వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పంటల ఉత్పత్తి సంబంధిత గణాంకాలలో మెరుగుదల గురించి చర్చించడానికి రాష్ట్రాలతో జాతీయ సమావేశాన్ని న్యూ ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన వ్యవసాయం- రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ
విధాన రూపకల్పన, వ్యాపార నిర్ణయాలతో పాటు వ్యవసాయ సంబంధ ప్రణాళిక రచనలో కీలకమైన వ్యవసాయ గణాంకాల కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను, పారదర్శకత్వాన్ని పెంపొందింప చేయాలనేదే ఈ కార్యక్రమం ధ్యేయం
వ్యవసాయ సంబంధ గణాంకాల నాణ్యతను పెంచాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య నిరంతర సహకారం ఎంతైనా అవసరం: శ్రీ దేవేశ్ చతుర్వేది
प्रविष्टि तिथि:
22 AUG 2024 4:08PM by PIB Hyderabad
వ్యవసాయం- రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దేవేశ్ చతుర్వేది అధ్యక్షతన ఒక జాతీయ స్థాయి సమావేశాన్ని భారత ప్రభుత్వ వ్యవసాయం-రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలో ఈ రోజున నిర్వహించింది. దేశమంతటా వ్యవసాయ గణాంకాలను మెరుగుపరచాలన్న ధ్యేయంతో సరికొత్త కార్యక్రమాలపై తర్కించి చర్చోపచర్చలు చేయడానికి అన్ని రాష్ట్రాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమం లో భాగంగా సమావేశమయ్యారు. విధానాలకు రూపకల్పన, వ్యాపార నిర్ణయాలతో పాటు వ్యావసాయిక ప్రణాళిక రచనలో సైతం కీలకం అయిన వ్యవసాయ సంబంధిత గణాంకాల్లో కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను, పారదర్శకత్వాన్ని పెంపొందింప చేయాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశంగా ఉంది.
వ్యవసాయ ఉత్పత్తి సంబంధిత అంచనాలను పెంచడంతో పాటు డేటా తాలూకు కచ్చితత్వాన్ని పటిష్ట పరచడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఏకీకరించాలన్నది ఈ సమావేశం దృష్టి సారించిన ప్రధానాంశంగా ఉంది. ఈ సంవత్సరం బడ్జెటు ప్రసంగంలో ప్రకటించిన డిజిటల్ క్రాప్ సర్వేక్షణ కచ్చితమైన పంటల విస్తీర్ణ అంచనాకు మార్గాన్ని సుగమం చేసింది. ఇది పంటల సంబంధిత ప్రాంతాలకు జియో టాగ్ సహాయంతో నిర్ధిష్ట పొలంవారీ డేటాను అందించనుంది. ఈ డేటా యదార్థ విషయాలకు ఏకైక వనరుగా కూడా ఉపయోగపడుతుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన పంటలన్నింటికీ ఉద్దేశించిన శాస్త్రీయంగా రూపొందించిన పంట కోతల ప్రయోగాల ఆధారంగా దిగుబడిని లెక్కగట్టడానికి గాను డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డిజిసిఇఎస్)ను మొదలు పెట్టడమైంది. ఈ కార్యక్రమాలు నేరుగా పొలం నుంచి దాదాపుగా వాస్తవ కాలం మరియు విశ్వసించదగిన డేటాను సమకూర్చుతాయన్న ఆశ ఉంది. అదే జరిగితే పంటల ఉత్పాదనను మరింత నిక్కచ్చితనంతో అంచనా వేయడం సాధ్యపడుతుంది.
పంటల ఉత్పత్తి సంబంధిత గణాంకాల తాలూకు కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను పెంచడానికి రిమోట్ సెన్సింగ్, భూస్థానిక విశ్వేషణ (జియోస్పేషల్ అనాలిసిస్), కృత్రిమ మేధ (ఏల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్.. ఎఐ) వంటి అత్యాధునిక సాంకేతికతలను ఏకీకృతం చేయవలసిన అవసరాన్ని ఈ సమావేశం లో స్పష్టం చేయడమైంది. పునర్ వ్యవస్థీకరించిన ఎఫ్ఎఎస్ఎఎల్ (ఫోర్ కాస్టింగ్ అగ్రికల్చర్ అవుట్ పుట్ యూజింగ్ స్పేస్, అగ్రో-మెటియోరాలజీ, అండ్ లాండ్-బేస్డ్ అబ్జర్వేషన్స్) అండతో పంటల ఉత్పత్తి సంబంధిత గణాంకాలను సిద్ధం చేయడానికి గాను సాంకేతికతను అందించే విషయంలో వ్యవసాయం-రైతుల సంక్షేమం విభాగం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఉన్నతీకరించిన ఈ నమూనా కచ్చితమైన పది ప్రధానమైన పంటలకు సంబంధించి నిర్దుష్ట క్రాప్ మేపులను మరియు విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను ఉపయోగించుకొంటుంది. పంట దిగుబడి ముందస్తు అంచనాల విషయంలో స్పేస్ అప్లికేషన్ సెంటర్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్ టిట్యూట్, భారతీయ వ్యవసాయ గణాంకాల పరిశోధన సంస్థ, ఇంకా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇకనామిక్ గ్రోత్ వంటి వివిధ ప్రత్యేక సామర్థ్యం కలిగిన సంస్థలతో సమన్వయాన్ని నెలకొల్పుకోవడమైంది. ఈ సంస్థలు అఖిల భారత స్థాయిలో ఎంపిక చేసిన పంటల దిగుబడి అంచనాలను సిద్ధం చేయడానికి వేరు వేరు నమూనాలపై కృషి చేయవలసి ఉంటుంది. ఇవే తరహా నమూనాలను వేరు వేరు రాష్ట్రాలు పంట బీమా సంబంధిత ఎస్-టెక్ (Yes-Tech) కార్యక్రమాలలో భాగంగా కూడా ఉపయోగించుకొంటున్నాయి.
