వ్యవసాయ మంత్రిత్వ శాఖ

క్రిషి-డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌- డిజిటల్ జియో-స్పేషియల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌధరి


వాతావరణ మార్పులు, నేల పరిస్థితులు, పంట ఆరోగ్యం, పంట విస్తీర్ణం, సలహాలపై తాజా సమాచారం ద్వారా రైతులను శక్తిమంతం చేసే సాధనంగా జియో స్పేషియల్ ప్లాట్‌ఫామ్- క్రిషి డిఎస్ఎస్ ఆవిష్కరణ.

“భారతదేశంలో వ్యవసాయ విప్లవం- అంతరిక్ష ఆధారిత పరిష్కారాలు” అనే అంశంపై నేడు ఒక రోజు సదస్సు నిర్వహించిన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ.

Posted On: 16 AUG 2024 5:16PM by PIB Hyderabad

2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమై, విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌తో చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్‌ అడుగుపెట్టిన విజయానికి జ్ఞాపకార్థంగా, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఈ విజయంతో, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా, చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారతదేశం అంతరిక్ష విజాయలు సాధించిన దేశాల సరసన చేరింది.

భారత అంతరిక్ష కార్యక్రమాల చరిత్రలో ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, "టచింగ్ ద లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్: భారత అంతరిక్ష విజయ గాథ" అనే సందేశంతో దేశంలోని యువతను అంతరిక్షశాస్త్రం, దాని అనువర్తనాలలో నిమగ్నం చేయడానికీ, వారికి స్ఫూర్తి కలిగించడానికీ అంతరిక్ష శాఖ 2024 ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ శుభ సందర్భంగా, భారతదేశ వ్యవసాయ రంగం అపూర్వమైన వృద్ధిని సాధించడం, దానిని అభివృద్ధి పథంలో నడిపించడంలో అంతరిక్ష పరిజ్ఞానం పోషించే కీలక పాత్ర గురించి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఒక సదస్సును నిర్వహించింది. దేశంలోని వ్యవసాయ ఆవిష్కరణల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచే క్రిషి-డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనే డిజిటల్ జియో-స్పేషియల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభానికి ఈ సదస్సు వేదికైంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌధరి, ఆ శాఖ కార్యదర్శి డా. దేవేష్ చతుర్వేదిల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

క్రిషి-డిఎస్ఎస్ అనేది భారతీయ వ్యవసాయ రంగం కోసం ప్రత్యేకంగా ఆవిష్కరించిన తొలి జియో స్పేషియల్ ప్లాట్‌ఫామ్. ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ సమాచారం, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భజల స్థాయులు, నేల ఆరోగ్య సమాచారం సహా సమగ్ర సమాచారాన్ని ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంచుతుంది. ఏ సమయంలో అయినా, ఎక్కడ నుండి అయినా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

క్రిషి-డిఎస్ఎస్ సమగ్ర వ్యవసాయ నిర్వహణకు తోడ్పాటునందించేందుకు రూపొందిన అనేక సమాచార విభాగాలు ఇందులో ఉన్నాయి. విస్తారమైన పొలాల నుండి అతి చిన్న మట్టి కణం వరకు ప్రతి అంశాన్ని కృషి-డిఎస్ఎస్ లో ఉంటాయి.

 

పంటల మ్యాపింగ్, పర్యవేక్షణలతో వివిధ సంవత్సరాలుగా ఉన్న పంటల మ్యాప్‌లను విశ్లేషించడం ద్వారా పంటల తీరు, పంట మార్పిడి పోకడను తెలుసుకోవచ్చు. అలాగే విభిన్న పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది.

 

కరువు పర్యవేక్షణ సమాచారం ద్వారా కరువు సంభవించడానికి ముందే అప్రమత్తమవడంలో మనకు సహాయపడుతుంది, ఇది నేలలో తేమ, నీటి నిల్వలు, పంట పరిస్థితి, వర్షాల్లేని కాలం వంటి వివిధ సూచికలపై తాజా సమాచారం అందిస్తుంది. అయితే పంట వాతావరణ పరిశీలన సమాచారం ద్వారా పంటలపై వాతావరణ ప్రభావం ఎలా ఉంటుంది, పంట కోతల స్థితి, పంట అవశేషాలను కాల్చడం మొదలైన వాటి గురించి మనకు తెలియజేస్తుంది.

 

ఫీల్డ్ పార్శిల్ సమాచారంతో ఖచ్చితమైన ఫీల్డ్ పార్శిల్ యూనిట్లను మనం విభజించగలగడం వల్ల, ప్రతి పార్శిల్‌ కీ ఉండే ప్రత్యేక అవసరాలు, చేయదలచుకున్న మార్పుల దృష్ట్యా పంట నమూనాలను అర్థం చేసుకోవచ్చు.

 

‘‘ఒక దేశం-ఒక నేల’’ సమాచార వ్యవస్థ నేల గురించిన సమగ్ర సమాచారాన్ని, అనగా నేల రకం, నేల పిహెచ్, నేల ఆరోగ్యం మొదలైన వాటిని మీకు సులభంగా అందుబాటులో ఉంచుతుంది. నేల నీటి సంరక్షణ చర్యలను అమలు చేయడానికి పంట అనుకూలత, భూమి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో నేల గురించిన సమాచారం సహాయకారిగా ఉంటుంది.

