ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే కథనానికి రాజ్యాంగబద్ధత కల్పించాలంటూ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టును కోరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది: ఉపరాష్ట్రపతి ఆవేదన


దేశ సంక్షేమం కంటే పక్షపాత లేదా స్వప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే శక్తులను నియంత్రించాలని యువతను కోరిన ఉపరాష్ట్రపతి

సివిల్ సర్వీస్ ఉద్యోగాల ఆకర్షణ నుండి బయటపడే సమయం ఆసన్నమైంది: యువతకు ఉపరాష్ట్రపతి సూచన

సంప్రదాయ ఉపాధి మార్గాలు కాకుండా, లాభదాయకమైన, ప్రతిభావంతమైన మార్గాలను అన్వేషించాలి.

గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వం ఉన్న భారత్, మేధో సంపత్తి కలిగిన బంగారు గని: ఉపరాష్ట్రపతి

అంతర్జాతీయ వాణిజ్యానికి మేధో సంపత్తి మూలాధారం: ఉపరాష్ట్రపతి

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే భారతదేశ మేధో సంపత్తి ప్రస్థానం

మన ప్రాచీన వేదాల నుండి వచ్చిన జ్ఞానం మన మేధో సంపత్తికి తార్కాణం

స్వేచ్ఛాయుత ఆలోచనలు, జ్ఞానం సమాజాభివృద్ధికి అవసరం: ఉపరాష్ట్రపతి

Posted On: 16 AUG 2024 2:45PM by PIB Hyderabad

మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ఉద్దేశించిన కథనానికి రాజ్యాంగపరంగా ఊపిరిపోయాలంటూ సుప్రీంకోర్టును కోరుతూ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటీవల బహిరంగ ప్రకటనలు చేయడంపై  ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఐపీ లా అండ్ మేనేజ్‌మెంట్‌లో జాయింట్ మాస్టర్స్/ఎల్ఎల్.ఎం డిగ్రీ మొదటి బ్యాచ్‌ విద్యార్ధులను  ఉద్దేశించి శ్రీ ధన్కడ్ ప్రసంగించారు. “... శాసనసభ కావచ్చు, కార్యనిర్వాహక వర్గం కావచ్చు. న్యాయవ్యవస్థ కావచ్చు... ఆ వ్యవస్థల అధికార పరిధిని భారత రాజ్యాంగం నిర్వచించింది. న్యాయస్థానాల అధికార పరిధిని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా చూడండి.. అమెరికా సుప్రీంకోర్టును చూడండి... యూకే అత్యున్నత న్యాయస్థానం లేదా మరేదైనా చూడండి. ఫిర్యాదు లేకుండా తనకు తానుగా కేసును స్వీకరించిన సందర్భం ఒక్కసారైనా ఉందా? రాజ్యాంగంలో పొందుపరిచినవి కాకుండా, పరిష్కారాన్ని అందించారా? రాజ్యాంగం అధికార పరిధినీ, అప్పీలేట్ అధికార పరిధినీ అందిస్తోంది. ఇది సమీక్షకు కూడా అవకాశం ఇస్తోంది" అని ఉపరాష్ట్రపతి ధన్కడ్ అన్నారు. 

 

"మనకు నివారణ మార్గం ఉంది! రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి  గత వారం, బహుళ ప్రచారం కలిగిన మీడియాలో చేసిన ప్రకటనపై నేను చాలా ఆందోళన చెందాను. మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే కథనానికి అధికార పరిధి కల్పించాలని, సుప్రీంకోర్టు సూమోటోగా ముందుకు రావాలని అభ్యర్థిస్తూ దీనిని ఒక ప్రచారస్థాయికి చేర్చారు” అని ఉపరాష్ట్రపతి చెప్పారు.

దేశ సంక్షేమం కాకుండా, పక్షపాత లేదా స్వప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే శక్తులను యువత నిర్వీర్యం చేయాలనీ, ఇటువంటి దుశ్చర్యలు దేశ ప్రగతికి విఘాతమని ఉపరాష్ట్రపతి సూచించారు. 

తామర తంపరగా పెరుగుతున్న కోచింగ్ సెంటర్లు, వార్తాపత్రికలలో వాటి ప్రకటనలను శ్రీ ధన్కడ్ ప్రస్తావించారు.  పదే  పదే వారు విజేతల ఫోటోలను మాత్రమే ప్రచురిస్తారని, తద్వారా ఎక్కువ మందిని ఆకర్షిస్తారని వెల్లడించారు.

