్ వర్కులు, స్పెక్ట్రం) శ్రీ అఖిలేశ్ కుమార్ త్రివేదిని +91-11-20907758 నంబరుపై టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
***
(Release ID: 2048388)
Visitor Counter : 43