సమావేశంలో మరొక కీలకమైన కోణం ఏమిటి అంటే, అది యుపిఎజి పోర్టల్ (UPAg Portal) ను ఉపయోగించుకొంటూ, వ్యవసాయ సంబంధ సమాచారాన్ని మూడు కోణాలలో విశ్లేషించి, ఆ సమాచారం తాలూకు సక్రమతను నిర్ధారించడమే అని చెప్పాలి. ఈ వేదిక బహుళ మార్గాలలో వచ్చే సమాచారాన్ని సరిచూడడానికి మార్గాన్ని సుగమం చేసి, తద్ద్వారా వ్యవసాయ సంబంధ గణాంకాల సుదృఢత్వానికి పూచీ పడుతుంది. దీనిలో కచ్చితమైన పంట అంచనాల రూపకల్పన కోసం వేరు వేరు మార్గాలను కలిపేందుకు ఒక ఉన్నత స్థాయి డేటా నిర్వహణ వ్యవస్థ ఇమిడిపోయివుంది. ఇది రుజువులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది; అంతేకాకుండా, విధాన రూపకర్తలకు, సంబంధిత వర్గాలన్నింటికీ వ్యవసాయ పరమైన డేటా సంబంధి లభ్యత కు గాను కేంద్రీయ హబ్ గా కూడాను పనిచేస్తుంది.
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఎస్‌పిఐ)తో వ్యవసాయం-రైతుల సంక్షేమ విభాగం జట్టుకట్టాలని కూడా ఈ సమావేశం నొక్కిచెప్పింది. ఇదే జరిగితే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఒ) అందించే దశల వారీ ప్రణాళిక సాయంతో పంటకోతల ప్రయోగాలపై పర్యవేక్షణను అధికం చేయవచ్చు; అంతేకాక, సిసిఇ మరియు రాష్ట్ర స్థాయి దిగుబడి అంచనాల్లో నాణ్యతను స్వతంత్ర ఏజెన్సీ తో నిర్ధారించడం సాధ్యమవుతుంది.
ఈ కొత్త కార్యక్రమాలతో సిద్ధించే లాభాలను వివరించే ఒక సమగ్రమైన సమర్పణ కూడా ఈ సమావేశంలో చోటుచేసుకొంది. డిజిటల్ సర్వేక్షణలు, ఉన్నత స్థాయి సాంకేతికతలను అనుసరిస్తే ఏ విధంగా డేటా సేకరణ ను మరింత పక్కాగా మారుస్తుందో, ఆ ప్రక్రియలో లోటుపాటుల తగ్గుదలకు మార్గాన్ని సుగమం చేస్తుందో, వ్యవసాయ రంగంలో మెరుగైన విధాన నిర్ణయాలను తీసుకోవడంలో తోడ్పాటును అందిస్తుందో ఈ సమర్పణ ప్రముఖంగా చాటిచెప్పింది.
శ్రీ దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, వ్యవసాయ సంబంధ గణాంకాల నాణ్యతను పెంచాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య నిరంతర సమన్వయం ఏర్పడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కొత్త కొత్త కార్యక్రమాలను సకాలంలో అమలుపరుస్తూ, వాటి ప్రభావవంతమైన ఫలితాల సాధన దిశగా చొరవ తీసుకోవలసిందిగా రాష్ట్రాలకు ఆయన సూచించారు.
ఈ విధమైన సంస్కరణల ప్రాముఖ్యం విషయంలో ఏకాభిప్రాయంతోను, అన్ని రాష్ట్రాలు వ్యవసాయ రంగం గణాంక సంబంధి వ్యవస్థను బలపరచడానికి కలిసికట్టుగా పనిచేయాలన్న వాగ్దానంతోను ఈ సమావేశం ముగిసింది. భారతదేశంలో వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్ధికి ఇవి ఎంతో కీలకం.
***
(रिलीज़ आईडी: 2047892)
आगंतुक पटल : 133