పరిశోధకులు, పరిశ్రమలకు వివిధ పంటల సమాచారం అవసరం. నిజ సమాచారంతోపాటు స్పెక్ట్రల్ లైబ్రరీలు, నిజ సమాచార గ్రంథాలయాల ద్వారా క్రిషి-డిఎస్ఎస్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

వరద నీటి ప్రభావాల అంచనా నుండి పంటల బీమా పరిష్కారాల వరకు క్రిషి-డిఎస్ఎస్ ఒక సంపూర్ణ పరిష్కారం. మన రైతులకు సాధికారత కల్పించడం, మన విధానాలను తెలియజేయడం, మన దేశాన్ని పరిపుష్ఠం చేయడం దీని లక్ష్యం.

 

క్రిషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డిఎస్ఎస్)లో అందుబాటులో ఉన్న వివిధ డేటా వనరులను ఏకీకృతం చేయడం ద్వారా, రైతులకు సరైన వ్యక్తిగత సలహాలు, తెగులు దాడి, భారీ వర్షం, వడగళ్ల తుఫాను వంటి విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలతోపాటు వివిధ రైతు-కేంద్రీకృత పరిష్కారాలను రూపొందించవచ్చును.

 

క్రిషి-డిఎస్ఎస్ కేవలం ఒక సాధనం కంటే ఎక్కువ, ఇది వ్యవసాయంలో ఆవిష్కరణలు, సుస్థిరతను వేగవంతం చేస్తుంది. మొత్తంగా, మనం భారతదేశం కోసం ఒక సమర్థవంతమైన, సుస్థిరమైన, సుసంపన్నమైన వ్యవసాయ రంగాన్ని నిర్మించుకుందాం.

 

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, అంతరిక్ష శాఖ, ఇస్రో కేంద్రాలు, వివిధ కేంద్ర ఏజెన్సీలు (ఐఎండి, సిడబ్ల్యూసి, ఎన్‌డబ్ల్యూఐసి, ఎన్ఐసి, ఐసిఎఆర్, ఎస్ఎల్‌యుఎస్ఐ, ఎమ్ఎన్‌సిఎఫ్‌సి), రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, అగ్రిటెక్ పరిశ్రమలకు చెందిన అధికారులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

వ్యవసాయ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగ ప్రస్తుత స్థితిని ప్రదర్శించే వివిధ సాంకేతిక కార్యక్రమాలు, ఉపగ్రహ ఆధారిత సమాచార ఉత్పత్తులను తెలుసుకునేందుకు వీలుగా ఇస్రోకి  చెందిన వివిధ వెబ్ సైట్లను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. వ్యవసాయ రంగంలో అంతరిక్ష సాంకేతికత వల్ల కలిగే ఉపయోగాల గురించి చర్చించడానికి బృంద చర్చలు కూడా నిర్వహించారు.

 

విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, పరిశోధకులతో కూడిన విశిష్ట సమావేశం భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రతను నిర్ధారించడం కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వల్ల లభించే అపార సామర్థ్యాన్ని ప్రధానంగా చర్చించింది.  

సదస్సు ముఖ్యాంశాలు:

·         వ్యవసాయ అభివృద్ధి కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించడం: ఖచ్చితమైన వ్యవసాయం, పంట పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, నేల ఆరోగ్య నిర్వహణలో శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, జియో-స్పేషియల్ టెక్నాలజీ, వాటి అనువర్తనాలు సాధించిన పురోగతిని ఈ సమావేశంలో ప్రదర్శించారు.

·         క్రిషి-డిఎస్ఎస్ ప్రారంభం: వాతావరణ నమూనాలు, నేల పరిస్థితులు, పంట ఆరోగ్యం, పంట విస్తీర్ణం, సలహాలపై తాజా సమాచారం ద్వారా రైతులను శక్తిమంతం చేయడానికి  సాధనంగా జియో-స్పేషియల్ ప్లాట్‌ఫామ్- క్రిషి-డిఎస్ఎస్ ఆవిష్కరణ.

·         పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు: వ్యవసాయంలో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేయడంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ప్రాముఖ్యతను సదస్సు నొక్కి చెప్పింది.

·         రైతు-కేంద్రీకృత విధానం: అంతరిక్ష సాంకేతిక ప్రయోజనాలు కింది స్థాయి వరకూ చేరుకునేలా వినియోగదారుల హితమైన పరిష్కారాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను రూపొందించడం అవశ్యకమని ఈ సమావేశం అభిప్రాయపడింది.

 

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ వివిధ అనువర్తనాలు, అంటే పంట ఉత్పత్తి అంచనా, కరువు పర్యవేక్షణ, పంట ఆరోగ్య అంచనా, పంట బీమా పరిష్కారాల కోసం అంతరిక్ష సాంకేతికత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికీ, భవిష్యత్తులో కూడా అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకునేందుకూ ఈ శాఖ కట్టుబడి ఉంది. భారతీయ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం లబ్దిదారులందరితో కలిసి పనిచేయడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నది.

***



(Release ID: 2046268) Visitor Counter : 5