పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

బిహార్‌లోని బిహ్తాలో రూ.1413 కోట్ల అంచనా వ్యయంతో నూతన పౌర విమానయాన సదుపాయానికి కేబినెట్ ఆమోదం

Posted On: 16 AUG 2024 8:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బీహార్‌ పాట్నాలోని బిహ్తాలో రూ.1413 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా పౌర విమానయాన సదుపాయం అభివృద్ధి చేసేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ) చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం విషయంలో పాట్నా విమానాశ్రయం గరిష్ట స్థాయిని చేరుకుంటుందన్న అంచనాల మధ్య వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకురానున్నారు. ఏఏఐ ఇప్పటికే పాట్నా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించే పనిలో ఉండగా, పరిమిత భూ లభ్యత కారణంగా మరింత విస్తరణకు ఆటంకం ఏర్పడనుంది.

బిహ్తా విమానాశ్రయంలో ప్రతిపాదిత కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవనం 66,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏకకాలంలో రద్దీ సమయాల్లో 3000 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రానుంది. వార్షికంగా 50 లక్షల మంది ప్రయాణికులకు ఈ టర్మినల్ సేవలు అందించనుంది. అవసరమైతే దీని సామర్థ్యాన్ని వార్షికంగా మరో 50 లక్షల ప్రయాణికులకు విస్తరించొచ్చు. అంతిమంగా సంవత్సరానికి కోటి మంది ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం దీనికి ఉండనుంది. ఏ-321/బీ-737-800/ఏ-320 రకం విమానాలకు అనువైన 10 పార్కింగ్ సదుపాయాలు, అలాగే రెండు వాహన మార్గాల(లింక్ టాక్సీవే)ను ఇక్కడ నిర్మించనున్నారు.

***



(Release ID: 2046244) Visitor Counter : 33