కోచింగ్ సెంటర్ల మితిమీరిన ఖర్చు... ఒకటో పేజీ, రెండో పేజీ, మూడో పేజీ... మొత్తం వార్తాపత్రిక నిండా ప్రకటనలు... అన్నింటా అవే అబ్బాయిలు, అవే అమ్మాయిల  ఫోటోలు. అవే ముఖాలను  వివిధ సంస్థలు ఉపయోగిస్తూ ఉండడం. ఆయా ప్రకటనలు, వాళ్లు  చేస్తున్న హడావుడికి పెడుతున్న డబ్బు- మంచి భవితను ఆశిస్తున్న విద్యార్థుల నుంచి వచ్చిందే’’ అని శ్రీ ధన్కడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మూసగా సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం వెంపర్లాడే ఆలోచనలను విరమించుకోవాలని, సంప్రదాయ మార్గాలకు అతీతంగా లాభదాయకమైన, ప్రభావవంతమైన కెరీర్ వైపు చూడాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 

“..ఎందుకు ఒకటే మూసలో ఆలోచించాలి? అవకాశాలు పరిమితంగానే ఉన్నయని తెలుసు. కానీ, బయటకు రండి. లాభదాయకంగా, మీకు మేలు చేకూర్చే ఎన్నో అవకాశాలను శోధించండి. అంతరిక్షం, సముద్ర సంపద... వంటి వాటిలో అవకాశాలు ఉండే సాంకేతికత పట్ల మొగ్గు చూపవచ్చు" అని ధన్కడ్ అన్నారు. 

భారతదేశం మేధో సంపత్తికి బంగారు గని అనీ, వేదాలు, పురాతన గ్రంథాలు భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, విజ్ఞానానికి పునాది వంటివని అన్నారు.  భారతదేశ మేధో సంపదకు ఇవన్నీ ప్రధాన ఉదాహరణలుగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. జీవితాలను సుసంపన్నం చేసుకోడానికి, ప్రతి అంశంలోనూ పరిష్కారాలను పొందడానికీ వీలుగా ప్రతి ఒక్కరూ వేదాలను స్వయంగా తెలుసుకోవాలని  ఆయన కోరారు.

రుగ్వేదపు ఆనంత జ్ఞానాన్ని ఉటంకిస్తూ " శ్రేష్ఠమైన ఆలోచనలను అన్ని మార్గాల నుండి రానిద్దాం" అని అన్నారు శ్రీ ధన్కడ్. ఋగ్వేదంలోని ఈ శ్లోక తాత్పర్యం, సామజిక అభివృద్ధి కోసం మేధో సంపత్తి సారాన్ని, ఆలోచనలు, జ్ఞాన, స్వేచ్ఛా ప్రవాహాన్ని ప్రస్తుతిస్తుందని ఆయన తెలిపారు. ఆధునిక గణాంకాలను ఉదహరించే బదులు, నేటి మేధో, ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో మన ప్రాచీన జ్ఞాన ఔచిత్యాన్ని బలోపేతం చేస్తూ, మన ప్రామాణికమైన మూలాల నుండి మనం ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

 

ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో మేధో సంపత్తి (ఐపి) చట్టం, నిర్వహణ పోషించే కీలక పాత్ర గురించి చెబుతూ, ముఖ్యంగా ఆధునిక సృజనాత్మక ప్రయత్నాలను, మన ప్రాచీన జ్ఞానం రెండింటినీ రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచీకరణ యుగంలో 'ఐపి' అంతర్జాతీయ వాణిజ్యానికి మూలస్తంభంగా మారిందని శ్రీ ధన్కడ్ సూచించారు. అత్యధిక జనాభా కలిగి ఉన్న భారత్ వంటి దేశానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికీ, సాంకేతికత బదిలీకి అవకాశం ఇచ్చేలా బలమైన 'ఐపి' రక్షణ అవసరమని ఆయన తెలిపారు. 

'ఐపి'ని బలోపేతం చేసే దిశగా, దేశం సాధించిన ప్రగతిని శ్రీ ధన్కడ్ ప్రస్తావించారు. భారతదేశ శాసన విధానం అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగుతోందని, పటిష్టమైన రక్షణను అందిస్తుందని అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ 'ట్రిప్స్' ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలకు అనుగుణంగా భారతదేశం 'ఐపి' వ్యవస్థను జాగ్రత్తగా రూపొందించుకున్నదని తెలిపారు. ఇది, ఆవిష్కరణ, ప్రపంచ వాణిజ్యం పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
 

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపిఐఐటీ అదనపు కార్యదర్శి శ్రీమతి హిమానీ పాండే, ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎస్ బాజ్‌పాయి, ఇండియన్ లా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వీకే అహుజా, విద్యార్థులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2046270) Visitor Counter : 48