రక్షణ మంత్రిత్వ శాఖ
15,000 అడుగుల ఎత్తులో కచ్చితమైన పారా డ్రాప్ ద్వారా తొలిసారి 'భీష్మ్’ను నిర్వహించిన భారత వాయుసేన, భారత సైన్యం
Posted On:
17 AUG 2024 10:03AM by PIB Hyderabad
భారత వైమానిక దళం, భారత సైన్యం సంయుక్తంగా 15,000 అడుగుల ఎత్తులో ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ పారా డ్రాప్ కార్యకలాపాలు నిర్వహించాయి. ఆ తరహాలో ఇది మొదటి కచ్చితమైన పారా డ్రాప్. ప్రాజెక్ట్ భీష్మ్ (భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి) ద్వారా ఈ కీలకమైన గాయ ఉపశమన క్యూబులను దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రభావిత ప్రాంతాలకు మానవీయ సాయం, విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్) కింద కీలకమైన సామగ్రి అందించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత వాయుసేన తన అధునాతన వ్యూహాత్మక రవాణా విమానం సి-130 జె సూపర్ హెర్క్యులస్ ను ఉపయోగించి క్యూబును వాయుమార్గంలో తీసుకెళ్లి పారా డ్రాప్ చేసింది. ఈ తరహా కార్యకలాపాల నిర్వహణలో ప్రావీణ్యం కలిగిన భారత సైన్యానికి చెందిన పారా బ్రిగేడ్ తన అధునాతన తరలింపు పరికరాల సాయంతో ఈ గాయ ఉపశమన క్యూబును విజయవంతంగా మోహరించడంలో కీలక పాత్ర పోషించింది. అత్యంత మారుమూల, పర్వత ప్రాంతాలలో కూడా హెచ్ఏడీఆర్ కార్యకలాపాలను ఇది సమర్ధంగా నిర్వహించగలదని రుజువైంది.
భీష్మ్ గాయ ఉపశమన క్యూబ్ ను విజయవంతంగా పారా డ్రాప్ చేసి మోహరించడం సాయుధ దళాల సమన్వయం, సమష్టితత్వానికి నిదర్శనం. ఆపత్కాలంలో తొలి ప్రతిస్పందకులుగా సకాలంలో, సమర్థవంతమైన సహాయాన్ని అందించడంలో వారి నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.
***
(Release ID: 2046896)
Visitor Counter : 75